వెంకన్న బోర్డు ఏర్పాటెప్పుడు

  •                కీలక నిర్ణయాల అమలులో తీవ్రంగా ఆలస్యం
  •                 బోర్డులో చోటు కోసం క్యూకట్టిన ఆశావహులు

టీటీడీ బోర్డులో తెలంగాణకు రెండు లేదా మూడు బెర్త్​లు? ఏటా మూడు వేల కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్ కలిగిన ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) పరిపాలనలో సందిగ్ధత నెలకొంది. టీటీడీ చైర్మన్ ను నియమించి రెండు నెలలు దాటినా, సభ్యుల నియామకం ఊసేలేదు. ఫలితంగా కోట్లాది రూపాయల మార్కెట్​ కొనుగోళ్లకు సంబంధించిన కీలక నిర్ణయాల అమలు ఆలస్యమవుతోంది. ఏపీలోని కొత్త ప్రభుత్వం టీటీడీ పాలనపై ఇంకా దృష్టి సారించటంలేదనే  ప్రచారం జరుగుతోంది. టీటీడీ బోర్డులో తెలంగాణకు రెండు నుండి మూడు  బెర్తులు ఇచ్చే అవకాశంఉందని సమాచారం.

బోర్డు నిర్ణయమే ఫైనల్

2019–20-20 టీటీడీ  వార్షిక బడ్జెట్‌‌ రూ.3,116 కోట్లు. ఏటా రాబడితోపాటు ఖర్చులు కూడా అదే స్థాయిలోనే ఉంటాయి. ఆలయ అవసరాలు, భక్తుల సదుపాయాల కల్పనకు అవసరమైన కొనుగోళ్ల కోసం రూ.540 కోట్లు ఖర్చు చేస్తుంటారు. కోట్లాది రూపాయల కొనుగోళ్లకు సంబంధించి టీటీడీ ధర్మకర్తల మండలి అనుమతి తప్పనిసరి. దీని కోసం ప్రత్యేక కమిటీలు కూడాఉంటాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్​విడుదలైన ఫిబ్రవరి నుండి జూన్​ 22వ తేది టీటీడీ కొత్త చైర్మన్​ ప్రమాణ స్వీకారం వరకు టీటీడీఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ధార్మిక సంస్థ పరిపాలన సాగింది. కొత్త చైర్మన్​ నియామకం తర్వాత ఆలయ అవసరాలు మినహా మిగతా కీలక నిర్ణయాలు, కొనుగోళ్ల అనుమతుల విషయంలో టీటీడీ ఉన్నతాధికారుల పాత్ర నామమాత్రమే. దీనికి ధర్మకర్తల మండలి నిర్ణయాలు తీసుకోవాలి. చైర్మన్ ఒక్కరే నిర్ణయాలు తీసుకునేందుకు బోర్డు రూల్స్ ఒప్పుకోవు.

టీటీడీ బోర్డులో బెర్త్​కోసం ఆశావహుల ఒత్తిడి

నామినేటెడ్​ పదవుల్లో టీటీడీ బోర్డుకు మొదటి ప్రాధాన్యత ఉంది. బోర్డులో చైర్మన్​తోపాటు 18 మంది సభ్యులకు చోటు ఉంటుంది. ఇందులో ఎక్స్​ అఫీషియో సభ్యులుగా  టీటీడీ ఈవో, ఏపీ ఎండోమెంట్​కమిషనర్, ప్రిన్సిపల్​ సెక్రటరీ మినహా మిగిలినవారందరినీ ప్రభుత్వం నామినేట్​ చేస్తుంది. గల్లీ లీడర్​ నుంచి ఢిల్లీ స్థాయి నేత వరకు  టీటీడీ బోర్డులో బెర్త్​కోసం పోటీ పడుతుంటారు. తమ వారికి  పదవులు ఇప్పించుకునేందుకు పక్కరాష్ట్రాల సీఎంలతోపాటు  లక్షల కోట్లకు పడగలెత్తిన కార్పొరేట్, వ్యాపార  దిగ్గజాల వరకు సిఫార్సు చేస్తుంటారు. చైర్మన్​తోపాటే పూర్తిస్థాయి సభ్యుల జాబితా కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసిందని. ఆశావహుల జాబితా పెరిగిపోవడంతో చోటు దక్కని వారి నుంచి వ్యతిరేకత వస్తుందనే జాబితా ప్రకటించలేదని తెలుస్తోంది.

బోర్డులో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు?

నిబంధనల ప్రకారం మొత్తం 18 మందితో టీటీడీ బోర్డు ఉంది. ఆశావహుల జాబితాతోపాటు అతిముఖ్యుల సిఫార్సులతో కొత్త బోర్డులో సాధ్యమైనంత ఎక్కువ మందికి చోటు కల్పించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో  బోర్డు సభ్యుల తరహాలోనే ప్రత్యేక ఆహ్వానితులుగా మరో ఏడుగురికి చోటు కల్పించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. బోర్డు తీర్మానాల్లో వారి ప్రమేయం నామమాత్రమే ఉంటుందని తెలుస్తోంది.

తెలంగాణకు మూడు బెర్తులు?

టీటీడీ బోర్డులో  చైర్మన్​, ముగ్గురు అధికారుల మినహా  మిగిలిన 14 మంది సభ్యుల కోసం సుమారు 300 మంది దాకా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. తెలంగాణ, తమిళనాడు, కర్నాటకకు చెందిన ముఖ్యులు కూడా తమవారికి టీటీడీ  పదవులు ఇవ్వాలని ఇప్పటికే ఏపీ సీఎం పేషీకి  సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. టీటీడీ సంప్రదాయం ప్రకారం తెలంగాణ, తమిళనాడు, కర్నాటక నుంచి ఒక్కొక్కరిని నియమించేవారు. ప్రస్తుతం రెండేసి చొప్పున ఇవ్వాలని ఆ రాష్ట్రాలు  పట్టుబడుతున్నట్టు సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ కు ఉన్న సాన్నిహిత్యం కారణంగా టీటీడీ బోర్డులో ఆ రాష్ట్రానికి రెండు నుంచి మూడు బెర్తులు దక్కుతాయని టీటీడీ వర్గాలు అంటున్నాయి.

Latest Updates