సంక్షోభంలో ఆర్టీసీ..విధుల్లోకి వస్తామన్న చేర్చుకోలేం : ఆర్టీసీ ఇన్‌‌‌‌చార్జ్​ఎండీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:ఆర్టీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రూల్స్​కు విరుద్ధంగా కార్మికులు విధులకు దూరంగా ఉండడం వల్ల చర్చలు జరిపే హక్కును యూనియన్లు కోల్పోయాయని ఆర్టీసీ ఇన్‌‌‌‌చార్జ్​ఎండీ సునీల్‌‌‌‌ శర్మ.. హైకోర్టుకు నివేదించారు. ఇప్పుడు కార్మికులే స్వచ్ఛందంగా డ్యూటీలో చేరేందుకు ముందుకు వచ్చినా వారిని కొనసాగించే విషయంపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉందని శనివారం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌‌‌‌ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పాయని, శాంతి, సామరస్యాన్ని పునరుద్ధరించడానికి తగిన ఆదేశాలను జారీ చేయాలని అభ్యర్థించారు. ఆఫిడవిట్‌లోని  వివరాలివీ..

ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర

ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె చట్టవిరుద్ధం. కార్మికుల సంక్షేమం కోసం కాకుండా, కొందరు యూనియన్ నాయకుల వ్యక్తిగత పరపతి కోసం వాడుకుంటున్నారు. ఇలా సమ్మెను ఆశ్రయించిన కార్మికులు తమ డిమాండ్లను కూడా సాధించుకోలేరు. క్రమశిక్షణను కోల్పోయిన యూనియన్ల నాయకులు, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు. బెదిరించాలని, భయపెట్టాలని చూస్తున్నారు. సమ్మె సందర్భంగా ప్రభుత్వాన్ని టార్గెట్‌‌‌‌ చేసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. పరిస్థితి చేయిదాటినట్లు కనిపిస్తున్నందున తక్షణ చర్యలు అవసరమని భావిస్తున్నాం.

సమ్మె పరిణామాలు ప్రమాదకరమైనవి

సమ్మె వల్ల సంస్థ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కార్పొరేషన్ తన ఆదాయాన్ని కోల్పోతుంది. సమ్మెలు పరిపాలనను స్తంభింపజేసి.. అభివృద్ధికి ఆటంకంగా మారుతాయి. సమ్మె ఒక్క సంస్థనే కాకుండా మొత్తం సమాజానికే నష్టం చేస్తోంది. కార్మికుల ప్రయోజనాలకు కట్టుబడి ఉండాల్సిన యూనియన్లు రాజకీయ పార్టీలతో కుమ్మక్కయ్యాయి. సమ్మె కారణంగా కార్మికులు, యాజమాన్యం, ప్రజలు తమ తప్పు లేకుండానే మూల్యం చెల్లిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు చిన్నచిన్న కారణాలతో సమ్మెకు దిగడం సర్వసాధారణమైంది. అసాధారణమైన డిమాండ్లతో కూడా వారు అనేకసార్లు సమ్మెలోకి వెళ్లారు. గత లెక్కలను పరిశీలిస్తే ఇతర సంస్థలు, ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీ కార్మికులే ఎక్కువగా సమ్మె చేశారు. సమ్మె సామాన్యులను ప్రత్యక్షంగా ఇబ్బంది పెడుతుందని తెలిసినా చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నారు. వీరిని ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌ చేస్తే ఇతర రంగాల ఉద్యోగులను కూడా ప్రేరేపించినట్లు అవుతుంది.

‘విలీనం’డిమాండ్‌‌‌‌ మళ్లీ తలెత్తే ప్రమాదం

ఇతర డిమాండ్లపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పుడు కూడా యూనియన్లు విలీన డిమాండ్ గురించి మాట్లాడాయి. ‘ప్రస్తుతానికి విలీనం’డిమాండ్‌‌‌‌ను పక్కన పెట్టినట్లు చేసిన ప్రకటనతో స్పృహలో ఉన్న వారెవరైనా షాక్ అవుతారు. ప్రస్తుతానికి పక్కనబెట్టడం అంటే భవిష్యత్తులో ఏ సమయంలోనైనా ‘విలీన డిమాండ్’తలెత్తడంతోపాటు రాష్ట్రాన్ని మరోసారి అస్థిరపరిచే ప్రమాదం ఉంది. ఇలా ప్రకటించడం మొండి వైఖరికి అద్దంపడుతోంది. యూనియన్ నాయకుల అహంభావ స్వభావం కారణంగానే కార్మికులంతా చెప్పలేని కష్టాలను అనుభవిస్తున్నారు.

కార్మికులను వారి ఇష్టానికి వదిలేయలేం

క్రమశిక్షణ ఉల్లంఘనను ఏ యాజమాన్యం అంగీకరించదు. సంస్థ కుప్పకూలితే తొలుత ఉద్యోగులే బాధపడతారు. కార్మికులు, ఉద్యోగులను వారి ఇష్టానికి, అభిరుచికి వదిలేస్తే అది అస్తవ్యస్తమైన పరిస్థితికి దారితీస్తుంది. యాజమాన్యం తన సొంత ప్రజలను శిక్షించాలని అనుకోవడం లేదు. మొత్తం వ్యవస్థను స్ట్రీమ్‌‌‌‌ లైన్‌‌‌‌ చేయాలని మాత్రమే భావిస్తోంది.

