మెట్టు దిగిన ఆర్టీసీ కార్మికులు.. పట్టువీడని ముఖ్యమంత్రి కేసీఆర్

43 రోజులుగా కొనసాగుతున్న సమ్మె.. కోర్టులో ఎడతెగకుండా కొనసాగుతూనే ఉన్న విచారణ.. చర్చలు జరపాలని చెప్పినా పట్టించుకోని సర్కారు.. ఇవన్నీ రెండు నెలలుగా జీతాల్లేని కార్మికుల కుటుంబాలను గందరగోళంలోకి నెడుతున్నాయి. ఈ ఆందోళనతోనే పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే… మరికొందరు ఆవేదనతో ఆరోగ్యం దెబ్బతిని కన్నుమూశారు. ఇప్పుడు ఏ నలుగురు కలిసినా సమ్మె ఇంకెంత కాలం సాగుతుంది? ఏ మలుపులు తీసుకుంటుంది? చివరికి ఎలా ఆగుతుందనే అంశంపైనే మాట్లాడుకుంటున్నారు. కమిటీ వేస్తామని హైకోర్టు ప్రతిపాదించినా సర్కారు కాదంది. చివరికి కార్మికులే ఒక మెట్టుదిగి ఆర్టీసీ విలీనం డిమాండ్ ను వదులుకుంటున్నట్లు ప్రకటించినా సమ్మెను పరిష్కరించే దిశగా సర్కారు నుండి స్పందన లేదు. మరోవైపు ఇది కోటిమందికిపైగా జనానికి, ముఖ్యంగా విద్యార్థులు, గ్రామస్థులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. దీంతో కార్మికుల సమస్యకు ముగింపు ఎక్కడన్నది అంతుబట్టని అంశంగా మారింది.

పంతం పట్టిన సీఎం

ఆర్టీసీ కార్మికుల సమ్మె 43 రోజులు దాటింది. ఇప్పటికీ ఈ సమ్మె ఆగేదెట్ల, ఏం జరుగుతుందన్నది తేలడం లేదు. కార్మికులు తమ ప్రధాన డిమాండ్​ను వదులుకున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. రెండు నెలలుగా జీతాల్లేక కార్మికుల కుటుంబాలు ఆగమాగమవుతున్నయి. ఇప్పటికే 23 మంది కార్మికులు ప్రాణాలు పోయాయి. ఇప్పటికైనా సర్కారు ఓ మెట్టు దిగిరావాలని, చర్చలకు పిలవాలని కార్మికులు, ప్రతిపక్షాల నేతలు కోరుతున్నారు. అయితే సీఎం కేసీఆర్​ మాత్రం ఈ విషయంలో మొండిగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. తాను అన్నిసార్లు హెచ్చరించినా కార్మికులు డ్యూటీలో చేరకపోవడంపై కోపంగా ఉన్నారని అంటున్నాయి.

పట్టువీడని సర్కారు

సమ్మె మొదలైన నాటి నుంచి కూడా ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. సమ్మె విరమించి డ్యూటీలో చేరితే.. తర్వాత చర్చల విషయం చూద్దామంటూ కండిషన్లు పెడుతోంది. సమ్మె చేస్తే నష్టం కార్మికులకే అని సీఎం కేసీఆర్  పదే పదే ప్రకటించారు. ‘‘పనికి మాలిన సమ్మె. అర్థం పర్థం లేని సమ్మె. యూనియన్ నాయకుల ఉచ్చులో పడొద్దు. ఒక్కొక్కరికి రూ. 50 వేల జీతాలున్నయి. ఇంకేం కావాలె. విలీనం చేయలేం. ఆర్టీసీని విలీనం చేస్తే ఇంకో సంస్థ అడుగుతది. సమ్మె విరమించకపోతే అసలు ఆర్టీసీయే ఉండదు.”అని హెచ్చరించారు. ‘‘అసలు కార్మికులే దిగిరావాలె. కెనడా దేశంలో కార్మికులే దిగి వచ్చారు. కండిషన్లకు తలొగ్గి డ్యూటీలో చేరారు. ఇక్కడా అదే జరుగుతది. సర్కారు పెట్టిన కండిషన్లను పాటిస్తమని చెప్పి డ్యూటీకి రావాలి” అని పలుసార్లు జరిగిన ఆర్టీసీ సమీక్షల్లో సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. రాజకీయ పార్టీలు కూడా ఈ సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని సర్కారును కోరాయి. ప్రభుత్వం పెద్ద మనసుతో వ్యవహరించాలని కోర్టు కూడా ఆదేశించింది. అయినా సర్కారులో కదలిక రాలేదు. ‘ఎన్ని రకాల ఆందోళనలు చేసినా బెదిరేది లేదు. కార్మికులే దిగిరావాలి’అని సీఎం ఓ సమీక్ష సమావేశంలో అన్నట్టు ఓ అధికారి చెప్పారు. ‘కెనడా దేశంలో కార్మికులే దిగివచ్చారు. కండిషన్లతో విధుల్లోకి చేరారు. ఇక్కడ కూడా అదే జరుగుతది. ప్రభుత్వం పెట్టిన కండిషన్లతో డ్యూటీలోకి రావాలి’ అని కూడా సీఎం అన్నట్టు తెలిసింది.

సుదీర్ఘ విచారణలతో..

