మసూద్ అజార్ గ్లోబల్ టెర్రరిస్టు

UN designates JeM chief Masood Azhar as global terrorist
  • ఐక్యరాజ్య సమితి ప్రకటన
  • ఫలించిన ఇండియా పదేళ్ల పోరాటం
  • ఒత్తిళ్లకు తలొగ్గిన చైనా.

యునైటెడ్​ నేషన్స్: పఠాన్​కోట్, పుల్వామా టెర్రర్​ దాడుల సూత్రదారి, జైషే మహ్మద్​ చీఫ్​ మౌలానా మసూద్​ అజార్​ను ‘గ్లోబల్​ టెర్రరిస్టు’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. పదేళ్లుగా ఇండియా చేస్తున్న పోరాటం ఫలించింది. దీనికి మొదటి నుంచి అడుగడుగునా అడ్డుతగులుతూ వస్తున్న చైనా.. ఎట్టకేలకు తలవంచి, తన నిర్ణయాన్ని మార్చుకుంది.  ఐక్యరాజ్యసమితి తీర్మానానికి మద్దతు తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తున్న తీర్మానానికి ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్​ బుధవారం ఆమోద ముద్రవేసింది. ఇక నుంచి మసూద్​ అజార్​ను గ్లోబల్​ టెర్రరిస్టుగా గుర్తించాల్సి ఉంటుందని ప్రకటించింది.

పదేళ్ల ఇండియా పోరాటం

టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న మసూద్​ అజార్​ను గ్లోబల్​ టెర్రరిస్టుగా ప్రకటించాలన్న ప్రతిపాదన ఐక్యరాజ్యసమితిలో 10 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. 2009లో ఇండియానే ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ   ముందుకు సాగలేదు.  2016లో మళ్లీ ఇండియానే ఈ అంశాన్ని లేవనెత్తింది. 1999లో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్​ ఆమోదించిన 1267 తీర్మానాన్ని  అనుసరించి అజార్​పై చర్యలు తీసుకోవాలని పట్టుపడుతూ వచ్చింది. అజార్​ విషయంలో ఇండియాకు అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​, రష్యా మద్దతిస్తున్నప్పటికీ చైనా మాత్రం అడ్డుపుల్లలు వేస్తూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన టెర్రర్​ అటాక్​తో ఇండియా తన స్వరాన్ని మరింత పెంచడంతో  చైనా తీరులో మార్పు వచ్చింది. ‘‘టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నందుకు మసూద్ అజార్‌ను గ్లోబల్​ టెర్రరిస్టుగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్​ నిర్ణయం తీసుకుంది. 2009 నుంచి ఇండియా దీని కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవల కూడా మరింత ఒత్తిడి తెచ్చింది. ఇండియాకు సంబంధించి ఇది పెద్ద విజయం. సహకరించిన దేశాలకు కృతజ్ఞతలు’’ అని ఐరాసలోని ఇండియా ప్రతినిధి సయీద్​ అక్బరుద్దీన్​ అన్నారు. అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్‌తో పాటు ఎన్నో ఇతర దేశాలు కూడా ఎలాంటి షరతులూ లేకుండా తీర్మానానికి మద్దతు పలికాయని ఆయన తెలిపారు.

