సర్కార్ ఫోకస్ : రిటైర్మెంట్​ ఏజ్​ 61

ఏప్రిల్​ 1 నుంచి అమలు?
ప్రస్తుత పదవీ విరమణ వయసు 58 ఏండ్లు
పీఆర్సీ కన్నా దీనిపైనే రాష్ట్ర సర్కార్ ఫోకస్
కొందరు ఉద్యోగులైనా సంతృప్తి చెందుతారని ఆశ
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటన!
పెంపుతో సర్కార్ కు రిలీఫ్ మూడేండ్ల దాకా రిటైర్మెంట్
బెనిఫిట్స్​ ఇచ్చే పనుండదు త్వరలో ఉద్యోగ సంఘాల
నేతలతో సీఎం భేటీ

హైదరాబాద్, వెలుగుప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్​ను 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచేందుకు రాష్ట్ర సర్కార్​ రంగం సిద్ధం చేస్తున్నది. దీన్ని ఏప్రిల్​ 1 నుంచి అమలుచేసే అవకాశం ఉంది. ఈ మేరకు గతవారం ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్​ గ్రీన్​సిగ్నల్​ కూడా ఇచ్చినట్లు తెలిసింది. రిటైర్మెంట్ వయస్సును పెంచితే ఖజానాకు ఎంత వరకు రిలీఫ్​ ఉంటుందనే దానిపై అధికారులు లెక్కలు తీశారు. రెండేండ్లుగా పీఆర్సీ రాకపోవడంతో గరంగా ఉన్న ఉద్యోగుల్లో కొందరినైనా సంతృప్తి పరచాలంటే రిటైర్మెంట్​ ఏజ్​ పెంపు హామీని  అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఈ హామీని ఇచ్చింది. ఇదే అంశంపై త్వరలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్​ భేటీ కానున్నారని ఓ సీనియర్​ ఆఫీసర్​ చెప్పారు. ఆ మీటింగ్​లో రిటైర్మెంట్​ ఏజ్​ పెంపు, పీఆర్సీలపై సీఎం ఫైనల్ ప్రకటన చేయొచ్చని ఆయన అన్నారు.

మూడేండ్లు రిలీఫ్​ దొరుకుతుందని..!

రిటైర్మెంట్ వయసును పెంచితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాపై భారం తగ్గుతుందని అధికారులు అంటున్నారు. మూడేండ్ల పెంపుతో దాదాపు రూ. 9 వేల కోట్ల వరకు రిలీఫ్​ ఉంటుందని వారు లెక్కలు గట్టారు. ఆర్థిక పరిస్థితి ఆశించినట్టుగా లేకపోవడంతో పీఆర్సీ అమలు కంటే ముందు రిటైర్మెంట్​ వయసును పెంచాలనే నిర్ణయానికి సీఎం వచ్చినట్టు ఓ సీనియర్​ అధికారి తెలిపారు. ప్రతి నెల సగటున 450, ఏడాదికి దాదాపు 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వీరికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ భారం ఏడాదికి దాదాపు రూ. 3,000 కోట్ల వరకు ఉంటుందని, మూడేండ్లలో అది దాదాపు రూ. 9 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రిటైర్మెంట్​ వయసును పెంచడంతో మూడేండ్ల వరకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, అప్పటివరకు రాష్ట్ర సర్కార్​ కొంచెం ఊపిరి పీల్చుకునే చాన్స్​ దొరుకుతుందని వారు భావిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించే చాన్స్​

రిటైర్మెంట్ వయసు పెంపు హామీ అమలు గురించి త్వరలో జరిగే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో సీఎం కేసీఆర్​ ప్రకటన చేసే చాన్స్ ఉంది.  అదే సమయంలో పీఆర్సీ విషయంపై కూడా క్లారిటీ ఇవ్వొచ్చని ఓ అధికారి అన్నారు. మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్​ వచ్చిన రోజు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించినట్టుగా లేకపోవడం వల్ల ఉద్యోగులకు పీఆర్సీని తృణమో, పణమో ఇస్తాం’ అని అన్నారు. తాజాగా పీఆర్సీ కమిటీ గడువు పెంచడంతో ఉద్యోగులు కోపంగా ఉన్నారు.

సంఘాల లీడర్లు హ్యాపీ!

రిటైర్మెంట్ వయసు పెంచితే కొందరు యూనియన్ లీడర్లు సంతోషంగా ఉంటారనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల్లో మెజార్టీ నేతలు 58 ఏండ్లకు దగ్గరలో ఉన్నారు. వీరంతా పీఆర్సీ అమలు కంటే రిటైర్మెంట్ వయసుపెంపు కోసమే ఎదురుచూస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 58 ఏళ్ల నుంచి 61 ఏండ్లకు వయోపరిమితిని అమలు చేస్తే మరో మూడేళ్లపాటు ఉద్యోగ సంఘాలకు ఆయా నేతలు లీడర్లుగా ఉండొచ్చనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం

Latest Updates