కళ్లెదుటే ఇద్దరు కొడుకులు మునిగిపోయారు

  • కోయిల్​సాగర్​ బ్యాక్​వాటర్​లో పడి అన్నదమ్ముల మృతి
  • కాపాడే యత్నంలో తల్లిదండ్రుల మునక
  • కాపాడిన యువకుడు

కోయిలకొండ, వెలుగు: తల్లిదండ్రుల కళ్లెదుటే ఇద్దరు కొడుకులు కోయిల్ సాగర్ బ్యాక్ వాటర్ లో పడి మృతిచెందారు. మహబూబ్​నగర్​జిల్లా కళ్యాణ్ నగర్ తండాకు చెందిన రాందాస్(46) ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. డిసెంబర్ 1న రాందాస్ పెద్ద కూతురు సుమ వివాహం ఉండడంతో నవంబరు 29న కళ్యాణ్ నగర్ తండాకు వచ్చారు. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెద్దవాగు సమీపంలోని వంతెన దగ్గరగల రాందాస్ బావ మరిది డీక్యానాయక్ వరి కల్లం దగ్గరికి భార్య అంజిలాబాయి, కొడుకు ప్రవీణ్(26), సంజయ్(20), బావమరిది కొడుకు ప్రకాశ్ తో కలిసి​వెళ్లారు. వీరంతా వరి కల్లం దగ్గర సంచుల్లో ధాన్యం నింపారు. అనంతరం కాళ్లు చేతులు కడుక్కునేందుకు పక్కనే ఉన్న కోయిల్ సాగర్ బ్యాక్ వాటర్ లోకి దిగారు. ప్రవీణ్, సంజయ్ ప్రమాదవశాత్తు నీటిలో పడ్డారు. వారిని కాపాడేందుకు తండ్రి రాందాస్, తల్లి అంజిలాబాయి, బావ ప్రకాశ్​నీటిలో దూకారు. ఎవరికీ ఈత రాకపోవడంతో ఐదుగురు నీటిలో మునిగిపోసాగారు. వారి అరుపులు విని అటుగా వెళుతున్న చిన్న రాజమూర్ గ్రామానికి చెందిన బుచ్చన్న నీటిలో దూకి అంజిలాబాయి చీర సాయంతో ఆమెను బయటకు లాగారు. ఆమెతోపాటు రాందాస్, ప్రకాశ్​లను కాపాడాడు. అప్పటికే ప్రవీణ్, సంజయ్ నీటిలో మునిగిపోయారు. చుట్టుపక్కల తండావాసులు నీటిలో గాలించి ప్రవీణ్, సంజయ్ మృతదేహాలను వెలికితీశారు. కోయిలకొండ ఎస్సై సురేష్  కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు.

Latest Updates