అల్ట్రాటెక్ సిమెంట్​ లాభం రూ.1,666 కోట్లు

అల్ట్రాటెక్ సిమెంట్​ లాభం రూ.1,666 కోట్లు
  • మొత్తం ఆదాయం రూ.18,562 కోట్లు
  • షేరుకు రూ.38 చొప్పున డివిడెండ్​

న్యూఢిల్లీ: అల్ట్రాటెక్ సిమెంట్​కు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో నికర లాభం (కన్సాలిడేటెడ్ ) 36 శాతం తగ్గి రూ.1,666 కోట్లకు చేరుకుంది. కిందటి ఏడాది ఇదే  కాలంలో రూ.2,620 కోట్ల లాభం వచ్చింది.  2023 మార్చి తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి  రూ. 10  ఫేస్ ​వాల్యూ గల ఈక్విటీ షేరుకు రూ. 38 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బోర్డు సిఫార్సు చేసింది. ఈ కంపెనీకి  కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.15,767 కోట్ల నుంచి18 శాతం పెరిగి రూ.18,562 కోట్లకు చేరుకుంది. ఈ క్వార్టర్​లో ఇబిటా రూ. 3,444 కోట్లుగా ఉంది. ఇది కిందటి సంవత్సరం క్యూ4తో పోలిస్తే 9శాతం పెరిగింది. అమ్మకాల సైజు 31.7 మిలియన్ టన్నులు ఉంది. ఇది వార్షికంగా 14 శాతం, సీక్వెన్షియల్​గా 22శాతం పెరిగింది.  

దేశీయంగా అమ్మకాలు 15 శాతం పెరిగి 30.5 మిలియన్​ టన్నులకు చేరాయి. ఆపరేషనల్ ఇబిటా డిసెంబరు క్వార్టర్​లో మిలియన్​ టన్నులకు రూ. 900 నుంచి రూ. 1,060 కి పెరిగింది.  గ్రే సిమెంట్ తయారీ 15శాతం పెరిగి 29.9 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఎగుమతులు మాత్రం 2 శాతం తగ్గి 1.3 మిలియన్​ టన్నులకు చేరాయి.  వైట్ సిమెంట్ వాల్యూమ్‌‌‌‌‌‌‌‌‌‌లు 0.5 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి.  ఈ మార్చి క్వార్టర్​లో సిమెంట్ తయారీ సామర్థ్యం 5.6 ఎంటీపీఏలకు చేరింది. భారతదేశంలో కంపెనీ గ్రే సిమెంట్ సామర్థ్యాన్ని 126.95 ఎంటీపీఏకి తీసుకువెళ్లింది. కంపెనీ  రెడీమిక్స్ కాంక్రీట్ (ఆర్​ఎంసీ) నెట్‌‌‌‌వర్క్ 100 కంటే ఎక్కువ నగరాల్లో విస్తరించింది. ప్లాంట్ల సంఖ్య 231కి పెరిగింది. అల్ట్రాటెక్ షేర్లు మంగళవారం 0.52శాతం లాభంతో రూ.7,540 వద్ద ముగిశాయి.