నీళ్లపేరుతో రెండు రాష్ట్రాల సీఎంలు దోపిడికి పాల్పడుతున్నారు: బండి సంజయ్

కటకం మృత్యుంజయం బీజేపీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన నాకు గురువులాంటివాళ్లన్నారు. తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడే  మృత్యుంజయం సంజయ్ విచార్ మంచ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో డైరెక్టర్ గా తనను పార్టీలకు అతీతంగా కటకం బలపరిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలోపేతం చేయడంలో ఆయన పాత్ర వహించారన్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ప్రతాపరామకృష్ణ తో పాటు మిగతా నేతలు చొరవ తీసుకుని కటకం మృత్యుంజయం పార్టీలో చేరేలా కృషి చేసారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను వివరించేందుకు కటకం మృత్యుంజయం లాంటి వారి గొంతు ఎంతో అవసరం బండి సంజయ్. పెద్దపల్లి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే గొప్ప నాయకుడు వెంకట స్వామి గారు. ఆయన బాటలో వివేక్ పనిచేస్తున్నారని తెలిపారు.

మరోవైపు ఏపీ, తెలంగాణ సీఎంలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. రెండు రాష్ట్రాల సీఎం మాఫీయాలాగా ఒక్కటయ్యారన్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ నీళ్ల పేరుతో దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉద్యోగ నియామకాలు జరగలేదన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్ కు తొత్తులుగా మారి ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారన్నారు. వాళ్ల కుటుంబం కోసమే పదవీ విరమణ పెంపు జీవో తెప్పించారన్నారు. 50 శాతం జీతాలు కట్ చేసినా, ఐఆర్ ఇవ్వకపోయినా కొందరు నేతలు మాట్లాటం లేదన్నారు. మీ స్వలాభం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులు తాకట్టు పెట్టారంటూ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ మద్యం షాపు కోసం జీవోలు తీసిన దగుల్బాజీ సీఎం కేసీఆర్ అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు సంజయ్. ఈయన క్వారంటైన్ ముఖ్యమంత్రి.. ఆరేళ్లుగా ఆయన భయటకే రావడం లేదంటూ ఆరోపించారు. కరీంనగర్ ఐసోలేషన్ లో డాక్టర్లకు సరైన రక్షణ కల్పించాలంటూ రెండు సార్లు వెళ్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశానని తెలిపారు. గాంధీ ఆస్పత్రి సహా అనేక ఆస్పత్రుల్లో పీపీఈ కిట్లు లేక డాక్టర్లు కరోనా భారిన పడుతున్నారన్నారు. టెస్టులు సరిగా లేకపోవడం వల్లే కరోనా కేసులు ఎక్కువవుతున్నాయని ఆరోపించారు.

కొండ పోచమ్మ చెరువు నుంచి ఒక్క ఎకరానికైనైనా నీళ్లిచ్చారా అని ప్రశ్నించారు బండి సంజయ్. వర్షం పడితే పూలు చల్లి కాళేశ్వరం నీళ్ళని చెప్పుకుంటున్నారన్నారు. ఏ భూమిలో ఏ పంట పెడుతుందో రైతులకు మాత్రమే తెలుసునని… కానీ ఫాం హౌస్ ఉన్న సీఎం తాను చెప్పిన పంటలే వేయాలంటున్నాడని చెప్పారు. పంటలకు కలిగే నష్టాలకు పూర్తి భాద్యత తనదేనని సీఎం  హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు.

ప్రశ్నించిన తనతో సహా, మా కార్యకర్తలపై  పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు బండి సంజయ్. త్వరలోనే 100 శాతం కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు. కేసీఆర్ కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమన్న సంజయ్..కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Latest Updates