ఇంట్లోనే అశ్వత్థామరెడ్డి దీక్ష.

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, యూనియన్లను చర్చలకు పిలవాలని డిమాండ్​ చేస్తూ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి శనివారం నిరవధిక నిరాహార దీక్షను మొదలుపెట్టారు. ఇంటిచుట్టూ పోలీసులు భారీగా మోహరించడం, రాకపోకలపై ఆంక్షలు పెట్టడంతో తన ఇంట్లోనే 20 మంది మహిళా కండక్టర్లతో కలిసి దీక్ష ప్రారంభించారు. తొలుత ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించినా పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. యూనియన్​ ఆఫీసులో దీక్ష చేయాలనుకున్నారు. కానీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రే హైదరాబాద్​హస్తినాపురంలోని బీవీఆర్ఎస్ రెసిడెన్సీలో ఉన్న అశ్వత్థామరెడ్డి నివాసాన్ని చుట్టుముట్టారు. సమీపంలోని రోడ్లను మూసివేసి, ఆంక్షలు విధించారు. శనివారం తెల్లవారుజామునే ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన్ను బయటికి రప్పించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాను బయటికి వస్తే అరెస్టు చేసే అవకాశం ఉండటంతో అశ్వత్థామరెడ్డి ఇంట్లోనే దీక్ష మొదలుపెట్టారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, పీవోడబ్ల్యూ నేత సంధ్య, సీపీఐ ఎంఎల్ నేత గోవర్ధన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్టీసీ కార్మికులు అక్కడికి చేరుకున్నారు. నేతలను నివాసంలోకి అనుమతించని పోలీసులు.. కార్మికులను అడ్డుకుని అరెస్టు చేశారు.

ఇంత దుర్మార్గమా?

తన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించటం, అడ్డంకులు సృష్టిస్తుండటంపై అశ్వత్థామరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంట్లోనే దీక్ష మొదలుపెట్టిన అశ్వత్థామరెడ్డి కిటికీ నుంచి మీడియాతో మాట్లాడారు. ఇంత నిరంకుశ ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. ఇందిరాపార్కు దగ్గర దీక్ష కోసం తాను అనుమతి కోరితే.. నిరాకరిస్తున్నట్టు శుక్రవారం రాత్రి 10 గంటలకు సమాచారమిచ్చారని చెప్పారు. దాంతో ఎంప్లాయీస్  యూనియన్ కార్యాలయంలో దీక్ష చేయాలనుకుంటే.. ఇన్ని అడ్డంకులు సృష్టిస్తారా అని నిలదీశారు. ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నా.. ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవటం బాధాకరమని చెప్పారు. 43 రోజులుగా సమ్మె జరుగుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రజారవాణాను కాపాడుకోవడం కోసమే సమ్మె చేస్తున్నామని, ప్రజలంతా సర్కారుపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.

నేతలను రానివ్వలే..

దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డికి మద్దతు తెలిపేందుకు వచ్చిన నేతలెవరినీ పోలీసులు అనుమతించలేదు. ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, పీవోడబ్ల్యూ నేత సంధ్య, సీపీఐ ఎంఎల్ నేత గోవర్ధన్​లను నివాసం బయటే అడ్డుకున్నారు. ఈ ఆంక్షలపై నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సంధ్య గేటు ఎక్కి నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న దీక్షకు ఇన్ని అడ్డంకులు సృష్టించటం ఏంటని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదని విమర్శించారు.

బస్ భవన్, యూనియన్ ఆఫీసుల దగ్గరా ఆంక్షలు

ఆర్టీసీ జేఏసీ నేతల దీక్షతో బస్ భవన్, వీఎస్టీ, విద్యానగర్ లోని యూనియన్ కార్యాలయాల దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు, ముళ్ల కంచెలు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షలతో బస్ భవన్ పరిసరాలు నిషేధిత ప్రాంతాలను తలపించాయి.

భారీగా వచ్చిన కార్మికులు

అశ్వత్థామరెడ్డి దీక్షకు మద్దతు పలికేందుకు హైదరాబాద్​తోపాటు విధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు. హస్తినాపురం మెయిన్ రోడ్ నుంచి అశ్వత్థామరెడ్డి నివాసానికి వెళ్లే దారిలో పోలీసులు ఆంక్షలు విధించి, కార్మికులను అడ్డుకున్నారు. ఆ పరిసరాల్లో 144 సెక్షన్​ విధించారు. కొందరు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. నివాసానికి 500 మీటర్ల దూరంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయటంతో కార్మికులు సమీప కాలనీ రోడ్ల మీద బైఠాయించి, ఆందోళన చేశారు. 1,500 మందికిపైగా కార్మికులు వచ్చారని, దీక్ష విరమించేవరకు ఇక్కడే ఉంటామన్నారని యూనియన్ నేతలు తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నరు: మందకృష్ణ

కేసీఆర్ నిమ్స్ లో దీక్ష చేసిన సమయంలో తాను పది రోజులు ఉన్నానని, అప్పటి సమైక్యాంధ్ర సర్కారు ఎంత మందొచ్చినా అనుమతించిందని మంద కృష్ణ గుర్తు చేశారు. అప్పుడు పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలపకపోతే రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఆర్టీసీని ఆదుకుంటామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ఆడియోను మంద కృష్ణ వినిపించారు.

సీఎంకు సోయి లేదు: గోవర్ధన్

ఆర్టీసీ సమ్మె పై హైకోర్టు చెప్పినా వినకపోవటం బాధాకరమని సీపీఐ ఎంఎల్  నేత గోవర్ధన్  అన్నారు. చర్చల ద్వారా యుద్ధాలే పరిష్కారమయ్యాయని, కార్మికులు 43 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కేసీఆర్ కు సోయి లేదని విమర్శించారు. కేంద్ర ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని కేసీఆర్  హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా కార్మికులను ఫామ్​ హౌస్ లో పాలేర్లలాగా చూస్తున్నారని మండిపడ్డారు.

మహిళా కండక్టర్ల ఆక్రోశం, ఆవేశం

ఖమ్మం ఉమ్మడి జిల్లా కొత్తగూడెంలోని యూని యన్ ఆఫీసులో శనివారం ఉదయాన్నే 22 మంది మహిళా కార్మికులు స్వీయ నిర్బంధం విధించుకున్నారు. గ్యాస్​సిలిండర్, పెట్రోల్ బాటిళ్లతో ఆత్మాహుతికి పాల్పడతామని బెదిరించారు. ఒకదశలో ఇద్దరు మహిళా కండక్టర్లు స్పృహ తప్పి పడిపోవడంతో యూనియన్ నాయకులు, పోలీసులు తలుపులు తెరిచి వారిని హాస్పిటల్​కు తరలించారు. ఖమ్మం బస్టాండ్ ఎదుట కార్మికులు ముక్కు నేలకు రాసి నిరసన తెలిపారు. మహిళా కండక్టర్లు తమ చెప్పులతో తామే కొట్టుకున్నారు. మణుగూరు డిపో వద్ద ఆర్టీసీ మహిళా కార్మికులు తాత్కాలిక మహిళా కండక్టర్లపై దాడికి పాల్పడ్డారు. జిల్లావ్యాప్తంగా కార్మికులు డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా  ధర్నా చేశారు.

Latest Updates