యూఎన్​.. ఖజానా ఖాళీ

ఐక్యరాజ్యసమితి.. ప్రపంచ దేశాల మధ్య తగాదాలను తీర్చే పెద్దన్న. యుద్ధాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పేదలను మానవత్వంతో ఆదుకునే మనసున్న సంస్థ. ఈ అంతర్జాతీయ సంఘం​ ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక అష్టకష్టాలు పడుతోంది. 230 మిలియన్​ డాలర్ల లోటుతో భారంగా నెట్టుకొస్తోంది. 37 వేల మంది ఉద్యోగులకు వచ్చే నెల జీతాలు ఇచ్చే స్తోమత లేక దీనంగా చూస్తోంది. 193 సభ్య దేశాల్లో 64 దేశాలు బాకీ పడటం వల్లే సమితికి ఈ సమస్య వచ్చింది. పేమెంట్లు ఇవ్వని దేశాల లిస్టులో ఇండియా లేకపోవటం విశేషం.

మరో ప్రపంచ యుద్ధం రాకుండా చూడటంలో దాదాపు 75 ఏళ్లుగా సక్సెస్​ అవుతున్న ఐక్యరాజ్యసమితిని  ఆర్థిక సమస్యలు తీవ్రంగా చుట్టుముట్టాయి. ప్రతి సంవత్సరం ఓవరాల్​ ఆపరేటింగ్ బడ్జెట్​ బిలియన్​ డాలర్లలో ఉండటం, సభ్య దేశాలు చందాలను ఎగ్గొట్టడంతో డబ్బుల్లేక డీలా పడింది. ఉద్యోగులకు వచ్చే నెల జీతాలు ఇవ్వటానికే కాదు.. చివరికి మీటింగ్​లు పెట్టడానికి కూడా సంస్థ దగ్గర సరిపోను నిధుల్లేని దుస్థితి ఏర్పడింది. సెప్టెంబర్​ నెలాఖరికి సమితి 200 మిలియన్​ డాలర్లకుపైగా లోటుతో దినదిన గండంలా గడుపుతోంది.

కంట్రిబ్యూషన్స్​ చెల్లించకుండా కాలం వెళ్లబుచ్చుతున్న కంట్రీస్​ లిస్టులో అమెరికా, బ్రెజిల్​, అర్జెంటీనా, మెక్సికో, ఇరాన్​, వెనెజులా; నార్త్​, సౌత్​ కొరియాలు; కాంగో, ఇజ్రాయెల్​, సౌదీ అరేబియా వంటి 64 దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏ దేశాలు బకాయి పడ్డాయో సమితి అఫిషియల్​గా చెప్పదు. అయితే ఖజానా నిండుకోవటంపై యూఎన్​ఓ సెక్రటేరియట్​ లేటెస్ట్​గా ఉద్యోగులకు లెటర్​ రాయటం చర్చనీయాంశమైంది. ఇది జరిగిన తెల్లారే యూఎన్​ఓ సెక్రెటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​ కూడా స్పందించారు.

వచ్చే పదేళ్లు మరింత వరస్ట్​!

పరిస్థితిలో మార్పు రాకపోతే వచ్చే పదేళ్లు మరింత వరస్ట్​గా గడుస్తాయని గుటెరస్​ హెచ్చరించారు. సంస్థ వద్ద ఉన్న లిక్విడిటీ రిజర్వ్​లు అక్టోబర్​ నెలాఖరికి మరిన్ని అడుగంటుతాయని, ఫలితంగా స్టాఫ్​కి, వెండర్లకి పేమెంట్లు చేయలేక డిఫాల్ట్​ కావాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సివిల్​ వార్​తో చితికిపోయిన సిరియా సైతం కంట్రిబ్యూషన్​ని​ వాయిదా వేయకుండా ఇచ్చిందని యూఎన్​ఓ స్పోక్స్​ మ్యాన్​ స్టీఫేన్​ డుజారిక్ రోజువారీగా ఏర్పాటు చేసే ప్రెస్​ కాన్ఫరెన్స్​లో మొన్నే తెలిపారు.

సమితి ఇటీవల ఆర్థికంగా దిగజారుతుండటంతో ఈ ఏడాది ఆరంభం నుంచే ఖర్చులను తగ్గించే కార్యక్రమం మొదలుపెట్టామని, లేకపోతే ఈపాటికి లోటు 600 మిలియన్​ డాలర్లకు చేరేదని ఆయన వివరించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం వల్లే సెప్టెంబర్​లో జనరల్​ అసెంబ్లీని విజయవంతంగా నిర్వహించామని, ఆ భేటీకి ప్రపంచ దేశాల నేతలు హాజరయ్యారని అన్నారు. చందాలు కట్టిన 129 దేశాలకు​ ఆంటోనియో గుటెరస్​ ‘థ్యాంక్స్’​ చెప్పారు. డ్యూ ఉన్న దేశాలు అర్జెంట్​గా ఫుల్​ పేమెంట్లు చేయాలని కోరారు.

పీస్​ కీపింగ్​ ఖర్చులు మినహా సమితి 2018–19లో వివిధ ఆపరేషన్స్​కి కేటాయించిన బడ్జెట్టే​ దాదాపు 5.4 బిలియన్​ డాలర్లు. ఇందులో 22 శాతాన్ని అమెరికా భరిస్తోంది. కానీ ఆ దేశం ఇప్పటి వరకు సుమారు 1.4 బిలియన్​ డాలర్లు చెల్లించాల్సి ఉంది. పీస్​ కీపింగ్​కి ఎక్కువ నిధులు ఇచ్చేది అమెరికానే. అయితే డొనాల్డ్​ ట్రంప్​ ప్రెసిడెంట్​ అయ్యాక యూఎన్​కి చెల్లించే ఫండ్స్​ విషయంలో ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. కంట్రిబ్యూషన్స్​లో కోతలు పెడుతూ, కాస్ట్​ సేవింగ్​ రిఫార్మ్స్​ని ముందుకు తెస్తోంది.

పట్టించుకోని సభ్య దేశాలు

ఇప్పటి నుంచి ఈ ఏడాది చివరి వరకు ఖర్చులపై మరిన్ని పరిమితులు విధిస్తామని, ఇందులో భాగంగా కొన్ని కాన్ఫరెన్స్​లను, మీటింగ్​లను వాయిదా వేసే సూచనలు ఉన్నాయని యూఎన్​ఓ చీఫ్​ గుటెరస్​ చెప్పారు. ముఖ్యమైన అఫిషియల్​ ప్రయాణాలను నిలిపేయబోమని, కాకపోతే సర్వీసులను కొంచెం తగ్గిస్తామని స్పష్టం చేశారు. కాస్ట్​ కట్​ చర్యలను గుటెరస్​ ఇప్పటికిప్పుడు మొదలుపెట్టలేదని, బడ్జెట్​ ఇష్యూస్​ని కొంత కాలంగా సభ్య దేశాలతో ప్రస్తావిస్తూనే ఉన్నా అవి పట్టించుకోవట్లేదని యూఎన్​ఓ ఆఫీసర్లు గుర్తుచేస్తున్నారు.

Latest Updates