ఎక్కువ కరోనా టెస్టులేవి?..ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

  • లక్షణాలు ఉంటేనే టెస్టులు చేస్తామనడం కరెక్టేనా?
  • ఈ టైంలో చనిపోయినోళ్లకు కూడా టెస్టులు చేయకపోతే ఎట్లా!
  • ఇవేవీ లేకుండా, కేసులు తగ్గాయనడం ప్రజలను ఫూల్స్‌ చేయడమే
  • ప్రభుత్వం తనను తాను మోసం చేసుకోవద్దు
  • మనమంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తది
  • పూర్తి వివరాలతో కౌంటర్​ దాఖలు చేయాలని ఆదేశం

హైదరాబాద్ , వెలుగురాష్ట్రంలో కరోనా టెస్టుల తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎక్కువగా టెస్టులు ఎందుకు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లక్షణాలు ఉంటేనే టెస్టులు చేస్తామనే నిర్ణయానికి కారణం ఏమిటో చెప్పాలని, ఈ నిర్ణయం వెనుక ఉన్న సైంటిఫిక్​ రీజనింగ్​ ఏమిటో వివరించాలని ఆదేశించింది. అట్లనే,మహమ్మారి పొంచి ఉన్న ఇలాంటి టైంలో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాలకు కరోనా టెస్టులు చేయకుండానే  కేసులు తగ్గాయని లెక్కలు ప్రకటిస్తే అది ప్రజలను ఫూల్స్‌‌ చేయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​ ప్రకారం చూసినా.. కరోనా అనుమానిత వ్యక్తి కుటుంబసభ్యులకు,  ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా టెస్టులు చేసి క్వారంటైన్​కు తరలించాల్సిందేనని తేల్చిచెప్పింది. చనిపోయిన వ్యక్తికి టెస్టులు చేయొద్దని ఆ గైడ్​లైన్స్​లో ఎక్కడా లేదని పేర్కొంది. కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత టైంలో మరణించినవాళ్లకు కూడా కరోనా టెస్టులు చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని, కరోనా పేషెంట్లకు ట్రీట్​మెంట్​ అందిస్తున్న డాక్టర్లకు, హెల్త్​ స్టాఫ్​కు సరిపోయేంత మెడికల్​ ఎక్విప్​మెంట్స్​ అందించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ రిటైర్డు ప్రొఫెసర్‌‌ పీఎల్‌‌ విశ్వేశ్వర్‌‌రావు  హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు.దీన్ని చీఫ్  జస్టిస్‌‌  రాఘవేంద్ర సింగ్‌‌ చౌహాన్,  జస్టిస్‌‌ బి.విజయ్‌‌ సేన్‌‌ రెడ్డి ఆధ్వర్యంలోని డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం విచారించింది.

అలా చేయడం పద్ధతి కాదు

కరోనా లక్షణాలు ఉన్నవాళ్లకు మాత్రమే టెస్టులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, నిజంగా ప్రభుత్వం ఇలానే చేస్తుంటే ఎంతమాత్రం సరైన పద్ధతి కాదని హైకోర్టు పేర్కొంది. ‘‘ఇలాంటి టైంలో టెస్టులు లేకుండానే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తే.. మృతుడి కుటుంబంలోగానీ, ఇతర సన్నిహితుల్లోగానీ కరోనా  లక్షణాలు ఉన్నాయో లేవో తెలియవు. ఒకవేళ వాళ్లకు కరోనా ఉంటే వాస్తవం భూస్థాపితం అవుతుంది. అలాంటి వాళ్లు జనంలో తిరుగుతూ ఉంటే తీవ్ర ప్రమాదం పొంచి ఉంటుంది” అని హెచ్చరించింది. మృతదేహాలకు కరోనా టెస్టులు చేయకుండా కరోనా కేసులు తగ్గాయని ప్రభుత్వం లెక్కలు వెల్లడించడమంటే ప్రజలను గారడీ చేయడమే అవుతుందని, తప్పుదారి పట్టించడమే అవుతుందని వ్యాఖ్యానించింది.

మనమంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తది

కంటెయిన్​మెంట్​ ఏరియాల్లోని వారికి కరోనా టెస్టులు చేయడం లేదని పిటిషనర్ తరఫు లాయర్​ చిక్కుడు ప్రభాకర్‌‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏరియాల్లోని వారందరికీ టెస్టులు చేయాలని, లేకపోతే కరోనా  తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​  గైడ్​లైన్స్​ ప్రకారం రెడ్‌‌ జోన్లు, ఇతర కంటెయిన్​మెంట్​ ఏరియాల్లోని వారందరికీ ముందు జాగ్రత్తగా కరోనా  టెస్టులు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ స్పందిస్తూ.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్‌‌ జారీ చేసిన గైడ్​లైన్స్​ ప్రకారం రాష్ట్రంలోని డాక్టర్లు శక్తివంచన లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ‘‘రాష్ట్రంలో అనుమానితులకు మాత్రమే కరోనా టెస్టులు చేస్తున్నారు. అయితే.. మీరు చెప్పిన ఆ గైడ్​లైన్స్​ ప్రకారమైనా అనుమానితుడి కుటుంబసభ్యులకు, సన్నిహితంగా మెలిగిన వారికి కూడా టెస్టులు చేసి.. క్వారంటైన్​కు తరలించాలి” అని తేల్చిచెప్పింది. చనిపోయినవ్యక్తికి టెస్టులు చేయొద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్​లోనూ ఎక్కడా లేదని, ఆ గైడ్​లైన్స్​ను మరోసారి స్టడీ చేయాలని ఏజీకి సూచించింది. ‘‘ప్రభుత్వం తనను తాను మోసం చేసుకోవడం ఎంతమాత్రం తగదు. వాస్తవాలను చూడాలి. అందుకు తగ్గట్టు ముందుకు వెళ్లాలి. లేకపోతే మనమంతా మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది’’  అని హెచ్చరించింది. హైదరాబాద్‌‌లోని 32 కంటెయిన్​మెంట్​ ఏరియాల్లో ఎంతమంది జనాభా ఉన్నారో.. వారిలో ఎంత మందికి కరోనా టెస్టులు చేశారో.. తెలియజేయాలని ఆదేశించింది.

పూర్తి వివరాలు అందజేయండి

మృతదేహాల నుంచి కూడా శాంపిల్స్​ తీసుకొని కరోనా టెస్టులు చేయాలని కోరుతూ ఓ పిల్​ తమ ముందు విచారణలో ఉందని హైకోర్టు గుర్తు చేసింది. మృతదేహాలకు కరోనా టెస్టులు అవసరం లేదనే ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్‌ ఏమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

 

Latest Updates