కాల్పులు జరిపిన వ్యక్తి పంజాగుట్టలో దిగి పరిగెత్తాడు

హైదరాబాద్ : ఇటీవల ఆర్టీసీ బస్సు చోరీ కలకలం సృష్టించగా గురువారం బస్సులో కాల్పులు జరపడం మరోసారి ఆర్టీసీ అధికారుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం పంజగుట్ట దగ్గర ఆర్టీసీ బస్సులో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. దీని గురించి పోలీసులకు తెలిపాడు ఆ బస్సులో డ్యూటీ చేస్తున్న కండక్టర్ భూపతి. నాగార్జున సర్కిల్ దగ్గర కాల్పులు జరిపినట్లు తెలిపిన కండక్టర్.. కాల్పులు జరిపినప్పుడు ఆగంతుకుడు డోర్ లో నిలబడి ఉన్నాడని పోలీసులుకి స్టేట్మెంట్ ఇచ్చాడు. లోపల టికెట్ కలెక్ట్ చేస్తున్న సమయంలో ఒక్కసారి పెద్ద శబ్దం వచ్చిందని.. దీంతో ప్రయాణికులతో పాటు డ్రైవర్, తాను కూడా భయాందోళనకి గురయ్యామని తెలిపాడు.

పంజాగుట్ట సర్కిల్ దాటినా తర్వాత ఆగంతుకుడు బస్సు దిగి వెళ్ళిపోయాడని.. కాల్పులు జరిగిన వెంటనే RTC ఉన్నతాధికారులుకి సమాచారం అందించామన్నాడు. ఆ సమయంలో ఏమి చేయాలో దిక్కు తోచక బస్సును డిపోకి తీసుకెళ్లి పోయామన్నాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని చూస్తే గుర్తు పడుతానని.. కాల్పులు జరిగిన సమయంలో బస్సులో 30 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని వెతికే పనిలో ఉన్నామని తెలిపారు.

సికింద్రాబాద్ నుంచి ఫిల్మ్ నగర్ వైపు వెళుతోన్న బస్సు(నంబర్ ఏపీ 28 జెడ్ 4468)లో కాల్పులు అలజడి రేపాయి. బస్సు దిగే విషయంలో… ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. సఫారీ సూట్ వేసుకున్న ఓ ప్రయాణికుడు తన దగ్గరున్న గన్ తీసి.. పైకి కాల్పులు జరిపాడు. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. బస్సు పై కప్పు నుంచి బుల్లెట్ బయటికి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు.

Latest Updates