ఇక ఉబర్ కరెంట్ క్యాబ్స్

క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబర్‌ ఇక నుంచి హైదరాబాద్‌ లో ఎలక్ట్రిక్‌‌ కార్లను నడపనుంది. ఇందుకోసం 50 ఎలక్ట్రిక్‌‌ వాహనాలను (ఈవీలు)మహీంద్రా అండ్‌ మహీంద్రా నుంచి కొన్నది. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో  తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి  జయేశ్‌ రంజన్‌వీటిని ప్రారంభించారు. ఈ వాహనాల్లో మహీంద్రా ఈ2ఓ ప్లస్‌‌ హ్యాచ్​బ్యాక్‌‌, ఈవెరిటో సెడాన్‌ మోడల్స్‌ఉన్నా యి. చార్జింగ్‌ కోసం నగరవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మహీంద్రా ఎలక్ట్రిక్‌‌  సీఈఓ మహేశ్‌ బాబు మాట్లాడుతూ ఎలక్ట్రిక్‌‌ వాహనాల తయారీకి అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఈవీలను బాగా ప్రోత్సహిస్తోందని ప్రశంసించారు. త్వరలో ఉబర్‌ కు మరిన్ని ఈవీలను అందజేస్తామని వెల్లడించారు. ఈ వాహనాల బ్యాటరీలను ఒక్కసారి చార్జ్‌‌ చేస్తే 150 కిలోమీటర్ల దాకా మైలేజీ ఇస్తాయని చెప్పారు. చార్జింగ్‌ చేయడానికి 20నిమిషాలు పడుతుందని తెలిపారు. ఉబర్‌ ఉన్నతాధికారి దీపాంకర్‌ తివారీ మాట్లాడుతూ ఈవీల సంఖ్యను పెంచితే కాలుష్య రహిత ప్రయాణం అందుబాటులోవస్తుందని తెలిపారు.

మెట్రో స్టేషన్లలో చార్జింగ్‌ పాయింట్లు
జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఈవీలను ప్రోత్సహిస్తోందని, ఇందుకోసం మౌలిక వసతులను పెంచుతోందని చెప్పారు. ఎన్నికల కోడ్‌ ను ఎత్తివేసిన తరువాత కరెంటు వాహనాల వినియోగాన్ని పెంచడానికి ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.

Latest Updates