కొత్తవాళ్లకు నో చాన్స్‌.. గతంలో అప్లై చేసుకున్నోళ్లకే

కొత్తవాళ్లకు నో చాన్స్‌.. గతంలో అప్లై చేసుకున్నోళ్లకే
  •     పెండింగ్‌లో ఉన్న 4,97,389 అప్లికేషన్ల వెరిఫికేషన్‌
  •     మంత్రి గంగుల ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌​కమిటీ నిర్ణయం


హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న రేషన్‌ కార్డుల దరఖాస్తులు మాత్రమే పరిశీలించాలని కేబినెట్‌​సబ్‌ కమిటీ నిర్ణయించింది. దీంతో కొత్త వారు రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. సోమవారం బీఆర్‌‌కే భవన్‌లో సివిల్‌ సప్లయ్స్‌ మంత్రి గంగుల కమలాకర్‌‌ ఆధ్వర్యంలో మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కూడిన కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమై కొత్త రేషన్‌ కార్డుల జారీపై చర్చించింది. దీంతో పాటు డీలర్ల కమీషన్ పెంపు, రేషన్‌ షాపుల ఖాళీల భర్తీ తదితర అంశాలపై చర్చించి ప్రతిపాదనలు చేశారు. వీటిని సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపించామని మంత్రి గంగుల తెలిపారు. 

10 రోజుల్లో వెరిఫికేషన్‌ కంప్లీట్‌ చేస్తాం

రాష్ట్రవ్యాప్తంగా రేషన్​కార్డుల కోసం 4,97,389 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి గంగుల కమలాకర్‌‌ తెలిపారు. వీటి జారీ ప్రక్రియలో భాగంగా వెరిఫికేషన్‌ను ప్రారంభించి 10 రోజుల్లో పూర్తిచేసి నివేదికను సీఎం కేసీఆర్‌‌కు సమర్పించాలని భేటీలో నిర్ణయించామన్నారు. రేషన్ కార్డులో మార్పులు, కొత్త పేర్ల చేరికలు, తీసివేతలపై సబ్ కమిటీ చర్చించిందని తెలిపారు. అలాగే డీలర్లకు కమిషన్‌పై వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న టారీఫ్‌లను పరిశీలించి నిర్ణయిస్తామని చెప్పారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇచ్చే అంశం, రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1,454 రేషన్ షాపులతో పాటు కొత్త కార్డుల జారీతో ఏర్పడే ఖాళీలపై నివేదికను త్వరలోనే సీఎం‌కు సమర్పించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంగుల వెల్లడించారు. కేంద్రం (ఎన్ఎఫ్ఎస్ఏ) పథకం కింద 53.56 లక్షల కార్డులు, కోటి 91 లక్షల 69 వేల 600 మంది లబ్ధిదారులు, రాష్ట్ర పథకంలో 33.85 లక్షల కార్డులు, 87 లక్షల 54 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని, మొత్తం 87.41 లక్షల కార్డులు, 2 కోట్ల, 79 లక్షల 23 వేల 600 మంది లబ్ధిదారులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నారని తెలిపారు. సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌‌, సివిల్ సప్లైస్‌ కమిషనర్‌‌ అనిల్‌ కుమార్‌‌ తదితరులు పాల్గొన్నారు.