కశ్మీర్ వెళ్తున్నాం.. వాస్తవ పరిస్థితి తెలుసుకుంటాం: యూకే ఎంపీ

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటు సభ్యుల బృందం భారత్ వచ్చింది. ఈ బృందం మంగళవారం కశ్మీర్ పర్యటనకు వెళ్తోంది. జమ్ము కశ్మీర్ గవర్నర్ తో పాటు, అధికారులతో భేటీ అవుతారు. అలాగే స్థానిక ప్రజలతోనూ మాట్లాడుతారు.

ఇవాళ ఉదయం ప్రధాని మోడీతో 28 మంది సభ్యులు భేటీ అయ్యారు. వీరికి ఆర్టికల్ 370 రద్దు, దాని అవసరం, ఆ తర్వాత అక్కడి పరిస్థితులపై మోడీ వివరించారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదని, దాన్ని ప్రోత్సాహించే దేశాలకు తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

మోడీ వివరంగా చెప్పారు.. రేపు నేరుగా కశ్మీర్ ప్రజలతో మాట్లాడుతాం: న్యూటన్

మోడీతో భేటీ తర్వాత ఈయూ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ పర్యటనపై వారిని ప్రశ్నించగా.. అవును, రేపు కశ్మీర్ వెళ్తున్నామని యూకే ఎంపీ బిల్ న్యూటన్ డన్ చెప్పారు. ప్రధాని మోడీ కశ్మీర్ లో పరిస్థితులపై తమకు వివరించారని చెప్పారు. అయితే తాము నేరుగా అక్కడి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని అనుకుంటున్నామని న్యూటన్ అన్నారు. రేపు కశ్మీర్ ప్రజలతో మాట్లాడుతామని చెప్పారు. అక్కడ సాధారణ పరిస్థితులు, శాంతి నెలకొనాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు న్యూటన్.

Latest Updates