ఏడాదిన్నరగా మార్చురీలోనే కరోనా డెడ్ బాడీలు!

ఏడాదిన్నరగా మార్చురీలోనే కరోనా డెడ్ బాడీలు!

బెంగళూరు: కరోనాతో చనిపోవడంతో డెడ్​బాడీని అప్పగించలే.. అంత్యక్రియలు మేమే చేస్తమని చెప్పి చివరిసారి డెడ్​బాడీని చూపించి, పంపేసిన్రు. రోజూ వార్తలల్ల చూస్తూనే ఉన్నరు కాబట్టి మృతుడి బంధువులూ మాట్లాడలే. ఆస్పత్రి వర్గాలే దహనం చేసిన్రని అనుకున్నరు. దాదాపు ఏడాదిన్నర గడిచింది. ఇప్పుడిప్పుడే ఆ బాధనుంచి తేరుకుంటున్న వాళ్లకు ఆస్పత్రి వర్గాలు గుండె పగిలే వార్త చెప్పాయి. కిందటేడాది చనిపోయిన వాళ్ల బంధువు డెడ్​బాడీ ఇప్పటికీ మార్చురీలోనే ఉందని సమాచారం అందించాయి. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర ఆవేదనను నింపింది.

ఏం జరిగిందంటే..
బెంగళూరుకు చెందిన దుర్గా సుమిత్ర(40), మునిరాజు(50) కిందటేడాది జులై 2న కరోనాతో చనిపోయారు. ఫస్ట్​వేవ్​ తీవ్రత తగ్గినా మరోసారి కేసులు పెరుగుతూ రెండో వేవ్​ వస్తుందని జనం ఆందోళన చెందుతున్న టైమది. సిటీలోని రాజాజీనగర్ ​మోడల్​ హాస్పిటల్​లో మునిరాజు, ఈఎస్ఐ ఆస్పత్రిలో  సుమిత్ర చనిపోయారు. కరోనా మరణం కాబట్టి డెడ్​బాడీని అప్పగించలేమని డాక్టర్లు చెప్పారు. వైరస్​ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అంత్యక్రియల వ్యవహారం తామే చూసుకుంటామని అన్నారు. చేసేదేంలేక సుమిత్ర, మునిరాజు కుటుంబ సభ్యులు డెడ్​బాడీలను చివరిసారి చూసి, తుది వీడ్కోలు పలికారు. ఇంటికి వెళ్లాక శాస్త్రప్రకారం మిగతా విధులు నిర్వహించారు. రోజులు, నెలలు గడిచి, ఏడాది పూర్తైంది. సుమారు ఏడాదిన్నర అయినంక ఇప్పడు సుమిత్ర, మునిరాజు డెడ్​బాడీలు ఇంకా మార్చురీలోనే ఉన్నాయని వాళ్ల కుటుంబ సభ్యులకు ఫోన్​ వచ్చింది. దీంతో షాక్​ అయిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి పరుగులు పెట్టారు. మార్చురీలో కుళ్లిన స్థితిలో తమ వాళ్ల డెడ్​బాడీలను చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

ఎట్లా గుర్తించిన్రు..
మార్చురీని క్లీన్​ చేసేటపుడు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న డెడ్​ బాడీలను హౌస్​కీపింగ్​ స్టాఫ్​ గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వాళ్లు అలర్ట్​ అయ్యారు. డెడ్​బాడీలను పరిశీలించి, అవి సుమిత్ర, మునిరాజులకు చెందినవని నిర్ధారించారు. కిందటేడాది నుంచి అవి అక్కడే ఉండిపోవడానికి కారణమేంటనేది గుర్తించేందుకు విచారణకు ఆదేశించామని, నిర్లక్ష్యం ప్రదర్శించిన సిబ్బందిని సస్పెండ్​ చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. మృతదేహాలకు పోస్ట్​మార్టం చేసి, లీగల్​ ఫార్మాలిటీలు పూర్తిచేసి బంధువులకు 
అప్పగిస్తామని చెప్పారు.