ఎంపీ విజయసాయిపై టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ 100కోట్ల పరువునష్టం దావా

హైదరాబాద్, వెలుగు:  టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై వస్తున్న ఆరోపణలపై ఆయన ఆఫీసు స్పందించింది. రవిప్రకాశ్​పై అసత్య ఆరోపణలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిపై రూ.100 కోట్ల పరువునష్టం దావాను వేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. నిరాధారమైన ఆరోపణలను అత్యుత్సాహంతో ప్రసారం చేసిన ఛానెళ్లపై కూడా చర్య తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏబీసీఎల్‌‌ సంస్థలోకి చట్టవ్యతిరేకంగా ప్రవేశించిన మై హోమ్ రామేశ్వరరావు, మెఘా కృష్ణా రెడ్డి కలిసి విజయసాయిరెడ్డితో  నీచమైన ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించింది. వారి అనుచరుడైన రామారావు నెల కిందట ఇవే అసత్య ఆరోపణలను లిఖితపూర్వకంగా వివిధ శాఖలకు పంపించారని, కానీ అవి గాలి కబుర్లేనని అధికారులు నిర్ధారించారని పేర్కొంది. రామారావు పంపిన లేఖ కాపీనే ఎంపీ విజయసాయి రెడ్డి తన లెటర్ హెడ్ పై పంపించారని తెలిపింది. విదేశీ నిధులను తరలించారంటూ గతంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై అబద్ధపు ఫిర్యాదులు పంపి అభాసుపాలయిన రామారావు ఇప్పుడు రవిప్రకాష్ పై ఆధారాలు లేని ఆరోపణలను చేస్తున్నారని, ఈ కట్టుకథల వెనుక ఆ పెద్దలే ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొంది. కంపెనీ షేర్ల వివాదంలో పైచేయి సాధించడం కోసమే వారు ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని వివరించింది.

Latest Updates