యెస్ బ్యాంక్ లో టీఎస్ ఆర్టీసీ డబ్బులు

  •                 సంస్థకు అవసరమైన టైమ్​లో విత్​డ్రా
  •                 ఇటీవల తగ్గిన కలెక్షన్లతో ఆర్టీసీకి ఇబ్బందులు
  •                 సంక్షోభం రోజు ఉదయమే 80 కోట్లు డ్రా
  •                 లేకుంటే జీతాలకు  మస్తు ఇబ్బందులు
  •                 డబ్బులు ఎక్కడికి పోవంటున్న అధికారులు

 

యెస్‌‌ బ్యాంక్‌‌ సంక్షోభం.. టీఎస్‌‌ ఆర్టీసీనీ టెన్షన్‌‌ పెడుతోంది. ఆర్టీసీ పీఎఫ్‌‌కు సంబంధించి రూ.5 కోట్లు, సీసీఎస్ కు సంబంధించి రూ.60 లక్షలు బ్యాంక్‌‌లో ఉన్నాయి. సంస్థ అవసరాలకు ఈ బ్యాంక్‌‌ నుంచే అధికారులు నిధులు డ్రా చేసి వాడుకుంటారు. ప్రస్తుతం తక్కువగా డబ్బులు ఇస్తుండటంతో ఆర్టీసీకి ఇబ్బందులు తలెత్తే చాన్స్‌‌ ఉంది. కాగా, బ్యాంక్ సంక్షోభం విషయం బయటకు వచ్చిన రోజు ఉదయమే జీతాల కోసం ఆర్టీసీ అధికారులు రూ.80 కోట్లు డ్రా చేశారు. లేకుంటే సిబ్బంది వేతనాలు చెల్లించడం కష్టమయ్యేదని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.

అధిక వడ్డీ కావడంతో..

సాధారణంగా ఆర్టీసీలో అన్ని లావాదేవీలు ఎస్‌‌బీఐ అకౌంట్‌‌ ద్వారానే నడుస్తాయి. శాలరీ అకౌంట్‌‌, పీఎఫ్‌‌ తదితర లావాదేవీలకు ఎస్‌‌బీఐను ఉపయోగిస్తారు. ఆర్టీసీ వద్ద ఎక్సెస్‌‌ అమౌంట్‌‌ ఉన్నప్పుడు యెస్‌‌ బ్యాంక్‌‌లో డిపాజిట్‌‌ చేస్తారు. ఎస్‌‌బీఐ కరంట్‌‌ అకౌంట్‌‌లో జమ చేస్తే మూడు శాతమే వడ్డీ వస్తుంది. అదే యెస్‌‌ బ్యాంక్‌‌లో 6.5 శాతం ఇంట్రెస్ట్​ వస్తుంది. దీంతో యెస్​ బ్యాంకులో పెద్ద మొత్తంలో జమ చేసేవారు. రూ.80 కోట్లు జమ చేస్తే ఇతర బ్యాంక్‌‌లతో పోలిస్తే యెస్​ బ్యాంక్​లో రూ.20 లక్షలు అదనంగా వడ్డీ వస్తుందని ఓ ఆర్టీసీ అధికారి తెలిపారు. ఎక్సెస్‌‌ ఉన్న అమౌంట్‌‌నే యెస్‌‌ బ్యాంక్‌‌లో వేస్తామన్నారు. యెస్‌‌ బ్యాంక్‌‌లో ఉన్న డబ్బుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అవసరాలకు ఇక్కడి నుంచే..

డిపోల్లో అధికంగా కలెక్షన్స్‌‌ వస్తే ఆన్‌‌లైన్‌‌ ద్వారా రీజియన్‌‌ ఆఫీస్‌‌లకు పంపిస్తారు. వివిధ అవసరాలకు వాడుకోగా, అక్కడ కూడా ఎక్సెస్‌‌ ఉంటే హెడ్‌‌ ఆఫీస్‌‌కు పంపిస్తారు. హెడ్‌‌ ఆఫీస్‌‌ అధికారులు వాటిని బ్యాంక్‌‌లో వేస్తారు. డబ్బులు అవసరం ఉన్నప్పుడు డ్రా చేసి వాడుకుంటారు. కరోనా భయంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఎక్కేందుకు ఆసక్తి చూపించడంలేదు. 5 రోజులుగా రోజుకు రెండు కోట్ల దాకా ఆదాయం తగ్గిందని ఓ ఆర్టీసీ అధికారి తెలిపారు. సాధారణంగా 12 కోట్లకు పైగా అదాయం వచ్చేదని, 5 రోజులుగా 10 కోట్ల వరకే వస్తోందని చెప్పారు. 5 రోజుల్లో 10 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. ఫిబ్రవరిలో రోజులు తక్కువగా ఉండటంతో కలెక్షన్‌‌ తగ్గింది. దీంతో వివిధ అవసరాలకు డబ్బులు అవసరం అవుతున్నాయి.

ఆ రోజు 80 కోట్లు తీసిన్రు

ఆర్టీసీలో సాధారణంగా ప్రతి నెలా 5వ తేదీన జీతాలు చెల్లిస్తున్నారు. ఈ నెల మాత్రం ఆరో తేదీన జీతాలు వచ్చాయి. అదే రోజున యెస్‌‌ బ్యాంక్‌‌ సంక్షోభం బయటపడింది. పెద్ద ఎత్తున షేర్లు పడిపోయాయి. అదే రోజు రాత్రి బ్యాంకుపై ఆర్​బీఐ మారటోరియం విధించింది. రోజుకు 50 వేలే విత్‌‌ డ్రా చేసుకోవాలని పరిమితి పెట్టింది. ఆ రోజు ఉదయమే ఆర్టీసీ అధికారులు రూ.80 కోట్లు డ్రా చేశారు. 5వ తేదీన బ్యాంక్‌‌ అధికారులకు రిక్వెస్ట్‌‌ పెట్టగా, ఆరో తేదీన డబ్బులు ఇచ్చారు. కొంచెం లేట్‌‌ అయినా ఆర్టీసీ డబ్బులు వచ్చేవి కావు. ఉద్యోగులకు జీతాలు ఆగిపోయేవి. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి.

Latest Updates