సమ్మె చట్టవిరుద్ధమని ముందే చెప్పిన కార్మిక శాఖ

అశ్వత్థామరెడ్డి సెప్టెంబర్‌‌‌‌11న డిమాండ్లతో సమ్మె నోటీసు అందించారు. సెప్టెంబర్‌‌‌‌ 25న లేదా ఆ తర్వాత సమ్మెకు వెళ్తామని నోటీసులో పేర్కొన్నారు. ఇతర రిజిస్టర్డ్ యూనియన్లు కూడా సమ్మె నోటీసులు ఇచ్చాయి. సంస్థకు, కార్మికులకు మధ్య సయోధ్య కుదర్చాలని కార్మిక శాఖ హైదరాబాద్, జంట నగరాల సంయుక్త కమిషనర్‌‌‌‌ను రాష్ట్ర కార్మిక కమిషనర్ ఆదేశించారు. సెప్టెంబర్‌‌‌‌ 16, 23 తేదీల్లో కార్మిక సంఘాలతో సమావేశం కావాలని యాజమాన్యం నిర్ణయించింది. కానీ పరిపాలనా కారణాలతో సమావేశం వాయిదా పడింది. అక్టోబర్‌‌‌‌ 4న సమావేశం నిర్వహించనున్నట్లు కార్మిక శాఖ సెప్టెంబర్‌‌‌‌ 27న ఇరు పక్షాలకు నోటీసులు ఇచ్చింది. కానీ కార్మిక సంఘాలు ఐదో తేదీ నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు మీడియా ద్వారా తెలుసుకున్న కార్మిక శాఖ ‘‘రాజీ, చర్చల ప్రక్రియ పెండింగ్‌‌‌‌లో ఉండగా యూనియన్లు సమ్మెకు వెళ్లడం పారిశ్రామిక వివాద చట్టం–1947లోని నిబంధనలకు విరుద్ధం. దీనిని చట్టవిరుద్ధ సమ్మెగా ప్రకటించాల్సి ఉంటుంది. అందువల్ల సమ్మెకు వెళ్లొద్దు’అని నోటీసులు ఇచ్చింది.

అక్రమ సమ్మె శిక్షార్హమైన నేరం

పారిశ్రామిక వివాదాల చట్టం–1947ను అనుసరించి విడుదల చేసిన జీవో నంబర్‌‌‌‌ 408(26 ఆగస్టు, 2019) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా రంగంలో సమ్మెను నిషేధించిందింది. సమ్మె, లాకౌట్ గురించి ఆ చట్టంలోని సెక్షన్‌‌‌‌ 22, 23, 24 ప్రకారం.. ‘‘పబ్లిక్‌‌‌‌ యుటిలిటీ సర్వీస్‌‌‌‌లో ఉండే ఉద్యోగులు ఎవరైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సమ్మె చేయడానికి వీల్లేదు. ఉద్యోగి సమ్మెకు వెళ్లాలంటే ఆరు వారాలకు ముందు సంస్థకు నోటీసు ఇవ్వాలి. లేదంటే 14 రోజుల్లోపు నోటీసు ఇవ్వాలి. సమ్మెకు పిలుపునిచ్చిన గడువు ముగిసినా సమ్మెకు వెళ్లడానికి వీల్లేదు. అలాగే ఉద్యోగి, సంస్థ మధ్య సయోధ్య కోసం చర్చలు జరిపే సమయంలో, లేదా చర్చల ప్రక్రియ పెండింగ్‌‌‌‌లో ఉన్న సమయంలోగానీ. అలాగే చర్చలు ముగిసిన ఏడు రోజుల తర్వాతగానీ సమ్మె చేయకూడదు’’అందువల్ల ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధంగా జరుగుతోందని స్పష్టమవుతోంది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం చట్టవిరుద్ధంగా సమ్మెను ప్రారంభించడం, అలాగే కొనసాగించడం శిక్షార్హమైన నేరం. ఇందుకుగానూ నెల రోజులు లేదా ఆపై కాలం జైలు శిక్ష లేదా రూ.50 వేల ఫైన్‌‌‌‌ లేదా ఈ రెండు శిక్షలు విధించే అవకాశం ఇండస్ట్రీయల్‌‌‌‌ డిస్ప్యూట్స్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ ప్రకారం ఉంది. ఈ సమ్మె చట్టవిరుద్దమని సంబంధిత అథారిటీ ప్రకటించాల్సి ఉంది. అది జరిగే వరకు సమ్మె వల్ల జరిగే పరిణామాలకు సంస్థ యజమాని మౌన ప్రేక్షుకుడే.

నష్టాల్లో ఉన్నా 44 శాతం ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చాం

సంస్థ నష్టాల్లో ఉన్నా కార్మికులకు 44% ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌ను దయతో సంస్థ ప్రకటించింది. 16% మధ్యంతర భృతి ఇచ్చింది. అయినా కార్మికులు ప్రభుత్వంలో విలీనం, మరికొన్ని డిమాండ్లతో అన్యాయంగా సమ్మెకు దిగారు. రాష్ట్రంలో ఆర్టీసీలాగే 50 కార్పొరేషన్లు ఉన్నాయని ఆర్టీసీ యూనియన్‌‌‌‌ నాయకులకు తెలుసు. ‘విలీనం’డిమాండ్ అంగీకరిస్తే ఇతర సంస్థల ఉద్యోగులు కూడా తమ కార్పొరేషన్లను విలీనం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ యూనియన్ల నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారు. సమ్మెకు దసరా పండుగను ఎంచుకున్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. పండుగ సీజన్‌‌‌‌లో భారీ ఆదాయాన్ని సంస్థ కోల్పోవడమేగాక నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ప్రజల ఇబ్బందులను తీర్చడానికి కార్పొరేషన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. కార్మికుల ఆకస్మిక సమ్మె రాష్ట్రంలో వినాశనాన్ని సృష్టించింది”అని అఫిడవిట్​లో సునీల్​శర్మ పేర్కొన్నారు.

Latest Updates