టీటీడీ ఆస్తుల అమ్మకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

తాడేపల్లి: తిరుమల శ్రీవారి ఆస్తుల వేలం వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆస్తుల అమ్మకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. వేలానికి సంబంధించి ఎలాంటి విధివిధానాలూ రూపొందించలేదని తెలిపారు. ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే కొందరు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తదుపరి బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

తితిదే ఆస్తుల విక్రయ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ‘‘శ్రీవారి ఆస్తుల విషయంలో ఎలాంటి అసత్యాలూ ప్రచారం చేయొద్దు. ప్ర‌తిప‌క్షాలు రాజకీయ వ్యతిరేకతతోనే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం హయాంలో సదావర్తి భూముల అమ్మకానికి పెడితే కోర్టుల ద్వారా అడ్డుకున్నది మేమే’’ అని సుబ్బారెడ్డి అన్నారు.

నిరర్థక ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గతంలోనూ దేవుడి భూములను వేలం వేశారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 1974 నుంచి 2014 ఇప్పటి వరకు 129 ఆస్తులను అమ్మారని.. చంద్రబాబు హయంలో 15 నుంచి 20 ఆస్తులను వేలంవేసినట్లు ఆయన గుర్తు చేశారు. శ్రీవారి ఆస్తులను ఎలా కాపాడుకోవాలి? భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎలా వ్యవహరించాలి? అనే దానిపై ధార్మిక సంస్థలు, నిపుణుల సలహాలను కూడా స్వీకరిస్తామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా.. కబ్జా కాకుండా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు.

Latest Updates