మున్సిపాలిటీల్లో మళ్లీ డీలిమిటేషన్‌‌

  • హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర సర్కారు నిర్ణయం
  • నేటి నుంచి 9 వరకు ప్రజల నుంచి సలహాల స్వీకరణ
  • 16 వరకు విచారణ..17న తుది నోటిఫికేషన్‌‌
  • ఈ వార్డుల ఆధారంగానే మున్సిపల్​ ఎన్నికలు
  • జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌‌
  • సంక్రాంతి తర్వాత పోలింగ్‌‌?

హైదరాబాద్‌‌, వెలుగు:

రాష్ట్రంలోని పది మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌లు, 121 మున్సిపాలిటీల్లో మళ్లీ వార్డుల డీలిమిటేషన్‌‌ ప్రక్రియ చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వార్డుల పునర్విభజనకు మంగళవారం మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌, అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. బుధవారం నుంచి ఈ నెల 9 వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని 16వ తేదీలోగా వాటిపై విచారణ పూర్తి చేస్తారు. అదే రోజు వార్డుల డ్రాఫ్ట్‌‌ నోటిఫికేషన్‌‌ను మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​ అండ్​ అర్బన్ డెవలప్​మెంట్(ఎంఏయూడీ)కి సమర్పించి, ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ ఆమోదంతో 17న డీలిమిటేషన్‌‌పై ఫైనల్‌‌ నోటిఫికేషన్​ జారీ చేస్తారు. దీని ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్లు నిర్వహించనుంది. జనవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌‌ ఇచ్చి, సంక్రాంతి తర్వాత పోలింగ్‌‌ నిర్వహించేలా షెడ్యూల్‌‌ రూపొందిస్తున్నట్టు తెలిసింది.

హైకోర్టు ఆదేశాలతో..

రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో వార్డుల విభజనకు ఈ ఏడాది జూన్‌‌ 29న ప్రభుత్వం షెడ్యూల్‌‌ విడుదల చేసింది. జులై 6 నాటికి డీలిమిటేషన్‌‌ ప్రాసెస్‌‌ కంప్లీట్‌‌ చేసి, 7న ఫైనల్‌‌ నోటిఫికేషన్‌‌ ఇచ్చింది. వార్డుల విభజన అశాస్త్రీయంగా చేశారని, కొన్ని పార్టీలకు లాభం చేకూర్చేలా అధికారులు వ్యవహరించారని, ఓటర్ల సంఖ్య ఒక వార్డుతో పోలిస్తే ఇంకో వార్డుకు భారీ వ్యత్యాసం ఉందంటూ 73 మున్సిపాలిటీలకు చెందిన ప్రజలు, వివిధ పార్టీల నేతలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిని విచారించిన సింగిల్‌‌ జడ్జి 73 మున్సిపాలిటీల్లో ఎన్నికలపై స్టే విధించారు. మున్సిపల్‌‌ శాఖ డీలిమిటేషన్‌‌పై జారీ చేసిన ఫైనల్‌‌ నోటిఫికేషన్‌‌ను ఉప సంహరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలపడంతో ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. వార్డుల పునర్విభజన ప్రక్రియను మళ్లీ చేపట్టాలని, 14 రోజుల్లోగా దానిని పూర్తి చేయాలని ఆదేశించింది.

