ఒకరిని కాపాడి… ఇద్దరు చనిపోయారు

కృష్ణాలో మునిగిపోయిన ఇద్దరు యువకులు

మక్తల్/మాగనూరు, వెలుగు: నీటిలో మునిగిపోతున్న అమ్మాయిని వారిద్దరు కాపాడారు. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో వారిద్దరు నదిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో ఆదివారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందినవారు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లో బంధువుల వివాహానికి రెండు రోజుల క్రితం హాజరయ్యారు. అక్కడి నుంచి మక్తల్​ నియోజకవర్గం కృష్ణా మండలం వాసునగర్ లో ఉన్న బంధువు దుర్గరాజు దగ్గరకు వచ్చారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇద్దరు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు సరదాగా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. నదిలో స్నానం చేస్తుండగా ఓ అమ్మాయి కాలు జారి నీటిలో మునిగిపోతుండడంతో ఆమెను రక్షించేందుకు రామకృష్ణ రాజు(27),  శ్రీహరి రాజు(24) నదిలోకి దిగారు. ఆమెను నది ఒడ్డుకు లాగారు. అయితే అక్కడ లోతు ఎక్కువ ఉండడంతో వీరిద్దరు మునిగిపోయారు. మక్తల్​ సీఐ శంకర్ ​గజ ఈతగాళ్లతో మృతదేహాలను బయటకు తీయించారు. రామకృష్ణరాజు పాలకొల్లులో హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శ్రీహరి రాజు హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు.

Latest Updates