ప్రేమించిన అమ్మాయి ఇంటికి నిప్పు..ఇద్దరు సజీవ దహనం

  • అందులో ఐదేళ్ల చిన్నారి
  • చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి
  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

అమరావతి, వెలుగు: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయిని మరొకరికి ఇచ్చి పెళ్లి చేశారనే కోపంతో శ్రీనివాస్ అనే వ్యక్తి యువతి ఇంట్లోవాళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలు కాలిపోయి చనిపోగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ చనిపోయారు. కడియం మండలం దుళ్లకు చెందిన శ్రీనివాస్(28) అదే ఊరికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. కానీ, ఆమె కుటుంబ సభ్యులు మరొకరికిచ్చి కొద్దిరోజుల కిందటే పెళ్లి చేశారు. దీంతో యువతి కుటుంబంపై శ్రీనివాస్ కక్ష పెంచుకున్నాడు. బుధవారం తెల్లవారు జామున ఆ యువతి కుటుంబ సభ్యులు నిద్రలో ఉన్న సమయంలో ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించి బయట డోర్ లాక్ చేసి పరారయ్యాడు. దీంతో యువతి తమ్ముడు రాము(18), అక్క కూతురు విజయలక్ష్మి (5) మంటల్లో కాలిచనిపోయారు. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం తల్లి సత్యవతి, అక్క దుర్గా భవానీ మృతిచెందారు.

ఐదు రోజుల కిందటే కత్తితో దాడి

మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో నిందితుడు శ్రీనివాస్ కారు ఆగిపోయిందని చెప్పి దుళ్ల పెట్రోల్ బంకులో ఓ క్యాన్ లో పెట్రోల్ కొట్టించుకున్నాడని, అక్కడి నుంచి నడుచుకుంటూ గ్రామంలోకి చేరుకుని దారుణానికి పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెట్రోల్ బంకులో సీసీ కెమెరా ఫుటేజీను సేకరించి నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు శ్రీనివాస్..  సత్యవతిపై ఆరు రోజుల కిందటే కత్తితో దాడి చేశాడని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పుడు పోలీసులకు సత్యవతి కంప్లైంట్ చేసినా వాళ్లు పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో సత్యవతి ఒక్కతే ఉండేందుకు భయపడి పెద్ద కూతురు దుర్గాభవానీని ఇంటికి పిలిపించుకుందని, ఇంట్లో అందరూ ఉండటం గమనించిన శ్రీనివాస్ దారుణానికి ఒడిగట్టాడని చెప్తున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని బంధువుల ఇళ్లల్లో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Latest Updates