21న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల: సూర్య గ్రహణం కారణంగా ఈనెల 21వ తేదీన వేకువజాము నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామని తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఆదివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈ విషయం తెలిపారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో నాలుగు నెలల తర్వాత నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈవో భక్తులనుద్దేశించి మాట్లాడారు. గతంలో ప్రతి నెల మొదటి శుక్రవారి నిర్వహించే ఈ డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని భక్తుల నుండి అందిన సూచనల మేరకు ఈసారి ప్రయోగాత్మకంగా ఆదివారం ఉదయం 9 నుండి 10 వరకు నిర్వహించామన్నారు. భక్తుల స్పందన బాగుంటే ఇదే విధానం కొనసాగిస్తామన్నారు.

                        కరోనా వ్యాప్తి ని నివారించేందుకు గత మార్చి 20 నుండి తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీకి సంబంధించిన అన్ని ఆలయాల్లో భక్తులకు దర్శనాలు నిలిపేశామన్నారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఆలయాలను మూసేశామని.. కైంకర్యాలు జరగడం లేదని.. అన్న ప్రసాదాలు సరిగా నివేదించడం లేదని దుష్ఫ్రచారం చేశారని గుర్తు చేశారు. దీనిపై భక్తుల మనోభవాలు దెబ్బతినకుండా స్పష్టమైన ప్రకటనలు చేశామన్నారు. ఆలయాలలో జరిగే అన్నిసేవలు, కైంకర్యాలు.. నివేదనలు, ఉత్సవాలను సంప్రదాయబద్దంగా.. ఏకాంతంగా జరిపించామన్నారు.

                          ప్రభుత్వాలు లాక్ డౌన్ నుండి ఇచ్చిన మినహాయింపుల మేరకు జూన్ 8వ తేదీన తిరుమలతోపాటు అన్ని టీటీడీ ఆలయాల్లో ప్రతి రోజు ఆన్న లైన్ లో 3 వేల మందికి.. ఆఫ్ లైన్ లో.. కౌంటర్ల ద్వారా మరో 3 వేల మందికి కలిపి మొత్తం 6 వేల టికెట్లు జారీ చేసి దర్శనానికి అనుమతిస్తున్నామని ఆయన చెప్పారు. ఆన్ లైన్ లో ఒక్క రోజు లో నే జూన్ 30 వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను భక్తులు బుక్ చేసుకున్నారని.. సర్వదర్శనం టోకెన్లను జూన్ 21వ తేదీ వరకు కోటా పూర్తయిందన్నారు. ఇవాళ 22వ తేదీ నుండి టోకెన్లు జారీ ప్రారంభించామన్నారు.

                        అలిపిరి వద్ద దర్శన టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే అనుమతిస్తామని.. దూర ప్రాంతాల వారు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నాకే తిరుమలకు రావాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల ద్వారా దర్శనానికి రావాలనుకుంటే రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని.. కాబట్టి ఆన్ లైన్లో బుక్ అయితేనే దూర ప్రాంతాల నుండి తిరుపతికి వస్తే మంచిదని సూచించారు. ఒకరి పేరు మీద టికెట్ తీసుకుని మరొకరు దర్శనానికి వస్తే అనుమతిచ్చే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తులు కరోనా నిబంధనలను పాటిస్తూ.. 6 నుండి 7 అడుగుల సామాజిక దూరం పాటిస్తూ .. చేతులు శానిటైజ్ చేసుకుని సంతోషంగా దర్శనం చేసుకుంటున్నారని .. దర్శనాల సంఖ్య పెంచాలని సూచనలు అందుతున్నాయని.. దీనిపై పూర్తి స్థాయిలో పరిశిలన జరిపిన అనంతరం దర్శన టోకెన్ల సంఖ్యని పెంచుతామన్నారు.

                        ఆన్ లైన్ లో టోకెన్లు బుక్ చేసుకున్న భక్తులు వెంటనే వసతి సౌకర్యాన్ని కూడా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాలని ఈవో సూచించారు. 10 సంవత్సరాల లోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన భక్తులను కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు దర్శనానికి అనుమతించడం లేదన్నారు. ప్రతిరోజు వీఐపీలకు గంట మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించి మిగిలిన 12 గంటలు భక్తులకు దర్శనం కల్పిస్తున్నామన్నారు. టిటిడి అనుబంధ ఆలయాలలో ప్రతి రోజు 10 వేల మంది భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారని ఈవో వెల్లడించారు.లక్కీ డిప్ ద్వారా సేవా టికెట్లు పొందిన వారు తమ సేవల తేదీలను వాయిదా వేయాలని కోరుతున్నారని, ఆర్జిత సేవలు ప్రారంభించాక ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆన్ లైన్ ద్వారా ఆర్జిత, దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి రద్దు చేసుకునే అవకాశం కూడా కల్పించామని.. ఈ విధానంలో ఇప్పటి వరకు రూ .28 కోట్లు రీఫండ్ చేశామన్నారు.

Latest Updates