మనకు బంగారు కొండలు దొరికినయ్.. 3,350 టన్నుల గోల్డ్ నిల్వలు

  • సర్కారీ రిజర్వ్స్​తో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ
  • యూపీలోని సోన్​భద్రలో గుర్తించిన జీఎస్​ఐ
  • 20 ఏళ్లుగా అధికారుల పరిశోధనలు
  • మైనింగ్​పై టీమ్​ను ఏర్పాటు చేసిన యూపీ సర్కార్​
  • అన్ని అనుమతులొచ్చాక వేలం పాట

ఇండియాకు బంపర్​ ఆఫర్​ తగిలింది. కొడితే గిడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు, టన్నుల కొద్దీ కనకమహాలక్ష్మి కంటపడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 3,350 టన్నుల బంగారాన్ని నింపుకున్న రెండు కొండలు, రారమ్మని పిలిచాయి. అవును, రెండు దశాబ్దాల వెతుకులాటలో రెండు బంగారు కొండలను జియాలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా (జీఎస్​ఐ), ఉత్తర్​ప్రదేశ్​ డైరెక్టరేట్​ ఆఫ్​ జియాలజీ అండ్​ మైనింగ్​ గుర్తించాయి. ప్రస్తుతం మన సర్కారు దగ్గర ఉన్న బంగారం నిల్వలతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ నిల్వలు ఆ కొండల్లో ఉన్నాయట. ప్రభుత్వం దగ్గర ఇప్పుడు 626 టన్నుల బంగారం ఉంది. ఆ బంగారు కొండల కథేంటో చదివేయండి.

పేర్లోనే కాదు.. ఊర్లోనూ బంగారమే

ఉత్తర్​ప్రదేశ్​లోని రెండో అతిపెద్ద జిల్లా సోన్​భద్ర. దాని పేరులోనే బంగారం ఉంది. ఇప్పుడు పేర్లోనే కాదు, ఊర్లోనూ బంగారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో బంగారు కొండలను కనిపెట్టారు. ఒకటి సోన్​పహాడి, ఇంకోటి హర్ది. సోన్​పహాడిలో 2,700 టన్నులు, హర్ది ఫీల్డ్​లో 650 టన్నుల బంగారం నిక్షేపాలున్నట్టు చెబుతున్నారు. ఆ కొండల్లోని బంగారాన్ని తవ్వి తీసేందుకు మైనింగ్​ లీజుకు ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మైనింగ్​ ఆఫీసర్​ కేకే రాయ్​ చెప్పారు.

టీమ్​ చూసొచ్చింది

బంగారం మైనింగ్​పై ఇప్పటికే యూపీ సర్కార్​ ఏడుగురు సభ్యులతో కూడిన టీమ్​ని ఏర్పాటు చేసింది. ఆ టీమ్​ గురువారం సోన్​భద్రకు వెళ్లి, ఆ బంగారు కొండలను చూసొచ్చింది. బంగారు గనుల ప్రాంతాన్ని మ్యాపింగ్​ చేసి, జియో ట్యాగింగ్​ చేయనుంది. ఆ కొండలున్న భౌగోళిక ప్రాంతం ఆధారంగా బంగారాన్ని తవ్వి తీయడం చాలా ఈజీ అని అధికారులు అంటున్నారు. మొత్తం కొండలే కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన​ అవసరం లేదంటున్నారు. మామూలు గనులైతే లోపలికి తవ్వుకుంటూ పోవాలి కాబట్టి, అది కష్టంతో కూడుకున్నదని, ఇప్పుడు బంగారం నిక్షేపాలున్నవి కొండల్లో కాబట్టి వాటిని తవ్వడం చాలా ఈజీ అని చెబుతున్నారు. కంపెన్సేషన్​ పే అవుట్​, అన్ని అనుమతులు వచ్చాక ప్రభుత్వం బంగారు కొండలను వేలం వేస్తుందని అంటున్నారు.

యురేనియం కూడా

బంగారంతో పాటు ఇతర ఖనిజాలపైనా యూపీ సర్కారు గురిపెట్టింది. ఆ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలపైనా అధికారులు సర్వే చేయబోతున్నారు. బుందేల్​ఖండ్​, వింధ్య జిల్లాల్లో బంగారం, వజ్రాలు, ప్లాటినం, సున్నపురాయి, గ్రానైట్​, ఫాస్ఫేట్​, క్వార్ట్జ్, చైనా క్లే వంటివి ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. బంగారంతో పాటు ఆయా ఖనిజాలనూ తవ్వితే రాష్ట్ర ఖజానాకు ఆదాయం భారీగా వస్తుందని భావిస్తున్నారు. అంతేగాకుండా, యువతకూ ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని మూడు జిల్లాల్లో నక్సలైట్ల ప్రభావం ఉంది. మీర్జాపూర్​, చందౌలీతో పాటు సోన్​భద్ర కూడా ఆ లిస్టులో ఉంది. ‘రెడ్​ కారిడార్’ లిస్టులో ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మైనింగ్​ ఎంత వరకు సాధ్యమవుతుందన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో నక్సలైట్​ ఘటనలు తగ్గినా, ఆ ప్రభావం మైనింగ్​పై పడే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

దేశంలో ఎక్కడెక్కడున్నయ్​?

ప్రస్తుతం దేశంలో నాలుగు చోట్ల బంగారం గనులున్నాయి. అందులో మూడు కర్ణాటకలోనే ఉండడం గమనార్హం. హట్టి చిన్నద గని పెద్దది. కర్ణాటకలోనే గడగ్​, చాంపియన్​ రీఫ్​ గోల్డ్​మైన్​లో బంగారం నిల్వలున్నాయి. చాంపియన్​ రీఫ్​లో భారత్​ గోల్డ్​ మైన్స్​ లిమిటెడ్​, 1900 నుంచి 2001 మధ్య బంగారం మైనింగ్​ చేసింది. నాలుగో గని జార్ఖండ్​లోని లావా గోల్డ్​మైన్స్​. మన్మోహన్​ మినరల్​ ఇండస్ట్రీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ గోల్డ్​ను వెలికి తీస్తోంది.

కోలార్​గోల్డ్​ఫీల్డ్స్​: దీన్నే కేజీఎఫ్​ అనీ పిలుస్తారు. కర్ణాటకలోని కోలార్​ జిల్లాలో ఉంది. 1956లో కోలార్​ గోల్డ్​మైన్స్​ను జాతీయం చేశారు. పర్యావరణ సమస్యలు, తప్పుడు రేటు విధానాలు, కొత్త ఎక్స్​ప్లొరేషన్​కు పెట్టుబడుల సమస్యల వల్ల 2001 ఫిబ్రవరి 28న దానిని మూసేశారు. అప్పటిదాకా దాదాపు 900 టన్నుల బంగారాన్ని
కేజీఎఫ్​ ఇచ్చింది.

హట్టి గోల్డ్​మైన్స్​ కేరాఫ్​ ‘హైదరాబాద్​ సర్కార్’

కర్ణాటకలోని రాయచూర్​ జిల్లాలో ఉందీ గని. ద హట్టి గోల్డ్​మైన్స్​ కంపెనీ లిమిటెడ్​ ఆధ్వర్యంలో గని నడుస్తోంది. నిజానికి 1947లో అది హైదరాబాద్​ గోల్డ్​మైన్స్​ కంపెనీ లిమిటెడ్​గా ఉండేది. నాటి హైదరాబాద్​ నిజాం సర్కార్​కు ఎక్కువ షేర్లుండేవి. 1956లో రాష్ట్రాల పునర్విభజన తర్వాత అది కర్ణాటక అధీనంలోకి (నాటి మైసూర్​ స్టేట్​) వెళ్లిపోయింది. హట్టి గోల్డ్​మైన్స్​గా మారిపోయింది. ఇక, ప్రపంచంలోనే అత్యంత పురాతన మెటల్​ మైన్స్​గా హట్టికి పేరుండేది. అశోకుడి కాలానికన్నా ముందు మైనింగ్​ వర్కర్లు 2,300 అడుగుల లోతులో బంగారాన్ని తవ్వి తీసేవారని చెబుతారు. ఆ గని హైదరాబాద్​ స్టేట్​, మైసూర్​ స్టేట్​ అధీనంలో లేకముందు 1890 నుంచి 1920 వరకూ మైనింగ్​ జరిగిందట. అప్పట్లో బంగారం ధర తులానికి కేవలం 18 రూపాయలేనట. 1902 నుంచి 1919 మధ్య దాదాపు 7.4 టన్నుల బంగారాన్ని వెలికి తీశారు. అయితే, టెక్నికల్​ సమస్యలతో 1920లో గనిని మూసేశారు.

1937లో నిజాం సర్కార్ మళ్లీ మొదలెట్టింది..
మూతపడిన గనులను ఓపెన్ చేసేందుకు నిజాం సర్కార్ 1937లో నిర్ణయించుకుంది. జనానికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం దిశగా అడుగులు వేసింది. అన్ని సర్వేలు అయ్యాక 1940లో అక్కడ రోజూ 100 టన్నుల బంగారం ఖనిజాన్ని వడబోసే ప్లాంట్ పెట్టాలని డిసైడ్ అయ్యింది. ప్లాంట్ పూర్తయినా కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. 1942 నుంచి 1946 మధ్య రెండో ప్రపంచ యుద్ధం వల్ల రెండోసారి దానికి బ్రేక్ పడింది. పంపింగ్ తప్ప మిగతా పనులన్నింటికీ బ్రేక్. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక 1947లో మళ్లీ దానిపై దృష్టిపెట్టింది. 1948 సెప్టెంబర్ లోఅందులో ఆపరేషన్లు మొదలయ్యాయి. రోజూ 130 టన్నుల ముడి ఖనిజాన్ని వెలికి తీసే సామర్థ్యంతో అది మొదలైంది. 1972లో దాని కెపాసిటీ 600 టన్నులకు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఓక్లే రీఫ్​, మిడిల్ రీఫ్​, జోన్ 1 రెడ్ , విలేజ్ రీఫ్​, స్ట్రైక్ రీఫ్​, స్ట్రైక్ రీఫ్​ ఫుట్ బాల్ అనేఆరు ప్రత్యేకమైన రీఫ్​లున్నాయి. ఆయా రీఫ్​లలో గోల్డ్ మైనిం గ్ జరుగుతోంది.

– సెంట్రల్ డెస్క్, వెలుగు

Latest Updates