జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధం.. వచ్చే నెలలోనే..

హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికకు రంగం సిద్దమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్. పార్థసారథి ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది పిబ్రవరి 11 వ తేదీన జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. ఆ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు కొత్త కార్పోరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని, అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు. ఒకవేళ ఫిబ్రవరి 11 న ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజున ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల పర్యవేక్షణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ సీనియర్ ఐఎఎస్ ను నియమించింది.

గత ఏడాది డిసెంబర్ నెల‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించగా.. ఎన్నికల ప్రక్రియ పూర్తై నెల రోజులు దాటినా కూడా మేయ‌ర్ ఎన్నిక‌ల జ‌ర‌గ‌లేదు. ఎన్నిక గురించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ బీజేపీ కార్పోరేటర్లు ధర్నా నిర్వహించారు. దీంతో ఇటీవలనే కొత్త కార్పోరేటర్లు ఎన్నికైనట్టుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేసింది.

Latest Updates