అమ్మ‌కానికి తిరుమ‌ల శ్రీవారి భూములు.. వేలానికి క‌మిటీల ఏర్పాటు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గ‌తంలో టీటీడీ బోర్డు చేసిన తీర్మానానికి అనుగుణంగా త‌మిళ‌నాడులోని వేర్వేరు జిల్లాల్లో ఉన్న శ్రీవారి భూముల‌ను అమ్మ‌కానికి సిద్ధ‌మైంది. నిర‌ర్ధ‌కంగా ప‌డి ఉన్నాయ‌న్న పేరుతో 23 ప్రాంతాల్లో ఉన్న వ్య‌వ‌సాయ భూములు, ప్లాట్లను అమ్మేందుకు ఉత్త‌ర్వులు జారీ చేసింది టీటీడీ బోర్డు. ఇందు కోసం ఎనిమిది మంది అధికారుల‌తో రెండు కమిటీల‌ను నియ‌మించింది. వాటి రిజిస్ట్రేష‌న్ బాధ్య‌త‌ల‌ను కూడా వారికే అప్ప‌గించింది. ఆయా ఆస్తుల‌ను బ‌హిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారిని ఆదేశించింది. తిరువ‌ణ్ణామ‌లై, తిరుచిరాప‌ల్లి, తిరుచ్చి, తిరువ‌ళ్లూర్, ధ‌ర్మ‌పురి, విల్లుపురం, కంచి, కోయంబ‌త్తూర్, వెలూర్, నాగ‌ప‌ట్నం జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నాయి. వేలానికి సంబంధించిన టీటీడీ నిర్ణ‌యించిన క‌నీస ధ‌ర ప్ర‌కారమే ఆ భూములు దాదాపు రూ.కోటిన్న‌ర పైగా విలువ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

శ్రీవారి ఆస్తులను విక్రయించడానికి టీటీడీ సిద్ధం కావడంతో రాజ‌కీయ పార్టీలు, వివిధ సంస్థ‌ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి ఆస్తులను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని జనసేన, కాంగ్రెస్ పార్టీలు ఇప్ప‌టికే సూచించాయి. నిరర్థక ఆస్తుల పేర టీటీడీ ఆస్తులు అమ్మడం అపివేయాల‌ని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ డిమాండ్ చేశారు. కాపాడలేమంటూ టీటీడీ ఆస్తులు అమ్మాలనుకోవడంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌న్నారు.

Latest Updates