టీవీ అంటే స్మార్ట్..

రేట్లు తక్కువుండటమే కారణం
ఇంటర్నెట్ కూడా చీప్
కలిసొచ్చిన సినిమా థియేటర్ల బంద్ 

బిజినెస్ డెస్క్, వెలుగుకరోనా లాక్‌‌డౌన్ కారణంగా టీవీ చూసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంట్లో ఎక్కువ సేపు ఉండాల్సి రావడం, సినిమా థియేటర్లు మూతబడటం, టిక్‌‌టాక్, పబ్జీ వంటి యాప్స్ బ్యాన్ చేయడం ఇందుకు కారణాలు.  దీంతో వీటి అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో వీటికి డిమాండ్ ఎంతగా పెరుగుతున్నదంటే.. ఈ ఏడాది దీపావళి సీజన్‌‌లో అమ్ముడయ్యే వాటిలో 90 శాతం స్మార్ట్‌‌ టీవీలే ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. ఇండియా టీవీ మార్కెట్ విలువ రూ.79 వేల కోట్ల వరకు ఉంటుంది. శామ్‌‌సంగ్ ఇది వరకు టీవీ మార్కెట్‌‌లో లీడర్. 2018లో టీవీల మార్కెట్లోకి వచ్చినా షావోమీ సేల్స్‌‌లో  శామ్‌‌సంగ్‌‌కు తీవ్ర పోటీని ఇస్తోంది.  ఇండియా స్మార్ట్‌‌ టీవీ మార్కెట్‌‌లో షావోమీకి మెజారిటీ మార్కెట్ వాటా ఉంటుంది. స్మార్ట్‌‌ టీవీ స్క్రీన్లు కనీసం 32 ఇంచుల నుంచి 85 ఇంచుల వరకు ఉంటున్నాయి. వీటిపై సినిమాలు చూస్తే థియేటర్‌‌‌‌లో చూసిన అనుభూతి కలుగుతోంది. పైగా ఇప్పుడు కొత్త సినిమాలన్నీ నెట్‌‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి ఓటీటీ యాప్స్‌‌లో రిలీజ్ అవుతున్నాయి. వీటిని జనం ఎప్పటికప్పుడు స్మార్ట్‌‌ టీవీల్లోనే చూస్తున్నారు. పైగా ఇంటర్నెట్ సెర్చింగ్, యూట్యూబ్ వంటి ఫీచర్లూ వీటిలో అదనం.

ఒకప్పుడు పాత కంపెనీలదే హవా..

ఇండియాలో 2017 వరకు శామ్‌‌సంగ్, ఎల్జీ, సోనీలకు కలిపి 65 శాతం మార్కెట్ షేర్ ఉండేది. అప్పట్లో స్మార్ట్‌‌ టీవీల అమ్మకాలు 20 శాతం మించేవి కావు. ఎంట్రీ లెవెవ్ మోడల్స్ ధరలే రూ.30 వేల నుంచి మొదలయ్యేవి. సాధారణ టీవీల ధరలు రూ.15 వేల వరకు ఉండేవి. షావోమీ స్మార్ట్‌‌ టీవీల మార్కెట్‌‌కు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. 2018లో ఇది కేవలం రూ.13 వేల రేటుతో ఎంఐ స్మార్ట్‌‌ టీవీని లాంచ్ చేసింది. ఇందులో నెట్‌‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌‌స్టార్ వంటి యాప్స్‌‌తో పాటు వై–ఫై, మొబైల్ హాట్‌‌స్పాట్‌‌ వంటి ఫెసిలిటీలను కల్పించింది. దీంతో అప్పటి నుంచి కస్టమర్లకు సాధారణ టీవీలను వదిలేసి స్మార్ట్‌‌ టీవీలను కొనడం మొదలుపెట్టారు. షావోమీ రెండేళ్లలోనే 40 లక్షల స్మార్ట్‌‌ టీవీలను అమ్మింది. గత ఆర్థిక సంవత్సరంలో షావోమీ 32 శాతం, శామ్‌‌సంగ్, ఎల్జీ 14 వాతం, సోనీ 11 శాతం మార్కెట్ షేర్ సాధించాయి. సామాన్య జనానికి స్మార్ట్‌‌ టీవీలను దగ్గర చేయడంలో షావోమీది కీలకపాత్ర అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్‌‌కు చెందిన దేవాశిష్ జనా అన్నారు. తమ కంపెనీ ఫోన్లు కొన్నవాళ్లు స్మార్ట్‌‌ టీవీలూ కావాలని కోరుకున్నారని షావోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ అన్నారు. జియో రాకతో డేటా అత్యంత చీప్‌‌గా దొరుకుతుండటంతో స్మార్ట్‌‌ టీవీలకు దూకుడు ఆగడం లేదు. కేవలం రూ.150తో రీచార్జ్ చేస్తే రోజుకు ఒక జీబీ డేటా వస్తోంది. పైగా రూ.ఏడు వేలకే స్మార్ట్‌‌ టీవీని కొనేంతగా ధరలు దిగివచ్చాయి. యూట్యూబ్‌‌తో పాటు ఇతర ప్లాట్‌‌ఫామ్‌‌లో  ఉచితంగా సినిమాలు, టీవీ చానెళ్లు ప్రసారమవుతున్నాయి. దీంతో చాలా మంది కస్టమర్లు సాధారణ డిష్ కనెక్షన్లను, డీటీహెచ్‌‌లను వదిలేసి స్మార్ట్‌‌ టీవీలవైపు మళ్లుతున్నారు. అందుకే గత ఏడాది ఏకంగా 1.5 కోట్ల స్మార్ట్‌‌ టీవీలు అమ్ముడయ్యాయి. వీటిలో శామ్‌‌సంగ్‌‌  టీవీలు 15 శాతం కాగా, ఎంఐ టీవీలు 14 శాతం ఉన్నాయి. షావోమీ సక్సెస్‌‌తో  వన్‌‌ప్లస్, రియల్‌‌మీ, నోకియా, మోటరోలా కూడా స్మార్ట్‌‌ టీవీలను ఆన్‌‌లైన్‌‌లో  అమ్మడం మొదలుపెట్టాయి. వ్యూ, కోడక్, థామ్సన్ వంటి బ్రాండ్లు కూడా తక్కువ ధరల్లో స్మార్ట్‌‌ టీవీలను అమ్ముతున్నాయి. టీసీఎల్ ఏపీలోని తిరుపతి సమీపాన రూ.2,400 కోట్లతో టీవీ ప్యానెల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. షావోమీ టీవీలను కూడా తిరుపతిలోని డిక్సన్ ప్లాంటు అసెంబుల్ చేస్తోంది. పల్లెటూళ్లలో బ్రాడ్‌‌ బ్రాండ్ మరింత విస్తరిస్తే స్మార్ట్‌‌ టీవీలకు డిమాండ్ మరింత పెరుగతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.

1.5 కోట్లు.. గత ఏడాది అమ్ము డైన స్మార్ట్​ టీవీలు
నాన్ స్మార్ట్ టీవీ సెగ్మెంట్ గ్రోత్ 7%
ఏటా స్మార్ట్​ టీవీ మార్కెట్ గ్రోత్  25%
ఏటా టీవీ మార్కెట్ గ్రోత్ 15%
ఎల్ఈడీ ప్యానెల్స్​తో తయారయ్యే స్మార్ట్​ టీవీలు 90%

 

 

Latest Updates