ఇన్నాళ్లూ పాక్​కు అంటకాగిన చైనా

జైషే మహ్మద్​ సంస్థ చీఫ్​ మసూద్​ అజార్​ను గ్లోబల్​ టెర్రరిస్టుగా ప్రకటించాలన్న ఇండియా ప్రతిపాదనకు ప్రతిసారి చైనా అడ్డుపడుతూనే వచ్చింది. సాంకేతిక కారణాలు చెప్తూ ప్రతిపాదనను ముందుకు పోనివ్వలేదు.  సంప్రదింపులతోనే సమస్య పరిష్కారమవుతుందని  వాదిస్తూ వచ్చింది. తన మిత్ర దేశం పాకిస్థాన్​తో ఉన్న సంబంధాల దృష్ట్యా అది ఇలా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి.  ఏకంగా తనకు దక్కిన వీటో అధికారంతో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్​ తీర్మానాన్ని బ్లాక్​లిస్టులో పెట్టింది. ఇటీవల ఇండియాకు తోడు  ఫ్రాన్స్​, అమెరికా, బ్రిటన్​ కూడా చైనాపై ఒత్తిళ్లు తెచ్చాయి. వీటో పవర్​ను ఉపయోగించి ఇన్నాళ్లూ ఇండియా ప్రతిపాదనను అడ్డుకున్న చైనా.. ఇప్పుడు అదే వీటో పవర్​నుఉపయోగించి ఇతర దేశాలు తనను ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్​ నుంచి తొలగిస్తే ఏమిటన్న సందేహంలో పడింది. దీంతో తన పాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కౌన్సిల్​ దృష్టికి తెచ్చింది. మంగళవారం బీజింగ్​లో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గేంగ్​ షుయాంగ్​ మాట్లాడుతూ.. తమ నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితికి తెలిపామని, ఫైనల్​ చేసిది సమితియేనని చెప్పారు.

పుల్వామాను ప్రస్తావించిన ఫ్రాన్స్​

ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన టెర్రర్​ దాడిలో 41 మంది జవాన్లు చనిపోయారు. ఈ దాడి వెనుక మసూద్​ అజార్​ హస్తం ఉందని  ఐక్యరాజ్యసమితి తీర్మానంలో ఫ్రాన్స్​ కూడా పేర్కొంది. పుల్వామా దాడిని అది ప్రధానంగా ప్రస్తావించింది.

స్వాగతించిన ప్రపంచ దేశాలు

మసూద్​ అజార్​ను గ్లోబల్​ టెర్రరిస్టుగా ప్రకటించడాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. అజార్​ ఆస్తులను సీజ్​ చేస్తామని, పర్యటనలను నిషేధిస్తామని అమెరికా ప్రకటించింది. పాకిస్థాన్​ భవిష్యత్తు కోసం ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ తీసుకుంటున్న చర్యలను తాము అభినందిస్తున్నామని, ఐరాస తీర్మానాన్ని ఆయన అమలు చేస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది.  పుల్వామా వంటి దాడుల్లో పాత్ర ఉన్న అజార్​ను గ్లోబల్​ టెర్రరిస్టుగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది. టెర్రరిజంపై కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

అమలు చేస్తామన్న పాక్​

యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాన్ని తాము అమలు చేస్తామని పాకిస్థాన్​ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని రాజకీయ పార్టీలందరితో సంప్రదించి ముందుకు వెళ్తామని పేర్కొంది. ఇది ఇండియా విజయంగా అక్కడి మీడియా ప్రస్తావిస్తోందని, ప్రపంచ దేశాలు కలిసి రావడంతోనే సాధ్యమైందన్న విషయాన్ని మరిచిపోవద్దని పాకిస్థాన్​ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహమ్మద్​ ఫైసల్​ అన్నారు.

ఇప్పుడు ఏం జరుగుతుంది?

జైషే మహ్మద్​ టెర్రర్​ సంస్థ చీఫ్​ మసూద్​ అజార్​ను ఐక్యరాజ్యసమితి ‘గ్లోబల్​ టెర్రరిస్టు’గా ముద్రవేయడంతో ఇక అతడ్ని ఐరాసలోని సభ్యదేశాలు  టెర్రరిస్టుగానే చూస్తాయి. అజార్​ ఆస్తులన్నింటినీ, అతడి సంస్థ ఆస్తులన్నీ ఫ్రీజ్​ చేస్తారు. సంస్థకు అందే ఫండింగ్​ను ఎక్కడికక్కడ నిలిపివేస్తారు. నిధులు వచ్చే మార్గాలను మూసేస్తారు. అజార్​, అతడి సంస్థ పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలను క్లోజ్​ చేస్తారు. బ్యాంకుల నుంచి నిధులు వెళ్లకుండా చూస్తారు.

