కేసీఆర్​ ప్రకటించినా పసుపు కొనని అధికారులు

    రాష్ట్ర మార్కెట్​లో ఏటా పడిపోతున్న ధరలు

    ప్రస్తుతం క్వింటాల్​ పసుపు రూ. 3,500 నుంచి 4,750

    ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువు… ఆందోళనలో రైతులు

పసుపు పంట పండించడంలో దేశంలోనే ముందువరుసలో ఉన్న రాష్ట్ర రైతులకు దాన్ని అమ్మితే కనీసం లాగోడి పైసలు కూడా రావడం లేదు. రాష్ట్ర మార్కెట్​లో నానాటికీ పసుపు ధర పడిపోతోంది. ప్రస్తుతం క్వింటాల్​ధర రూ. 3, 500 నుంచి 4,750 మధ్యే పలుకుతోంది. గత ఐదేండ్లుగా చూస్తే సగటున క్వింటాల్​ ధర రూ. 5 వేలు కూడా మించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కరువయ్యాయి.  మార్క్‌‌ఫెడ్‌‌ ద్వారా మద్దతు ధరకు పసుపును కొంటామని ఇటీవల శాసన మండలిలో సీఎం కేసీఆర్​ ప్రకటించినా.. అది ఈ ఏడాది అమలు అవుతుందా అనేది అనుమానమే.

ఐదేండ్లుగా అదే పరిస్థితి

రాష్ట్ర మార్కెట్​లో పసుపు ధర ఏటా తగ్గుతూ వస్తోంది. ఐదేండ్ల కిందట క్వింటాల్‌‌  పసుపు ధర రూ. 7,900 ఉండగా.. ప్రస్తుతం రూ. 3 వేలకు  వరకు పడిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి రూ. 5,256 వరకు పలికింది. ఈ నెల 6న కేసముద్రం మార్కెట్‌‌లో అత్యధికంగా రూ. 4, 751 ధర పలికింది. నిజామాబాద్‌‌ మార్కెట్‌‌లో ఈ నెల 6న  రూ. 4,200 పలికింది. వరంగల్‌‌ మార్కెట్‌‌లో ఈ నెల 5న రూ. 3,600 మాత్రమే పలికింది.

మహారాష్ట్ర వైపు చూపు

ఎనిమిది నెలలపాటు సాగయ్యే పసుపు.. ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో ఇటీవలే మార్కెట్‌‌కు వచ్చింది. మరి కొన్ని ప్రాంతాల్లో పంట చివరి దశలో ఉంది. మద్దతు ధర కల్పించకపోవడంతో కమీషన్ ఏజెంట్లు, దళారులు సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరలకే రైతుల వద్ద నుంచి పసుపు కొంటున్నారు. ఇక్కడ ధర తక్కువ పలుకుతుండడంతో రైతులు మహారాష్ట్రకు పంటను తీసుకొని అమ్ముకుంటున్నారు.  ఇక్కడికన్నా మహారాష్ట్ర మార్కెట్​లో అదనంగా రూ. 600 వరకు వస్తోంది. అక్కడి వరకు వెళ్లలేని వాళ్లు ఇక్కడే అంతకో ఇంతకో అమ్ముకుంటున్నారు.

తగ్గుతున్న సాగు

రాష్ట్ర మార్కెట్​లో గిట్టుబాటు ధర లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోవడంతో పసుపును సాగు చేసే రైతులు క్రమంగా తగ్గిపోతున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ రూరల్‌‌, మహబూబాబాద్‌‌, వికారాబాద్‌‌ జిల్లాల్లో పసుపు పంట సాగవుతుంటుంది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష యాభై వేల ఎకరాల్లో పసుపు సాగైతే.. ప్రస్తుతం లక్షా ముప్ఫై వేల ఎకరాలు కూడా మించడం లేదు. ఎకరానికి 18 నుంచి 20 క్వింటాల్‌‌ వరకు పండే పసుపు.. ఈ ఏడాది 15 నుంచి 13 క్వింటాళ్ల వరకే వస్తోంది. చీడల వల్ల దిగుబడి తగ్గుముఖం పట్టిందని రైతులు చెబుతున్నారు. ఎకరా పసుపు సాగుకు రూ. 40వేలకు పైగా ఖర్చవుతుందని, దాన్ని మార్కెట్​కు తరలిస్తే పెట్టుబడులు రావడం లేదని, అందుకే పండించడం మానేస్తున్నామని రైతులు అంటున్నారు.

ప్రాసెస్‌‌ చేస్తేనే మేలు

పసుపును ప్రాసెస్​ చేసి.. వివిధ రూపాల్లో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే లాభమని వాణిజ్య నిపుణులు అంటున్నారు. ఈ వైపుగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలని, గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని సూచిస్తున్నారు. పసుపును ఉడుక బెట్టేందుకు బాయిలర్‌‌ మెషిన్‌‌లు అందించాలని,  పంటను ఎండబోసుకునేందుకు సిమెంట్‌‌ ప్లాట్‌‌ ఫారమ్‌‌లు ఏర్పాటు చేయాలని, పసుపును పాలిష్‌‌ చేసేందుకు పాలిష్‌‌ మెషిన్లు అందించాలని, పసుపును మర ఆడించి నాణ్యమైన పసుపు పొడి అందించేందుకు మిషనరీలను సమకూర్చాలని వారు అంటున్నారు. పసుపుకోసం ప్రత్యేకంగా 50 ఎకరాల్లో సెంటర్‌‌ ఆఫ్‌‌ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి నాణ్యమైన పసుపు విత్తనాలు అందించాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే పసుపు రైతుల జీవితాలు బాగుపడుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

వచ్చే సారి పసుపు పెట్టం

ఇప్పటికే  ఎకరానికి రూ. 35 వేల నుంచి
40 వేల వరకు పెట్టుబడి పెట్టి.. మూడెకరాలు పసుపు పంట వేసినం. పంటకు రోగం తాకి ఎకరాకు పది పన్నెండు  క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు.  మార్కెట్​లో గిట్టుబాటు ధర రావడం లేదు. 8 నెలలు కష్టపడితే ఏం లాభం ఉంటలేదు. వచ్చేసారి పసుపు పెట్టం.

– వెంకన్న, రైతు, మహబూబాబాద్‌‌ జిల్లా

Latest Updates