దిగుతవా.. బట్టలు చించనా?

మహిళల పట్ల క్యాబ్​డ్రైవర్ల దురుసు ప్రవర్తనకు సంబంధించి మరో సంఘటన వెలుగుచూసింది. బెంగళూరులో ఓ మహిళతో ఊబెర్​క్యాబ్ ​డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయంపై ఫిర్యాదు చేసినా ఊబెర్​ కస్టమర్​ కేర్​ సర్వీస్ ​నుంచి సరైన స్పందన లేకపోవడంతో సోషల్​మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అపర్ణ బాలచందర్ ​అనే ఆ మహిళ తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆమె శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఊబెర్ ​క్యాబ్ ​బుక్ ​చేసుకుంది. ఆమె ఎక్కాక అప్పటికే డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూ మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నాడు. కొద్దిసేపటికి సడెన్​గా అపర్ణ వైపు తిరిగి, ‘మీరు చదువుకున్న వాళ్లే కదా. 7కి ముందే ఇంటికి వెళ్లాలని తెలియదా? కొలీగ్స్​తో కలిసి మందు కొట్టేందుకు ఎందుకు వెళతారు?’ అని ప్రశ్నించాడు. దీంతో షాక్​అయిన ఆమె ‘నేనేమీ తాగలేదు. అయినా నా గురించి నీకెందుకు?’ అనడంతో అతడు తిట్టడం మొదలుపెట్టాడు. భయపడిపోయిన ఆమె ఊబెర్​సేఫ్టీ బటన్​నొక్కింది. అయితే, ఊబెర్ ​కస్టమర్ ​కేర్​నుంచి ఆమెకు కాకుండా డ్రైవర్​కు కాల్​వచ్చింది. ఆమె చాలా ఎక్కువగా తాగిందని అతడు చెప్పాడు. ఆమె అరిచి తనకు భయమేస్తోందని, హెల్ప్​కావాలని కోరగా, క్యాబ్​నుంచి దిగాలని వెంటనే మరో క్యాబ్ ​పంపిస్తామని చెప్పారు. అప్పటికే డ్రైవర్​.. ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. క్యాబ్​ దిగుతవా.. లేదా బట్టలు చించేయమంటావా అంటూ అరిచాడు. రాత్రి 11.15 గంటలకు పెద్దగా మనుషులు లేని నడిరోడ్డుపై దిగాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. తర్వాత ఊబెర్ ​నుంచి తనకు కాల్ ​రాలేదని, మరో క్యాబ్​ కూడా పంపలేదని చెప్పారు. ఫ్రెండ్ ​సాయంతో ఇంటికి చేరుకున్నానని, కానీ ఆ డ్రైవర్ ​వల్ల చాలా భయపడిపోయానని వెల్లడించింది.

Latest Updates