పర్యటనలపై నిషేధం

అజార్ విదేశాలకు ప్రయాణం చేసే అవకాశాన్ని కోల్పోతాడు. పర్యటనలపై నిషేధం అమలులోకి వస్తుంది. జైషే మహ్మద్​ సంస్థ సభ్యులకూ ఇది వర్తిస్తుంది. సంస్థలోని సభ్యులు ఎవరు కూడా విదేశాల్లో పర్యటించలేరు. ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాలన్నీ అజార్​కు అందే ఆయుధ సరఫరాను పూర్తిగా నియంత్రిస్తుంది. అతడి అనుచరులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. జైషే మహ్మద్​ సంస్థకు ఫండింగ్​ నిలిచిపోనుంది. దీంతో అజార్​, అతడి అనుచరులకు ముప్పేట దాడి ఎదురవుతుంది. ఫలితంగా ఆ సంస్థ టెర్రర్​ కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది.

పాక్​ ఏం చేయనుంది?

మసూద్​ అజార్​ను గ్లోబల్​ టెర్రరిస్టుగా ప్రకటించడంతో ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి పాకిస్థాన్​ మీద పడింది. తమ దేశంలో టెర్రర్​ సంస్థలను ప్రోత్సహించడం లేదంటూ చెప్పుకొస్తున్న ఆ దేశానికి ఐక్యరాజ్యసమితి తీర్మానంతో ఓ రకంగా పరువుపోయినట్లయింది. పాకిస్థాన్​లోనే పుట్టి.. అక్కడే పెరిగి.. ఇప్పుడు అక్కడే ఉంటున్న మసూద్​ అజార్​విషయంలో ఇప్పుడు పాక్​ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐరాస తీర్మానాన్ని తాము స్వాగతిస్తున్నామని పాక్​ ప్రకటించింది. రాజకీయ పక్షాలతో చర్చించి ముందుకు వెళ్తామని తెలిపింది. ఐరాస తీర్మానాన్ని పాక్​ తప్పకుండా అమలు చేయాలి. అజార్, జైషే మహ్మద్​ సంస్థ కార్యకలాపాలను అడ్డుకోవాలి. ఆ సంస్థ సభ్యులను అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. అజార్​ను కూడా అరెస్టు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాక్‌లోని లష్కరే తోయిబా సంస్థను కూడా గ్లోబల్​ టెర్రర్​సంస్థగా ఐక్యరాజ్యసమితి ప్రకటించి ఉంది. అయితే..ఆ సంస్థను కట్టడి చేయడంలో పాక్​ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అజార్​, అతడి సంస్థపై ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

మొదటి నుంచి అంతే..

1994లో జమ్మూకాశ్మీర్​లోని శ్రీనగర్​లో టెర్రర్​ కార్యకలాపాలకు పాల్పడుతూ ఇండియన్​ ఆర్మీకి మసూద్​ అజార్​ చిక్కాడు. 1999లో ఐసీ 184 విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్​చేసి అఫ్ఘనిస్థాన్​లోని కాందహార్​కు తీసుకెళ్లి.. బందీలను విడిపించడానికి బదులుగా అజార్​తో పాటు మరికొందరు టెర్రరిస్టులను విడిచిపెట్టాలన్న డిమాండ్​ మేరకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి విడిచిపెట్టింది. దీంతో అజార్​ పాక్​లోని దక్షిణ పంజాబ్​కు చేరుకొని తన కార్యకలాపాలను సాగించాడు. ఐక్యరాజ్యసమితి 2002లో జైషే మహ్మద్​ సంస్థను టెర్రరిస్ట్ సంస్థల జాబితాలో చేర్చింది.  అప్పుడే పాకిస్థాన్​ కూడా ఆ సంస్థను నిషేధించింది. కానీ అజార్​ను మాత్రం అరెస్ట్ చేయలేదు.

