TS కాప్ లేటెస్ట్ టెక్నాలజీ: ఫేస్‌ రికగ్నైజేషన్‌ తో మిస్సింగ్ కేసులకు చెక్

FACEనేరాలను అరికట్టడంలో టెక్నాలజీ వినియోగం పెరిగిపోవడంతో అనుమానిత వ్యక్తులను అక్కడికక్కడే గుర్తించేందుకు ఈ ఫేస్‌ రికగ్నైజేషన్‌ ను అమల్లోకి తీసుకొచ్చింది తెలంగాణ పోలీసు శాఖ. నేరాలు జరిగిన ప్రాంతాలను ఇప్పటికే క్రైమ్‌ హాట్‌స్పాట్స్‌గా గుర్తించింది. ఇప్పటికే  రాష్ట్రవ్యాప్తంగా కనిపించకుండా పోయిన వారి లిస్టును, ఫొటోలు TSకాప్‌ యాప్‌కు అనుసంధానించారు పోలీసు ఉన్నతాధికారులు. దీంతోపాటు అదృశ్యమైన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఫొటోలను ట్యాబ్‌ ద్వారా తీసి ఫేస్‌ రికగ్నైజేషన్‌తో సరిపోల్చవచ్చు.

70 వేల మందికి పైగా నేరాలకు పాల్పడుతున్న వారి జాబితాను టీఎస్‌కాప్‌ డేటా సర్వర్‌లోకి అప్‌లోడ్‌ చేశారు. పెట్రోలింగ్‌ చేస్తున్న సందర్భంలో కానీ, నాకాబందీ చేస్తున్న సమయంలో కానీ, వేరే సమయంలో కానీ అనుమానిత వ్యక్తి కనిపిస్తే అతడు పాతనేరస్తుడా.. లేదా కొత్త వ్యక్తా అన్న వివరాలను తెలుసుకునేందుకు ఫేస్‌ రికగ్నైజేషన్‌ ఉపయోగపడనుంది. అనుమానితు డిని ట్యాబ్‌ ద్వారా ఫొటో తీసి టీఎస్‌కాప్‌ పాత ఫొటోతో పోలుస్తుంది.

ఒకవేళ కొత్త వ్యక్తి అయితే వదిలేస్తారు. పాత నేరస్తుడిగా రుజువైతే అదుపులోకి తీసుకొని విచారించేందుకు సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు అనుమానితులపై ఉన్న పాత కేసులను రికార్డులు తిరగేస్తే కానీ తెలిసేవి కావు. ఈ కొత్త విధానం ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఇది కీలకంగా మారుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

అదృశ్యమైన వారి వివరాలు, వాంటెడ్‌ క్రిమినల్స్‌ వివరాలను సరిపోల్చుకునేందుకు మూడు ఆప్షన్స్‌ను టీఎస్‌కాప్‌ యాప్‌లో క్రోఢీకరిస్తున్నారు. ఒకటి మిస్సింగ్‌ ఆప్షన్, రెండోది వాంటెడ్‌ ఆప్షన్, మూడోది మీడియా ఆప్షన్‌ కింద అందుబాటులోకి తెచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏ నేరంలో అరెస్టయినా మీడియా ముందు ప్రవేశపెట్టినప్పటి ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు నిందితుల డేటా అప్‌డేట్‌ అవడంతో పాటు అదృశ్యమైన వారి వివరాలు యాప్‌లో ఉండేలా చేస్తున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates