ఊబర్​ @ 2,585 కోట్లు!

ఒక గ్రేట్ ఐడియా ఎంత విలువ చేస్తుందంటారు? ఊబర్​ కంపెనీ విషయంలో అయితే అక్షరాలా 2,585 కోట్ల రూపాయలు! ఈ సొత్తంతా ఊబర్ సృష్టికర్త గారెట్ క్యాంప్ సొంతం. తొలిసారిగా ఊబర్​ను శుక్రవారం ఆయన ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు పెట్టారు. ఫేస్ బుక్ తర్వాత అమెరికాలో ఐపీఓకు వచ్చిన అతి పెద్ద కంపెనీ ఇదే. దీని ద్వారా కంపెనీ 52 వేల కోట్ల రూపాయలు సేకరిస్తుందని అంచనా. ఊబర్​ను పెట్టకముందు క్యాంప్ ఓ ఇంటర్నెట్ మిలియనీర్. ఊబర్ ఐపీవోలో లాభపడే మరో వ్యక్తి ట్రావిస్ కలానిక్. ఈయన ఊబర్ సహవ్యవస్థాపకుడు.

‘ఊబర్’ ఐడియా 2008లో వచ్చిందని క్యాంప్ తన ఇంటర్వ్యూల్లో పలుమార్లు చెప్పారు. ఆ టైంలో ఆయన ఫేమస్ వెబ్ సైట్ ‘స్టంబుల్ అపాన్’ను నడుపుతున్నారు. దీని సహవ్యవస్థాపకుల్లో క్యాంప్ కూడా ఒకరు. ఊబర్ ప్రొటోటైప్స్, యాప్ తయారీపై దాదాపు రెండేళ్ల పాటు ఫోకస్ చేశారు. ఆ తర్వాత గ్రేట్ ఆఫర్స్ టెక్నిక్ తో మార్కెట్లోకి దిగారు. ప్రస్తుతం ప్రపంచంలోని 63 దేశాల్లో ఊబర్ ఏటా 77 వేల కోట్ల రూపాయల రెవెన్యూ సాధిస్తోంది. ఊబర్ ఇంత ఎత్తుకు ఎదగడం వెనుక కలానిక్ పాత్ర చాలా ఉందని క్యాంప్ తెలిపారు.

అయితే, కంపెనీ కొన్ని లీగల్ చిక్కుల్లో ఇరుక్కోవడానికి కూడా కలానికే కారణమయ్యారు. దీంతో ఆయన్ను సీఈవో పదవి నుంచి తొలగించారు.‘‘క్యాంప్​ నాలుగైదు క్యాబ్ సర్వీసులకు ఫోన్ చేసి, ఫస్ట్ వచ్చిన కారు ఎక్కి వెళ్లిపోయేవాడు. ఇలా ఎన్నో సార్లు చేశాడు. ఆ తర్వాత క్యాబ్ సర్వీసులు క్యాంప్ నంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టేశాయి. దీంతో బ్లాక్ కలర్ తో ఓ కార్ల సర్వీసును స్టార్ట్ చేయాలని భావించాడు. ఇదే ఉబర్ ఆలోచన వెనుకున్న అసలు స్టోరీ. క్యాంప్ ఒక ఐడియాల మిషన్” అని ఆయన ఫ్రెండ్ టిమ్ ఫెర్రిస్ చెప్పారు.

Latest Updates