షెడ్యూల్​లోగా పూర్తికి చర్యలు

హైకోర్టు ఆదేశాలతో స్టే తొలగించిన 73 మున్సిపాలిటీలతోపాటు మిగిలిన 58 మున్సిపాలిటీల్లోనూ వార్డుల డీలిమిటేషన్‌‌ ప్రక్రియ చేపట్టాలని, మళ్లీ ఎలాంటి అభ్యంతరాలు రాకుండా పకడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. మంగళవారం డీలిమిటేషన్‌‌కు సంబంధించిన ప్రతిపాదనలను ఆయా మున్సిపాలిటీల్లోని నోటీస్‌‌ బోర్డులపై అతికించాలని, బుధవారం ప్రముఖ దినపత్రికల్లో అడ్వర్టైజ్‌‌మెంట్‌‌ ఇవ్వాలని ఆదేశించింది. అన్ని వార్డుల విభజన తూర్పు-పడమర, ఉత్తర-దక్షిణ దిక్కుల్లో క్లాక్‌‌ వైజ్‌‌ డైరెక్షన్‌‌లో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒక వార్డుకు మరో వార్డుకు మధ్య ఓటర్ల సంఖ్యలో పది శాతానికి మించకుండా వ్యత్యాసం ఉండేలా జాగ్రత్త పడాలని సూచించింది. ప్రజల నుంచి వచ్చే ప్రతి సూచనను పరిశీలించాలని, వాటిని పరిగణనలోకి తీసుకున్నామా? తిరస్కరించామా? అనే విషయాన్ని సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలని ఆదేశించింది. షెడ్యూల్‌‌లోగా డీలిమిటేషన్‌‌ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

ఓటర్ల లిస్ట్‌‌, రిజర్వేషన్ల ఖరారుకు ఇంకో 14 రోజులు

డీలిమిటేషన్‌‌ ప్రాసెస్‌‌ను 14 రోజుల్లో కంప్లీట్‌‌ చేసి, 17వ రోజున ఫైనల్‌‌ నోటిఫికేషన్‌‌ ఇస్తున్న మున్సిపల్‌‌ శాఖ, దాని తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియకు ఇంకో 14 రోజుల టైం తీసుకోనుంది. వార్డుల వారీగా ఓటర్ల లిస్ట్‌‌ ప్రచురించేందుకు ఏడు రోజులు, ఆ తర్వాత వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ఇంకో ఏడు రోజుల టైం పడుతుందని మున్సిపల్‌‌ ఉన్నతాధికారులు తెలిపారు. 17న ఓటర్ల లిస్ట్‌‌ పబ్లికేషన్‌‌ ప్రక్రియను మొదలు పెడితే 23న ఓటర్ల లిస్ట్‌‌ పబ్లిష్‌‌ చేస్తామని చెప్పారు. 23న రిజర్వేషన్ల ఖరారు ప్రాసెస్‌‌ మొదలు పెడితే 31 నాటికి ఆ ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. జనవరి 1 నాటికి మొత్తం ప్రాసెస్‌‌ కంప్లీట్‌‌ అవుతుందని తెలిపారు.

సంక్రాంతి తర్వాత మున్సి‘పోల్స్’?

జనవరి మొదటి వారంలో మున్సిపల్‌‌ ఎన్నికల నోటిఫికేషన్‌‌ జారీ చేయనున్నట్టు తెలిసింది. వార్డుల డీలిమిటేషన్‌‌, ఓటర్ల లిస్టు, రిజర్వేషన్లను ఖరారు చేసి జనవరి రెండు లేదా మూడో తేదీల్లో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎంఏయూడీ సమర్పించే అవకాశముంది. సంక్రాంతి పండుగ తర్వాత పోలింగ్‌‌ నిర్వహణకు ప్రభుత్వం సముఖంగా ఉన్నట్టు సమాచారం. జనవరి 20, 21 తేదీల్లో ఏదో ఒక రోజు పోలింగ్‌‌ నిర్వహించేలా నోటిఫికేషన్‌‌ ఇవ్వనున్నట్టు తెలిసింది. నోటిఫికేషన్‌‌ జారీ చేసిన తేదీ నుంచి 15వ రోజు పోలింగ్‌‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లెక్కన జనవరి 5(ఆదివారం), 6(సోమవారం) తేదీల్లో ఏదో ఒక రోజు నోటిఫికేషన్‌‌ ఇవ్వనున్నట్టు సమాచారం. రిపబ్లిక్‌‌ డే తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించే అవకాశమున్నట్టు తెలిసింది.

TS government has decided to take up the delimitation In 121 municipalities of wards

Latest Updates