మెరికల్లాంటోళ్లకే వీసా..కొత్త రూల్స్ తీసుకొచ్చిన బ్రిటన్

ఎగ్జామ్​లో మంచి మార్కులొస్తే ఆడు తోపురా బై అంటం. ఎన్ని మార్కులొస్తే అంత గొప్పోడంటం. ఇప్పుడు బ్రిటన్​ అలాంటి తోపులకే తొవ్వ ఓపెన్​ చేసింది. మంచి ‘పాయింట్లు’ తెచ్చుకుంటే తప్ప వీసా ఇయ్యం అంటోంది. అవును, స్కిల్​ ఉన్నోళ్లకు బాటలు పరుస్తూ, లేనోళ్లకు గేట్లు మూసేస్తూ కొత్త వీసా విధానాన్ని తీసుకొచ్చింది ఆ దేశం. ఆస్ట్రేలియాలాగే పాయింట్లను బట్టి వీసానిచ్చే కొత్త పద్ధతికి బ్రిటన్​ ఓకే స్టాంప్​ ఏసేసింది. బుధవారం భారత సంతతికి చెందిన బ్రిటన్​ హోం మంత్రి ప్రీతి పటేల్​ ఆ సరికొత్త వీసా విధానాన్ని ప్రారంభించారు. వచ్చే ఏడాది, అంటే 2021 జనవరి 1 నుంచి ఈ కొత్త పాయింట్స్​ బేస్డ్​ వీసా విధానం అమల్లోకి రాబోతోంది.

70 పాయింట్లు

ఎన్నికల టైంలో బోరిస్​ జాన్సన్​ పార్టీ ప్రత్యేకంగా ఈ పాయింట్స్​ బేస్డ్​ ఇమిగ్రేషన్​ సిస్టమ్​పైనే హామీలిచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంది. ఈ కొత్త పద్ధతిలో బ్రిటన్​లో కొలువు చేయాలనుకునేటోళ్లు 70 పాయింట్లు సాధించాలి. ఇంగ్లీష్​ బాగా మాట్లాడడం, డిగ్రీ పట్టా, జాబ్​ ఆఫర్​, కంపెనీ ఇచ్చే జీతం, కొరత ఉన్న రంగాల్లో జాబ్స్​ వంటి వాటికి పాయింట్స్​ ఇస్తారు. ఇప్పటిదాకా టయర్​ 2 స్కీమ్​ కింద స్కిల్డ్​ వర్కర్లకు డిగ్రీ, ఏడాది జీతం 30 వేల పౌండ్లుగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ జీతాన్ని 25,600 పౌండ్లకు తగ్గించింది బోరిస్​ సర్కార్​. వాటి ఆధారంగానే బ్రిటన్​లో జాబ్​ చేయాలనుకునేవాళ్లకు పాయింట్లు కేటాయిస్తారు. ఉదాహరణకు ఓ యూనివర్సిటీ రీసెర్చర్​ పోస్టుకు అప్లై చేశారనుకుందాం. అందులో జాబ్​ ఆఫర్​కు 20 పాయింట్లు, స్కిల్​ లెవెల్​కు 20, ఇంగ్లీష్​ స్పీకింగ్​కు 10, సంబంధిత స్టెమ్​ (సైన్స్​, టెక్నాలజీ, ఇంజనీరింగ్​, మెడిసిన్​) కోర్సు పీహెచ్​డీకి 20 పాయింట్లు, జీతానికి 0 పాయింట్లు (25,600 వేల పౌండ్ల కన్నా తక్కువుంటే).. మొత్తంగా 70 పాయింట్లు కేటాయిస్తారు. ఆ పాయింట్లను బట్టి వీసా ఇస్తారు. అయితే, ఉద్యోగాల కొరత ఉన్న రంగంలో జాబ్​ కావాలంటే కనీస జీతం 20,480 పౌండ్లుండాలని రూల్​ పెట్టారు. ఇక, ఇప్పటిదాకా ఇన్ని వీసాలు మాత్రమే ఇస్తామంటూ బ్రిటన్​ ఓ పరిమితి పెట్టింది. ఆ పరిమితిని ఇప్పుడు బ్రిటన్​ సర్కార్​ ఎత్తేసింది.  స్కిల్డ్​ లేబర్​ను వీలైనంత ఎక్కువమందిని తీసుకునేందుకు అది ఉపయోగపడుతుంది. స్టూడెంట్​ వీసాకూ సేమ్​ రూల్స్​ వర్తిస్తాయని బ్రిటన్​ హోం శాఖ పేర్కొంది. సీటు వచ్చినట్టు కాలేజీ నుంచి ఆఫర్​ లెటర్​, ఆర్థిక స్థోమత, ఇంగ్లీష్​ మాట్లాడే నేర్పు వంటి వాటి ఆధారంగా పాయింట్లు కేటాయించనుంది.

