ట్రంప్‌ ట్వీట్లకు ఫ్యాక్ట్‌ చెక్‌ వార్నింగ్‌

  • జారీ చేసిన ట్విట్టర్‌‌
  •  ఇదే మొదటిసారి

వాషింగ్టన్‌: ఎన్నికల్లో మెయిల్‌ – ఇన్‌– బ్యాలెట్‌ వాడటం వల్ల మోసం జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్లకు ట్విట్టర్‌‌ ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ వార్నింగ్‌ ఇచ్చింది. ఎలక్షన్స్‌కు సంబంధించి ఆయన చేసిన రెండు ట్వీట్లు నిజమో కాదో తెలుసుకోవాలని నెటిజన్లకు ట్విట్టర్‌‌ సూచించింది. ట్రంప్‌ ట్విట్లకు‘ఫ్యాక్ట్‌ చెక్‌’ వార్నింగ్‌ను ఇదే మొదటిసారి. సాధారణ ఖాతాదారుల విషయంలో పాటించే రూల్స్‌ను అధ్యక్షుడు ట్రంప్‌కు వర్తించవని ఇప్పటి వరకు చెప్పిన ట్విట్టర్‌‌ ఇప్పుడు ఇలా వ్యవహరించడం చర్చనియాంశంగా మారింది. ట్విట్టర్‌‌ వాడకంలో ట్రంప్‌ తన పరిమితులని దాటి ప్రవర్తిస్తున్నారనే విషాయన్ని ఈ హెచ్చరిక ద్వారా పరోక్షంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నవంబర్‌‌లో జరగనున్న అమెరికా ప్రెసిడెంట్‌ ఎలక్షన్స్‌లో ‘మెయిల్‌ – ఇన్‌ – బ్యాలెట్‌’ పద్ధతిని అవలంబించాలని కాలిఫోర్నియా గవర్నర్‌‌ గవిన్‌ న్యూసోమ్‌ నిర్ణయాన్ని ట్రంప్‌ తప్పుపట్టారు. ‘మెయిల్‌ – ఇన్‌ – బ్యాలెట్‌’ ద్వారా మోసం జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ‘అది పెద్ద మోసం అనండంలో ఎలాంటి సందేహం లేదు. మెయిల్‌ బాక్సులను దొంగతం చేయొచ్చు. బ్యాలెట్లను ఫోర్జరీ చేయొచ్చు. అక్రమంగా ముద్రించొచ్చు. దొంగ సంతకాలు పెట్టొచ్చు. కాలిఫోర్నియా గవర్నర్‌‌ లక్షలాది బ్యాలెట్లను పంపుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో చూడకుండా అందరికీ పంచేస్తున్నారు. అలా జరిగితే అది రిగ్గింగే” అంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేయగా.. దానికి ట్విట్టర్‌‌ ఫ్యాక్ట్‌ చెక్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఓటు వేసేందుకు వెసులుబాటు లేని వారు ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. దీని కోసం ముందుగానే రిజిస్టర్‌‌ చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేందుకు అమెరికాలో చాలా మంది ఈ విధానాన్ని పాటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Latest Updates