తమ దేశంలోనే ఉండి.. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న అజార్​ను కట్టడిచేయని పాక్​పై ఇతర దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చాయి.  2008లో ముంబై దాడుల వెనుక అజార్‌తోపాటు మరికొందరు ఉన్నారని, వారిని అప్పగించాలని పాక్​ను ఇండియా కోరినా వినిపించుకోలేదు. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి తర్వాత పాక్ అధికారులు అజార్​ను ‘ప్రొటెక్టివ్ కస్టడీ’లోకి తీసుకున్నా.. అటు తర్వాత స్వేచ్ఛగా వదిలేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన టెర్రర్​ దాడి వెనుక కూడా అజార్​ సంస్థ జైషే మహ్మద్​ ఉందని తేలడంతో ఇండియా అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చింది.

ఏంటీ 1267 తీర్మానం?

టెర్రరిస్టులను కట్టడి చేయడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలు 1999లో 1267 తీర్మానానికి ఊపిరిపోశాయి . అల్ ఖైదా,తాలిబన్లను అదుపు చేయడానికి అమెరికా ఈ తీర్మానాన్నే వాడుకుంది. అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్‌లాడెన్‌ను ఈ తీర్మానం కిందే అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించారు. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి ఈ తీర్మానానికి మరిన్ని మెరుగులు దిద్దింది. ఆర్గనైజేషన్, టెర్రరిస్టు ఆస్తులు ఫ్రీజ్ చేసేలా, దేశం దాటిపోకుండా ఉండేలా మార్పులు తెచ్చిం ది. ఇప్పుడు మసూద్ అజర్ ను 1267 తీర్మానం ప్రకారమే అంతర్జా తీయ టెర్రరిస్టుగా ప్రకటించారు.

మోడీ చేతుల్లో ఇండియా సేఫ్​: జైట్లీ

ప్రధాని మోడీ చేతుల్లో ఇండియా సురక్షితంగా ఉంటుందనేది మరోసారి రుజువైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​జైట్లీ అన్నారు.  మోడీ అనుసరించిన విదేశీ విధానం, ఒత్తిళ్ల ఫలితంగానే అజార్​ను గ్లోబల్​ టెర్రరిస్టుగా ప్రకటించారని, ఇది చరిత్రాత్మక విజయమని అన్నారు. మోడీ ప్రధానిగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనడానికి ఇది నిదర్శనమని తెలిపారు.వెంటనే అజార్​ను అరెస్టు చేయాలని పాకిస్థాన్​ను ఎస్పీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​ డిమాండ్​ చేశారు.

హ్యాపీగా ఉంది: మన్మోహన్‌

అజార్‌ను గ్లోబల్‌ టెర్రరిస్టుగా ప్రకటించడంపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు . ‘ఐ యామ్‌ హ్యాపీ.. ఎట్టకేలకు నెరవేరింది’ అని స్పందించారు

ఇండియాకు దక్కిన భారీ విజయం

‘‘మసూద్​ అజార్​ను గ్లోబల్​ టెర్రరిస్టుగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిలో ఇండియా అనుపెరుగకుండా పోరాటం చేసింది.  ఆలస్యమైనా విజయం సాధించాం. ఇది మన దేశానికి దక్కిన భారీ విజయం. నిజాన్ని వ్యతిరేకేస్తూ వచ్చిన వాళ్లు కూడా ఇప్పుడు తీరు మార్చుకోవాల్సి వచ్చింది. గతంలో రిమోట్​ కంట్రోల్​ ప్రభుత్వ హయాంలో కనీసం ప్రధానమంత్రి గొంతు కూడా వినిపించేది కాదు.  ఇప్పుడు ఏకంగా 130 కోట్ల ఇండియన్స్​ గొంతు ఐక్యరాజ్యసమితిలో ప్రతిధ్వనించింది. ఇండియాకు మద్దతు తెలిపిన అన్ని దేశాలకు కృతజ్ఞతలు. టెర్రరిజానికి వ్యతిరేకంగా పాకిస్థాన్​ బహిరంగా మాట్లాడినప్పుడే ఆ దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది.’’

– ప్రధాని నరేంద్రమోడీ

 

Latest Updates