కందులు కొంటలేరు! చేతులెత్తేసిన రాష్ట్ర సర్కారు.. రైతుల ఆందోళన

కందులను కొనుగోలు కేంద్రాల్లో అమ్మడానికి తీసుకెళ్తున్న  రైతులకు మార్క్​ఫెడ్​ ఆఫీసర్ల నుంచి వస్తున్న నిర్లక్ష్యపు సమాధానాలివ్వి. అధికారులు ఇలాంటి కొర్రీలు పెట్టడం వెనుక కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కందులు కొనే ఉద్దేశమే లేదని ఆఫీసర్ల తీరును బట్టి అర్థమవుతోంది.  

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 5 లక్షల టన్నుల కందుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ప్రభుత్వం ఇప్పటికి కొన్నది  33 వేల 216 టన్నులు మాత్రమే. కేంద్రం తన కోటాగా 47 వేల 500 టన్నుల కందులను మాత్రమే తీసుకుంటోందని, ఈ లెక్కన ఇంకా14 వేల టన్నులే కొంటామని అంటోంది. ఇది దిగుబడిలో 10 శాతం మాత్రమే. మిగిలిన 90 శాతం దిగుబడులను దళారులకు అమ్ముకోవాలని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. ఈ క్రమంలో నారాయణపేట జిల్లాలో గురువారం అక్కడి మార్క్​ఫెడ్​ ఆఫీసర్లు సడెన్​గా కందుల కొనుగోలు నిలిపివేయడంతో రైతులంతా రోడ్డెక్కారు. మిగిలిన జిల్లాల్లోనూ కొనుగోళ్లకు ఆఫీసర్లు ససేమిరా అంటుండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

5 లక్షల టన్నుల దిగుబడి

ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో కంది పంట సాగవుతోంది. ఈ ఏడాది 7 లక్షల 39 వేల ఎకరాల్లో కంది వేయగా.. 4 లక్షల 32 వేల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ తొలుత భావించింది. వాతావరణం అనుకూలించడంతో ప్రస్తుతం ఈ అంచనా 5 లక్షల టన్నులకు చేరింది. అనుకున్నట్లే రాష్ట్రవ్యాప్తంగా మార్క్​ఫెడ్​ ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలకు కందులు పోటెత్తుతున్నాయి.

గతంలో కొని నష్టపోయామని..

గతంలో కందులు కొని నష్టపోయామని, ఈసారి చేతులు కాల్చుకోలేమని అధికారులు అంటున్నారు. కంది కొనుగోళ్లకు సంబంధించి ఇటీవల మార్క్​ఫెడ్ అధికారులతో వ్యవసాయమంత్రి నిరంజన్​రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రం నుంచి అదనంగా మరో 56 వేల టన్నులు కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. కానీ అక్కడి నుంచి స్పందన రాలేదు. ఒకవేళ కేంద్రం 56 వేల టన్నులు కొన్నా.. 4లక్షల టన్నులు మిగిలిపోతాయి. మరి వాటిని ఎవరు కొంటారనే ప్రశ్నకు రాష్ట్ర ం వద్ద సమాధానం లేదు. కేంద్రం తీసుకునే 47 వేల 500 టన్నుల్లో ఇప్పటికే 33 వేల 216 టన్నులను కొన్నామనీ, మిగిలిన 14 వేల టన్నులను కొని తప్పుకుంటామని మార్క్​ఫెడ్​ ఆఫీసర్లు చెబుతున్నారు.

ముందస్తు అంచనా లేకే..

ఈ పరిస్థితి రావడానికి ముందస్తు అంచనా లేకపోవడమేనని తెలుస్తోంది. సీజన్​లో రాష్ట్రంలో ఎంత కంది సాగవుతుందో లెక్కేయాలని జూన్ లోనే వ్యవసాయాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కానీ అలా చేయలేదు. ముందస్తుగా అంచనా వేసి, కేంద్రాన్ని అప్రమత్తం చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, రాష్ట్రం ఎలాంటి ఎస్టిమేషన్స్​ ఇవ్వకపోవడం, కోటా పెంపుపై విజ్ఞప్తి చేయకపోవడంతో కేంద్రం ఎప్పట్లాగే రాష్ట్రాలవారీగా కోటాలను నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మీ పొలంలోనే పండినయని గ్యారంటీ ఏంది?

