ఆర్టీసీలో వెయ్యి పాత బస్సులు స్క్రాప్ కింద అమ్మే ప్లాన్

వాటి స్థానంలో ప్రైవేట్‌ బస్సులు తీసుకునే ప్రయత్నం

ఇటీవల లక్ష కిలో మీటర్ల తగ్గింపుతో ‘ప్రైవేట్‌’కు లాభం

ఆర్టీసీని ప్రైవేట్​పరం చేసే కుట్ర  అంటున్న యూనియన్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే దిశగా ఒక్కో అడుగుపడుతోంది. పాత బస్సులను స్క్రాప్ కింద అమ్మేందుకు మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ నిర్ణయం తీసుకుంది. వాటి స్థానంలో కొత్తవి కొనకుండా.. ప్రైవేటు బస్సులు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఆయా రూట్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం లేదా ప్రైవేటు(హైర్) బస్సులను తీసుకునే కుట్ర జరుగుతోందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఇంటర్ స్టేట్ ఒప్పందంలో ఏపీ ఆర్టీసీకి లక్ష కి.మీ తగ్గించి, ప్రైవేటు ట్రావెల్స్‌‌కు మేలు చేసిన సంగతి తెలిసిందే.

షీ టాయిలెట్లకు ఇవ్వాలనుకున్నవీ అమ్మకానికే

ఆర్టీసీలో పాత బస్సులను స్క్రాప్‌‌‌‌కు వేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. కాలం చెల్లినవి కావడంతో వీటిని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్న మొబైల్‌‌‌‌ షీ టాయిలెట్ల కోసం అమ్మాలని భావించారు. ఖమ్మం తదితర చోట్ల షీ టాయిలెట్ల మోడల్‌‌‌‌ కూడా రెడీ చేశారు. తర్వాత ఆ విషయం మరుగున పడింది. ప్రస్తుతం పాత బస్సులు వెయ్యి దాకా ఉన్నాయి. మరో 300 బస్సులకు వచ్చే ఏడాది మార్చిలో కాలం చెల్లనుంది. వీటిని అమ్మితే పెద్దగా డబ్బులు వచ్చే అవకాశం లేదు. వచ్చిన కొద్ది డబ్బుతో స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌ కొననున్నారు.

8వేలు కూడా నడవడం లేదు

సమ్మె కంటే ముందు ఆర్టీసీలో 10,460 బస్సులు నడిచేవి. ప్రస్తుతం 8 వేలు కూడా నడవడంలేదు. మిగతావాటిని డిపోలకే పరిమితం చేశారు. పాత బస్సులను అమ్మడం వరకు బాగానే ఉన్నా, వాటి స్థానంలో కొత్తవి కొనేందుకు సంస్థ దగ్గర డబ్బులు లేవు. ఇప్పటికే కరోనా, తదితర కారణాలతో సంస్థ ఆర్థికంగా భారీ నష్టాల్లో ఉంది. 2019–20 లెక్కల ప్రకారం ఆర్టీసీకి రూ. 3 వేల కోట్ల అప్పులున్నాయి. వీటికి చాలా చోట్ల భూములను తనఖా పెట్టారు. రూ.850 కోట్లకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంది.

‘ప్రైవేట్‌‌‌‌’కు ప్రాధాన్యం

పాత బస్సులను స్క్రాప్‌‌‌‌కు వేయడం, కొత్తవి కొనకపోవడంపై యూనియన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేట్‌‌‌‌పరం చేయడంలో భాగంగానే పాత బస్సుల పేరుతో అమ్మాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నాయి. వెయ్యి బస్సులు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. వీటిని భర్తీ చేయాలంటే ఆయా రూట్లను ప్రైవేట్‌‌‌‌కు అప్పగించాలని, లేకుంటే ప్రైవేట్‌‌‌‌ బస్సులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏదిచేసినా ప్రైవేటుకే లాభం. ఇప్పటికే ఆర్టీసీలో 5వేల ప్రైవేట్‌‌‌‌ అద్దె బస్సులు ఉన్నాయి.

లక్ష కి.మీ. ప్రైవేటు ట్రావెల్స్ కు..

ఇటీవల తెలంగాణ, ఏపీ మధ్య ఇంటర్‌‌ స్టేట్‌‌ ఒప్పందం కుదిరింది. ఈ టైంలోనూ ప్రైవేట్‌‌కు లాభం చేసేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపణలు వచ్చాయి. లక్ష కిలోమీటర్లు ప్రైవేట్‌‌కు అప్పజెప్పారని విమర్శలు వినిపించాయి. ఇంటర్‌‌ స్టేట్‌‌ ఒప్పందానికి ముందు తెలంగాణ, ఏపీ మధ్య 4లక్షల కిలోమీటర్లు నడిచేవి. ఇందులో తెలంగాణ భూభాగంలో ఏపీ బస్సులను 2.64లక్షల కిలోమీటర్లు తిప్పగా, ఏపీ భూభాగంలో తెలంగాణ బస్సులు 1.61లక్షల కి.మీలు  మాత్రమే తిరిగేవి. ఈ లెక్కన తెలంగాణలో లక్ష కిలోమీటర్లు ఏపీ బస్సులు ఎక్కువగా తిరిగేవి. అయితే లక్ష కిలోమీటర్లు ఏపీ తగ్గించేకునే దాకా తెలంగాణ మొండి పట్టుపట్టింది. తెలంగాణే కొన్ని కిలోమీటర్లు పెంచుకోవాలని ఏపీ కోరినా పట్టించుకోకపోవ డంతో  లక్ష కిలోమీటర్లను ఏపీ తగ్గించుకుంది. ఈ దూరాన్ని ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌ భర్తీ చేస్తున్నాయి.

 

Latest Updates