త్వరలో ‘గురుకుల్’ నోటిఫికేషన్

హైదరాబాద్‌, వెలుగు: గురుకుల స్కూళ్లలో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దఫా వివిధ కేటగిరీల్లోని 1,900 పోస్టులను నింపాలని అధికారులు నిర్ణయించారు. ఈ పోస్టులకు ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్‌ రావడంతో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలే ఎస్సీ గురుకులాల్లో 19 ప్రిన్సిపల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే.

1,071 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు

2017––18 విద్యా సంవత్సరంలో కొత్తగా 119 గురుకుల స్కూళ్లు ప్రారంభమయ్యాయి. వాటిల్లో ప్రాథమికంగా  టీజీటీ, పీజీటీ పోస్టులను నింపారు. తరగతులు పెరుగుతున్నా కొద్ది పోస్టులను నింపుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది 1,900 పోస్టులను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా 1,071 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులున్నాయి. 36 ప్రిన్సిపల్‌ పోస్టులుండగా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌, లైబ్రేరియన్‌, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌, స్టాఫ్‌ నర్సు పోస్టులను 119 చొప్పున భర్తీ చేస్తారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ 110, పీజీటీ 80, జూనియర్‌ అసిస్టెంట్‌ 5 పోస్టులు భర్తీ చేయనున్నారు. 70 స్కూల్‌ పీడీలు, 52 ఇతర పోస్టులు నోటిఫికేషన్‌లో ఉండనున్నాయి. ఇక తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో(ఆర్‌డీసీ) లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఒక్కో పోస్టు చొప్పున భర్తీ చేయనున్నారు.

సొంత బోర్డు ద్వారానే భర్తీ

గతంలో మాదిరిగానే తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అక్టోబర్‌లోనే నోటిఫికేషన్‌ రావాల్సిఉన్నా వివిధ కారణాలతో వెలువడలేదు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం ముగుస్తోందని, వీలైనంత త్వరగా నోటిఫికేషన్‌ ఇచ్చి పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా వివిధ గురుకులాల్లో ఖాళీగా ఉన్న మరో 5 వేలకు పైగా పోస్టుల భర్తీకి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Latest Updates