డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఎన్సీబీ అధికారులకు అడ్డంగా దొరికిన నటి ప్రీతికా

మరోసారి డ్రగ్స్ మాఫియా కలకలం రేపుతుంది.  సావధాన్,దేవో కే దేవ్ మహారాజ్ వంటి ప్రముఖ హిందీ సీరియళ్లలో నటించిన ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రీతికా డ్రగ్స్ కొనుగోలు చేస్తుందంటూ సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు మఫ్టీలో ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో రెక్కీ నిర్వహించారు. సరిగ్గా ఫైజల్(20) అనే యువకుడి నుంచి ప్రీతికా డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 99గ్రా. గంజాయితో పాటు మారిజునా మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాగా అక్టోబర్ 24 సాయంత్రం నుంచి ఎన్‌సీబీ మొత్తం మూడు ప్రాంతాల్లో దాడులు చేసింది. మహమ్మద్ అలీ రోడ్డులోని మసీద్ సమీపంలో బ్రూనో జాన్ ఎంగ్వాలే అనే ఓ టాంజానియన్‌ని అదుపులోకి తీసుకుంది. అతనిచ్చిన సమాచారం ఆధారంగా..,నిషేధిత డ్రగ్స్‌ను కొన్ని ముఠాలు విదేశాల నుంచి కొనుగోలు చేసి ముంబైలోని సెలబ్రిటీలకు,హైప్రొఫైల్ వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు ఎన్‌సీబీ గుర్తించింది. ఇప్పటికే హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ బాలీవుడ్‌లో తాజాగా ప్రీతికా చౌహాన్ అరెస్ట్ మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Latest Updates