కాశ్మీర్​లో మరో ఇద్దరు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: కాశ్మీర్ లో టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలో ఇద్దరు టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుబెట్టాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కొనసాగిన ఆపరేషన్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. పాంపూర్ ప్రాంతంలోని మీజ్‌లో గురువారం ఉదయం చేపట్టిన ఆపరేషన్ లో ఒక టెర్రరిస్టును సెక్యూరిటీ సిబ్బంది మట్టుబెట్టగా ఈ ఉదయం మరో ఇద్దరిని హతమార్చాయని కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.

మీజ్​లో టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న మన సెక్యూరిటీ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా టెర్రరిస్టులు కాల్పులకు దిగారని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో గురువారం ఉదయం ఒక టెర్రరిస్టు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు స్థానిక మసీదులో దాక్కున్నారని, దాంతో రాత్రంగా ఆపరేషన్ కొనసాగిందని చెప్పారు. మతపరమైన ప్రదేశం కావడంతో దాని పవిత్రతను కాపాడేందుకు ఎలాంటి పేలుడ్లు జరపకుండా టియర్ గ్యాస్ మాత్రమే ప్రయోగించామని, దాక్కున్న టెర్రరిస్టులు ఇద్దరినీ మట్టుబెట్టామని తెలిపారు. మరోవైపు షోపియాన్ మునాంద్-బాండ్‌పావా ప్రాంతంలో గురువారం ఉదయం ఒక టెర్రరిస్టు హతమయ్యాడని, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు.

Latest Updates