విశాఖలో సాయినార్‌ ఫార్మా కంపెనీలో గ్యాస్‌ లీకేజీ ..ఇద్దరి మృతి

ఆంధ్రప్రదేశ్ విశాఖలో మరో సారి విషాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గత రాత్రి 11:30 గంటల సమయంలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత ఆ కంపెనీ పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.  వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ వినయ్‌ చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా ఫ్యాక్టరీ పరిసరాలను పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన షిఫ్ట్ ఇన్‌ చార్జ్ రాగినాయుడు, కెమిస్ట్ గౌరీశంకర్‌ల మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అస్వస్థతకు గురైన ఎల్వీ చంద్రశేఖర్, పి.ఆనంద్ బాబు, డి.జానకీ రామ్, ఎం.సూర్యనారాయణలను గాజువాకలోని ఆర్కే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ దగ్గర చేరడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు.