కార్ల దొంగలు అరెస్ట్ : 23 వాహనాలు సీజ్

two men arrested for stealing cars in Hyderabad

కార్లను ఎత్తుకెళ్లే ఇద్దరు కిలాడీ దొంగలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పనులకు కార్లు కావాలంటూ, కార్ల యజమానుల నుంచి రెంట్ కు తీసుకున్న దొంగలు… ఆ తర్వాత వాటిని వేరే వారికి అమ్ముతూ దొరికిపోయారు. కిలాడీ దొంగలు శ్రీకాంత్ చారి, మహేందర్ సింగ్ లను అదుపులోకి తీసుకున్నారు ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ, మీర్ పేట్ పోలీసులు.

కార్ ను రెంట్ కు తీసుకుని…  మొదటి నెల కింద కిరాయి రూ.30,000 కట్టి.. ఆ తర్వాత నుంచి ఇవ్వడం మానేశారు దొంగలు. ఇలా.. మొత్తం 23 మందిని మోసం చేశారు. తమ అద్దె కోసం కారు యజమానులు ఫోన్ చేసినా నిందితులు మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసేవారని రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.

2017 లో CMO ఆఫీస్ లో టెంపరరీ డ్రైవర్ గా పనిచేసిన శ్రీకాంత్ చారి.. కొంతకాలానికే క్రమశిక్షణా ఉల్లంఘన క్రింద అక్కడ జాబ్ కోల్పోయాడు. ఆ తర్వాత స్నేహితుడు మహేందర్ సింగ్ తో కలసి అక్రమ దందాలు చేస్తూ.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసేవారని పోలీసులు తెలిపారు. నిందితులపై గతంలో బంజారాహిల్స్ , పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదై ఉన్నాయని అన్నారు. నిందితుల నుంచి రూ. 4.7 లక్షల నగదు, 23 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

Latest Updates