డబ్ల్యూహెచ్​వోకు అమెరికా గుడ్​బై

వాషింగ్టన్: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్​వో)కు అమెరికా గుడ్​బై చెప్పింది. డబ్ల్యూహెచ్​వోతో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటున్నామని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ శుక్రవారం వైట్​హౌస్​లో ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల సంభవించిన మరణాలు, విధ్వంసాలకు ఆ సంస్థ.. చైనాలే కారణమని ఆరోపించారు. ఇప్పటివరకు డబ్ల్యూహెచ్​వోకు ఇస్తున్న నిధులను ప్రజారోగ్య సంస్థలకు మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. కరోనాను కట్టడి చేసే విషయంలో డ‌బ్ల్యూహెచ్‌వో ఫెయిల్ అయినట్లు ట్రంప్ కొద్దిరోజులుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. నెల‌ రోజుల కిందట ఆ సంస్థకు నిధులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ .. తాజాగా డ‌బ్ల్యూహెచ్‌వోతో పూర్తిగా సంబంధాలు వదులుకుంటున్నట్లు ప్రకటించారు.

చైనీస్ కు అమెరికాలోకి నో ఎంట్రీ
వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. చైనీస్ కు అమెరికాలో ఎంట్రీపై బ్యాన్ విధిస్తామని, చైనా పెట్టుబడులకు వ్యతిరేకంగా రూల్స్ కఠినతరం చేస్తామని చెప్పారు. హాంకాంగ్ ప్రజల ఫ్రీడంను హరించేలా ఉన్న చైనా జాతీయ భద్రతా బిల్లును ట్రంప్ తప్పుపట్టారు. ఇక హాంకాంగ్ ఇచ్చిన స్పెషల్ స్టేటస్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. మునుపెన్నడూ లేనంతగా అమెరికాను చైనా కొల్లగొడుతోందని ఆరోపించారు. అమెరికా టెక్నాలజీని, మేధో సంపత్తిని దొంగిలించి వాడుకుంటోందని, బిలియన్ డాలర్ల విలువైన ఉద్యోగాలను పోగొట్టేందుకు కారణమైందని మండిపడ్డారు. ప్రపంచ వాణిజ్య సంస్థ పట్ల కూడా తన నిబద్ధతను ఉల్లంఘించిందని, ఇండో-పసిఫిక్ మహాసముద్రంలో చట్టవిరుద్ధంగా భూభాగాలను క్లెయిమ్ చేసిందని, నావిగేషన్..అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తోందని ఆరోపించారు. వైరస్ ను అంటగట్టినన చైనా.. ప్రపంచానికి చాలా సమాధానాలు చెప్పాల్సి ఉందని హెచ్చరించారు.

Latest Updates