ఈయూ వాళ్లకూ ‘ఫ్రీ రోడ్​’ బంద్​

మొన్నటిదాకా బ్రిటన్​ యూరోపియన్​ యూనియన్​ (ఈయూ)లో భాగంగా ఉండేది. జనవరి 31 నుంచి ఆ బంధానికి బైబై చెప్పేసి వేరు కాపురం పెట్టేసింది. దీంతో ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త విధానం ఈయూలోని మిగతా దేశాలకూ వర్తించనుంది. ప్రస్తుతమున్న ఈయూ వర్క్​ఫోర్స్​లో 70 శాతం మందికి తగిన అర్హతలు లేవని బ్రిటన్​ హోం మంత్రి ప్రీతి పటేల్​ చెప్పారు. ఈ కొత్త విధానంతో భవిష్యత్తులో అది భారీగా తగ్గుతుందని ఆమె అన్నారు. ఈయూ, నాన్​ఈయూ దేశాలన్నింటినీ సమానంగా చూసేందుకే ఈ కొత్త వలస రూల్స్​ తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్​ 31 తర్వాత ఈయూలోని దేశాలన్నీ కూడా కొత్త వీసా రూల్స్​ను పాటించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఆ దేశాలకు చెందిన వాళ్లు బ్రిటన్​ రావాలంటే వీసా అవసరం ఉండేది కాదు. దాని వల్ల స్కిల్​ లేనోళ్లూ ఎక్కువగా బ్రిటన్​లో జాబ్స్​ పొందుతున్నారన్న ఆరోపణ ఉండేది. ఈ కొత్త విధానంతో దానికి చెక్​ పెట్టొచ్చని ప్రీతి పటేల్​ చెబుతున్నారు. గత శుక్రవారం నుంచి అమలవుతున్న గ్లోబల్​ ట్యాలెంట్​ స్కీమ్​కూడా ఈయూ దేశాలకు వర్తిస్తుందన్నారు.

మరి, చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్లూ..

అయితే, ఈయూ నుంచి చిన్న చిన్న పనులు చేసుకునేందుకు చాలా మంది లో స్కిల్డ్​ లేబర్​ వస్తుంటారు. అలాంటోళ్ల వీసాలకు కత్తెర వేసింది బ్రిటన్​ సర్కారు. రైతు కూలీలు, కేటరింగ్​, నర్సింగ్​ వంటి రంగాల్లో సిబ్బందిని నియమించుకోవడం కొత్త వీసా విధానంతో కష్టం కానుంది. అయితే, బ్రిటన్​ సర్కారు మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఇప్పటికే ఈయూకు చెందిన 32 లక్షల మంది బ్రిటన్​లో ఉండేందుకు దరఖాస్తు చేసుకున్నారని, లేబర్​ డిమాండ్స్​కు తగ్గట్టు వాళ్లు సరిపోతారని చెబుతోంది. అంతేగాకుండా సీజనల్​ వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇప్పటిదాకా ఉన్న 2,500 లిమిట్​ను 10 వేలకు పెంచినట్టు చెప్పింది. 20 వేల మంది యంగ్​స్టర్స్​ దేశానికి వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపింది. లో స్కిల్డ్​ లేబర్​కు సంబంధించి కార్పెంట్రీ, ప్లాస్టరింగ్​, చైల్డ్​మైనింగ్​ వంటి రంగాలను  కొత్తగా చేర్చింది.

మనోళ్లకు వరమే

ఈ కొత్త వీసా విధానంతో ఎక్కువగా లాభపడేది ఇండియన్లేనని నిపుణులు చెబుతున్నారు. శాలరీ లిమిట్​ను తగ్గించడం వల్ల కచ్చితంగా ఇండియన్లు లాభపడతారని ఈపీజీ మేనేజింగ్​ డైరెక్టర్​ ప్రతీక్​దత్తానీ చెప్పారు. స్కిల్​ ఉన్న ఇండియన్లకు ఇది వరంగా మారుతుందన్నారు. ఇప్పటిదాకా వొకేషనల్​ స్కిల్స్​కు సంబంధించి బ్రిటన్​ ఈస్టర్న్​ యూరోపియన్లపైనే ఆధారపడిందని, ఇప్పుడు కొత్త సిస్టమ్​తో దానికి తెరపడుతుందని చెబుతున్నారు. బ్రిటన్​లో చదివే స్టూడెంట్లకు ఈ శాలరీ లిమిట్​ వరం అని, వర్క్​ వీసాకు అప్లై చేసుకునేటప్పుడు అది బాగా పనికొస్తుందని ఇండియన్​ నేషనల్​ స్టూడెంట్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ అమిత్​ తివారీ చెప్పారు. ప్రస్తుతం దాదాపు 14 లక్షల మంది ఇండియన్లు బ్రిటన్​లో ఉంటున్నారు. ఈ కొత్త విధానాలతో అక్కడికి మనోళ్ల తాకిడి పెరిగే అవకాశాలూ ఉన్నాయి.

Latest Updates