ఉద్ధవ్ థాక్రేకు లైన్ క్లియర్

  • ఈ నెల 21న మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు
  • కాంగ్రెస్ నుంచి ఇద్దరు క్యాండేట్ల నామినేషన్​తో శివసేనలో టెన్షన్
  • ఒకరు ఉపసంహరించుకోవడంతో థాక్రేకు రిలీఫ్

ముంబై: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో ఈ నెల 21 న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శివసేన మిత్రపక్షమైన కాంగ్రెస్.. ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్ నుంచి రాజేశ్ రాథోడ్, రాజ్‌కిశోర్ మోడీ నామినేషన్లు దాఖలు చేయడంతో శివసేనలో టెన్షన్ నెలకొంది. అయితే.. తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు పీసీసీ చీఫ్​ బాలాసాహేబ్ థోరట్ ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాజ్ కిశోర్ మోడీ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో ఉద్ధవ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. మొత్తం 9 స్థానాలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత కాంగ్రెస్ ఇద్దరు పేర్లను ప్రకటించడంతో పోటీ తప్పదని అంతా భావించారు. కానీ, ఈ నిర్ణయాన్ని మార్చుకుని కాంగ్రెస్ ఒక్కరినే బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించడంతో థాక్రే ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

2019 నవంబర్ 28 న మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన థాక్రే ఏ సభలోనూ సభ్యుడు కాదు. రాజ్యాంగం ప్రకారం, ఆయన సీఎం పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోపు శాసన సభకు లేదా శాసన మండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన థాక్రే ఈ నెల 28 లోగా ఏదో ఒక సభలో సభ్యత్వం పొందకపోతే రాజీనామా చేయాల్సి వస్తుంది.

Latest Updates