కందుల కొనుగోలు నుంచి దాదాపు తప్పుకునే ఆలోచనలో రాష్ట్ర ఆఫీసర్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో కురిసిన చిరుజల్లుల కారణంగా కందులు కొంతమేర తడవడాన్ని ఆఫీసర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. కందుల్లో తేమ శాతం 12కు మించి ఉందని కొర్రీలు పెడుతూ కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారు. ఎకరాకు కేవలం రెండున్నర క్వింటాళ్లే కొంటామని చెబుతున్నారు. అంతకుమించి దిగుబడి వచ్చిందని చెప్పినా వినిపించుకోవడం లేదు. ‘ఈ కందులు మీ పొలంలనే పండించిండ్రని గ్యారెంటీ ఏంది?’ అని   ప్రశ్నిస్తున్నారు. ఇందుకోసం ఆధారాలు చూపాలని అడగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వాతావరణం అనుకూలించి దిగుబడి ఎక్కువ  వస్తే  తమ తప్పేమిటని రైతులు అంటున్నారు. అప్పటికీ ఏమీ తోచని రైతులు రోజుల తరబడి మార్కెట్​లో కందులు ఆరబోస్తూ, కొనుగోలు చేయాలని ఆఫీసర్లను బతిమిలాడుకుంటున్నారు. ఎంతకీ కొనకపోవడంతో దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా దళారులు రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 5,800 ఉండగా.. దళారులు రూ. 3,800 నుంచి 4,500 మధ్య కొంటున్నారు.

ఏ జిల్లాలో చూసినా రైతులకు తిప్పలే

ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలోని తాండూరులో 23 వేల క్వింటాళ్లు కొంటామని చెప్పిన ఆఫీసర్లు.. ఇప్పటివరకు కేవలం 3 వేల క్వింటాళ్లు కొన్నారు. రోజుకు 50 చొప్పున టోకెన్లు ఇస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా జుక్కల్, మద్నూర్, బిచ్కుందలో రైతులు పది రోజులు గా కంది పంట అమ్ముకునేందుకు పడిగాపులు కాస్తున్నారు.

ఆసిఫాబాద్ జిల్లాలో 11,547 హెక్టార్లలో కంది సాగు చేశారు.  కాగజ్​నగర్​, ఆసిఫాబాద్​లో ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. జైనూరులో ఉన్నా కొనడం లేదు. దీంతో తక్కువ ధరకే దళారులకు పంటను అమ్ముకుంటున్నారు.

జగిత్యాల జిల్లాలోని 18 మండలాల్లో సుమారు 3,874 ఎకరాల్లో కంది సాగు చేయగా.. 19,325 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. జిల్లాలో కొరుట్లలో మాత్రమే కేంద్రం ఉంది. తేమ ఎక్కువుందన్న కారణంతో ఇంతవరకు గింజ కూడా కొనలేదు.

ఖమ్మం జిల్లాలో  దాదాపు 1,680 ఎకరాల్లో  కంది పంట సాగు చేశారు. నేలకొండపల్లిలో రెండు రోజల కింద, వైరాలో గురువారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీజన్ ప్రారంభంలో పేరు నమోదు కాకపోతే వీఆర్వో, వ్యవసాయ అధికారి నుంచి లెటర్​ తెచ్చుకుంటే కొంటున్నారు.

సిద్దిపేట జిల్లాలో 25 వేల ఎకరాల్లో కంది పంట వేయగా,  దాదాపు లక్ష క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.  క్వింటాల్​ కందులకు రూ. 5,800 ధర నిర్ణయించి మార్క్ ఫెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించింది. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉందంటూ కూడా కొనుగోలు చేయడంలేదు.

కామారెడ్డి జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిఉండగా, కేవలం 4 కేంద్రాలనే ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో కేవలం 490 క్వింటాళ్ల కందులు మాత్రమే కొనుగోలు చేశారు.

ఆదిలాబాద్​ జిల్లాలో 2 లక్షల క్వింటాళ్ల కంది దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు..  పది కేంద్రాలను ఏర్పాటు చేశారు.  10,985 క్వింటాళ్లను కొనుగోలు చేశారు.  సహకార ఎన్నికలు, వాతావరణ పరిస్థితుల కారణంగా 16 వరకు కొనుగోళ్లను నిలిపివేసినట్లు చెబుతున్నారు.

నాగర్ కర్నూల్​ మార్కెట్​లో 7వేల క్వింటాళ్లు, కల్వకుర్తి మార్కెట్ లో 7300 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. కానీ డబ్బులు ఇవ్వలేదు. అచ్చంపేట, కొల్లాపూర్​లో కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది.

మహబూబ్ నగర్ జిల్లాలో 75 వేల హెక్టార్లలో కంది పండించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పటివరకు కేవలం 12 వేల క్వింటాళ్లు కొన్నారు. 4 రోజుల నుంచి కొనుగోళ్లను నిలిపివేశారు. రైతులు ఆందోళన చెందుతున్నారు.

సూర్యాపేట జిల్లాలో 800ఎకరాల్లో కంది సాగవగా, గురువారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంది కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు.

యాదాద్రి జిల్లాలో 9,988 హెక్టార్లలో కందులను సాగు చేశారు. జిల్లాలో 6 కేంద్రాలను ఏర్పాటు చేసి కందులు కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు మోత్కూర్​లోని  కొనుగోలు కేంద్రంలో గురువారం ఆందోళనకు దిగారు.

Latest Updates