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ సుదీర్ఘంగా సాగుతోంది. కొత్త పిటిషన్లు దాఖలవుతూనే ఉన్నాయి. కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. సమ్మె కోర్టు పరిధిలోకి రాదంటూ ప్రభుత్వం తొలి నుంచి వాదిస్తోంది. వ్యతిరేక తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్తామనీ ప్రకటించింది. కేసు సుప్రీంకోర్టుకు చేరితే ఇప్పట్లో సమస్యకు పరిష్కారం ఉండదంటూ కార్మికులను బెదిరించే ప్రయత్నం కూడా చేసిందన్న విమర్శలు వచ్చాయి. కేసు విచారణలో హైకోర్టు పదే పదే చీవాట్లు పెట్టడంతో ఉక్కిరిబిక్కిరైన సర్కారు.. ఆర్టీసీలో కేంద్రానికి వాటా ఉందని, కానీ కేంద్రం ఇంతవరకు ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదని పేర్కొంది. ఈ సమయంలో కేంద్రం మరో విషయాన్ని బయటపెడ్డింది. అసలు ఏపీఎస్​ ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదని, టీఎస్ ఆర్టీసీకి గుర్తింపు లేదని చెప్పింది. దీంతో విభజనే జరగనప్పుడు ఆర్టీసీ ఆస్తుల లీజులు, ఇతర నిర్ణయాలు ఎలా తీసుకున్నారన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. సమ్మె విషయంలో అటు ప్రభుత్వాన్ని, ఇటు కార్మికులను ఏమీ అనలేని పరిస్థితి ఉందని హైకోర్టు కామెంట్ చేసింది. అయితే సమ్మె చట్టవిరుద్ధమన్న సర్కారు వాదనలను తప్పుపట్టింది. ‘‘సమ్మె చట్టవిరుద్ధం ఎలా అవుతది? అలా చెప్పడానికి ఏం ఆధారాలున్నాయి? గత ప్రభుత్వ జీవోలతో ఇప్పుడు చట్టవిరుద్ధమని చెప్పలేం’ అని స్పష్టం చేసింది. చివరిగా ఈ సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్​ జడ్జీలతో కమిటీ వేస్తామంటే కార్మికులు సరేనన్నా.. సర్కారు ఒప్పుకోలేదు. సమ్మె అంశం లేబర్ కోర్టు పరిధిలో ఉంటుందని.. కేసు విచారణను అక్కడికి బదిలీ చేయాలని కోరింది. దీంతో సోమవారం జరిగే విచారణలో కోర్టు ఏం చెప్తుందోనని అంతటా ఉత్కంఠ నెలకొంది.

మరో గడువు ఇస్తరా?

ఆర్టీసీ కార్మికులు డ్యూటీలో చేరేందుకు సీఎం కేసీఆర్ మూడుసార్లు గడువు ఇచ్చారు. సమ్మె ప్రారంభం కంటే ముందు ‘డ్యూటీలో చేరకపోతే కార్మికులు సెల్ప్ డిస్మిస్ అవుతారు. వారంత వాళ్లే విధుల్లోకి రాకపోతే ఎవరూ ఏం చేయలేరు’ అన్నారు. అయినా కార్మికులు సమ్మె బాటపట్టారు. హుజూర్ నగర్  ఉప ఎన్నిక రిజల్ట్​ రాగానే ప్రెస్​మీట్​ పెట్టినప్పుడు.. ‘డ్యూటీలో చేరే కార్మికులు డిపోల్లోకి వెళ్లి లెటర్లు ఇవ్వాలి. అప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది’ అని ప్రకటించారు. తర్వాత ఈ నెల 2న కేబినెట్ సమావేశం తరువాత మాట్లాడుతూ.. ‘ఈ నెల 5 అర్ధరాత్రి వరకు గడువు ఇచ్చినం. ఆలోగా కార్మికులు వెళ్లి డిపోల్లో లెటర్లు ఇవ్వాలి’ అని గడువు పెట్టారు. అయినా మొత్తం 49 వేల మంది కార్మికుల్లో 200 మంది మాత్రమే డ్యూటీలో చేరుతామని లెటర్లు ఇచ్చారు. వారికి కూడా ఇప్పటివరకు డ్యూటీలు వేయలేదు. తాజాగా సర్కారులో విలీనమనే ప్రధాన డిమాండ్ ను కార్మికులు తాత్కాలికంగా వదులుకున్నరు. చర్చలకు పిలవాలని అడుగుతున్నారు. సర్కారు ఇప్పటికైనా మనసు మార్చుకుని చర్చలకు పిలుస్తుందా, మరో గడువేదైనా ఇస్తరా అన్న చర్చ జరుగుతోంది. సీఎం పెద్ద మనస్సుతో సమస్యకు పరిష్కారం చూపాలని చాలా మంది టీఆర్ఎస్ నేతలు తమ అంతర్గత సమావేశాల్లో అభిప్రాయపడుతున్నారు.

పది వేల ప్రైవేటు బస్సులకు అనుమతి!

ఆర్టీసీని సర్కారులో విలీనం చేయాలన్న డిమాండ్  నుంచి మెట్టుదిగిన కార్మికులు చర్చలకు పిలవాలని కోరుతున్నారు. కానీ సర్కారు నుంచి ఎలాంటి స్పందనా లేదు. ‘‘5,100 ప్రైవేటు బస్సులకు అనుమతిచ్చినం. కార్మికులు సమ్మె విడిచి డ్యూటీలో చేరకపోతే ఆర్టీసీలోని మిగతా 5,000 బస్సులు కూడా ప్రైవేట్ చేస్తం..’’ అని గతంలో సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఇప్పుడదే జరిగే అవకాశముందా అని అధికార వర్గాల్లో అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.

 

Latest Updates