మనకు రష్యా ‘రక్షణ’

డిఫెన్స్ విషయంలో మనకు ఎన్నో ఏళ్లుగా దన్నుగా నిలుస్తున్న దేశం రష్యా. ఎయిర్​క్రాఫ్టులు, యుద్ధ ట్యాంకులు, భారీ షిప్పులు, మిసైళ్లు, గన్నులు… ఇలా ఎన్నింటినో మనకు విక్రయిస్తోంది. మనతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో చాన్నాళ్లుగా పెండింగ్​లో ఉన్న వార్​షిప్పుల కొనుగోలుకు సంబంధించిన డీల్ ఈ మధ్యే పూర్తయింది. మరోవైపు యుద్ధవిమానాలు కొనుగోలు చేసేందుకూ ఇండియా ఆర్డర్ పెట్టింది. 39 ఎయిర్​క్రాఫ్టులు అమ్మాలని రష్యాను కోరింది.

2016లోనే ఒప్పందం

నాలుగు యుద్ధనౌకల కోసం 2016లో రష్యా, ఇండియా ‘ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్’ కుదుర్చకున్నాయి. గతేడాది నవంబర్​లో కాంట్రాక్టుపై సంతకాలు చేశాయి. ఈ కాంట్రాక్టు కింద రెండు తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ ను రష్యాలోని యాంతర్ షిప్​యార్డులో నిర్మిస్తారు. రెండు షిప్పుల కోసం ఇండియా కుదుర్చుకున్న ఈ డీల్ విలువ 2.5 బిలియన్ అమెరికా డాలర్లు (సుమారు రూ.19,229 కోట్లు). తర్వాత మరో రెండు షిప్పులను గోవా షిప్​యార్డ్ లో రష్యా ఎక్స్​పర్టుల సాంకేతిక సాయంతో నిర్మిస్తారు. యాంతర్ షిప్​యార్డులో నిర్మించిన షిప్పుల్లో ఇప్పటికే మూడు షిప్పులు ఇండియన్ నేవీలో సేవలందిస్తున్నాయి. ‘‘2022 నాటికల్లా రెండు షిప్పుల్లో ఒకదాన్ని ఇండియన్ నేవీకి అందజేయనున్నాం. తర్వాతి ఆరు నెలలకు మరొకటి కూడా ఇస్తాం” అని యాంతర్ షిప్​యార్డ్ జనరల్ డైరెక్టర్ ఎడ్వర్డ్ ఎఫిమోవ్ చెప్పారు. ఒప్పందానికి సంబంధించిన తొలి పేమెంట్ జులై చివరికల్లా పూర్తవుతుందని ఎఫిమోవ్ చెప్పారు. ఈ షిప్పుల్లో 22 కొత్త సిస్టమ్స్ ఉంటాయి. నేవిగేషన్, కమ్యూనికేషన్, వెపన్స్ వంటి అత్యాధునిక వ్యవస్థ ఉంటుంది.

18 సుఖోయ్.. 21 మిగ్ ఎయిర్​క్రాఫ్టులు

ఓవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్​ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గగనతలాన్ని మరింత సురక్షితంగా ఉంచుకునేందుకు ఇండియన్ ఎయిర్​ఫోర్స్  మరిన్ని యుద్ధవిమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ‘సుఖోయ్ 30ఎంకేఐ’ మోడల్ కు చెందిన 18 విమానాలు, ‘మికొయాన్ మిగ్ 29’ మోడల్​కు చెందిన 21 జెట్లను తమకు అమ్మాలని రష్యాను ఇండియా కోరింది. ఈ విషయాన్ని రష్యా ఫెడర్ సర్వీస్ ఫర్ మిలటరీ టెక్నికల్ కో ఆపరేషన్ (ఎఫ్ఎస్ఎంటీసీ) డిప్యూటీ డైరెక్టర్ వ్లాదిమిర్ డ్రోఝోవ్ చెప్పారు. మిగ్ ఎయిర్​క్రాఫ్ట్​లను అక్కడే అసెంబుల్ చేసి తీసుకురానున్నారు. సుఖోయ్​జెట్లు మాత్రం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంస్థ ఇండియాలోనే అసెంబుల్ చేస్తుంది. మహారాష్ట్రలోని ఓఝర్ ప్లాంట్​లో రెడీ చేస్తారు. సుఖోయ్ ఎయిర్​క్రాఫ్టులను 2002 నుంచి ఇండియాలో అసెంబుల్ చేస్తున్నారు. సుమారు 450 ‘టీ90’ యుద్ధ ట్యాంకులను కూడా ఆధునీకరించాలని తమకు రిక్వెస్టులు వచ్చాయని డ్రోఝోవ్ చెప్పారు. ఈ ప్రతిపాదనపై ఎఫ్ఎస్ఎంటీసీ పని చేస్తోందని చెప్పారు.

Latest Updates