నగరంలో బీహార్​ పిస్టల్స్..ఇద్దరు అరెస్ట్​

two-arrested-illegally-selling-bihar-pistols

హైదరాబాద్​, వెలుగు: బీహార్​ నుంచి పిస్టల్స్​ తెచ్చి నగరంలో అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. రెండు గన్నులు, ఆరు రౌండ్​ల బుల్లెట్లు, మూడు మేగజీన్లు, రెండు సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్​వోటీ అడిషనల్​ డీసీపీ సురేందర్​రెడ్డితో కలిసి రాచకొండ జాయింట్​ సీపీ సుధీర్​బాబు వివరాలను వెల్లడించారు. బీహార్​లోని ముంగేర్​ జిల్లాకు చెందిన అరుణ్​ యాదవ్​ (30), శంకర్​ యాదవ్​ (48)లు ఏడేళ్ల కింద హైదరాబాద్​కు వచ్చారు. అల్మాస్​గూడలో ఉంటున్న అరుణ్​ యాదవ్​ ఓ బార్​లో పనిచేస్తున్నాడు. శంకర్​ యాదవ్​ సికింద్రాబాద్​లోని ఓ హోటల్​కు వాచ్​మెన్​గా ఉన్నాడు. ఈజీ మనీకి అలవాటు పడిన అరుణ్​ యాదవ్​, బీహార్​కే చెందిన మిథిలేశ్​ (35) అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. అతడి నుంచి ₹20 వేలకు గన్నులు కొని శంకర్​ యాదవ్​తో కలిసి నగరంలోని నేరగాళ్లకు లక్షలకు అమ్ముతున్నాడు. తాజాగా ఓ వ్యక్తికి ఇలాగే గన్నులు అమ్ముతున్నాడన్న సమాచారంతో పోలీసులు  మీర్​పేట్​లోని అల్మాస్​గూడలో అరుణ్​ యాదవ్​, శంకర్​ యాదవ్​లను అరెస్ట్​ చేశారు. పరారీలో ఉన్న మిథిలేశ్​ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ముగ్గురిపైనా బీహార్​లో కేసులున్నట్టు చెప్పారు. గన్నులను ఇప్పటిదాకా ఎవరెవరికి అమ్మారు, ఇంకా ఎవరున్నారన్నదానిపై విచారిస్తున్నారు.


Latest Updates