సంచలనం రేపిన రెండు జంటల ఆత్మహత్యలు

two-couples-committed-suicide-in-kurnool-district
  • ఒకే రోజు రెండు చోట్ల జంట ఆత్మహత్యలు
  • రెండు చోట్లా ఉరేసుకుని తనువు చాలించిన జంటలు
  • బనగానపల్లె మండలం సాదుకొట్టం లో పూజారి దంపతుల ఆత్మహత్య
  • పాణ్యం మండలం గోరుకల్లు లో ప్రేమజంట ఆత్మహత్య

రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో వేర్వేరు చోట్ల రెండు జంటల ఆత్మహత్య లు సంచలనం సృష్టించాయి. ఒకే రోజు రెండు చోట్ల జంట ఆత్మహత్యలు హాట్ టాపిక్ గా మారాయి. కష్టాలు భరించలేక క్షణికావేశం తో.. పూజారి దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటే.. తమ పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. రెండు చోట్లా ఉరేసుకుని తనువు చాలించిన జంటల ఉదంతాలతో కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది.

బనగానపల్లె మండలం సాదుకొట్టం గ్రామంలో పూజారి దంపతుల ఆత్మహత్య ఉదంతం ఉదయమే వెలుగు చూసింది. సాధుకొట్టం గ్రామంలో నివాసముంటున్న మృత్యుంజయాచారి, సరస్వతి దంపతులు ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.మృత్యుంజయచారి స్థానిక ముడియాల స్వామి దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. మృత్యుంజయాచారి దంపతులు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. ఆయన కనిపించక పోవడం పై అనుమానంతో ఆరా తీసిన స్థానికులకు ఇద్దరూ ఉరేసుకున్నట్లు ఆలస్యంగా గుర్తించారు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఊరేసుకున్న యువ జంటను స్థానికులు గుర్తించారు. పసి ప్రాయం వీడని ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. గోరుకల్లు గ్రామ సమీపంలోని పెద్దస్వామి దర్గా ఆవణలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వారు స్థానికులు కాకపోవడంతో వీరెవరన్నది తెలియరాలేదు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా.. బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పెద్దక్క, గడివేముల మండలం కొరటమద్ది గ్రామానికి చెందిన గుంది భరత్ అనే ప్రేమికులుగా తేలింది. పెద్దక్క వయసు16 సంవత్సరాలు. భరత్ వయస్సు 21 ఏళ్ళు. పెళ్లి విషయంలో పెద్దలు అంగీకరించ లేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒకే రోజు రెండు చోట్ల జంట ల ఆత్మహత్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Latest Updates