ఢిల్లీలో భ‌ర్త మృతి: డెడ్‌బాడీ తెప్పించ‌లేక బొమ్మకు అంత్య‌క్రియ‌లు

బ్ర‌తుకుదెరువు కోసం భార్యాబిడ్డ‌ల్ని సొంతూరులోనే వ‌దిలి యూపీ నుంచి ఢిల్లీకి వెళ్లిన ఓ వ్య‌క్తి అనారోగ్యం కార‌ణంగా అక్క‌డే మృతి చెందాడు. లాక్ డౌన్ కార‌ణంగా అతని మృత‌దేహాన్ని స్వ‌గ్రామానికి తీసుకురావడం సాధ్యప‌డ‌క‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆ వ్య‌క్తి యొక్క న‌మూనాగా ఓ బొమ్మ‌ను తెచ్చి సాంప్ర‌దాయం ప్ర‌కారం క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించారు‌. ఈ సంఘ‌ట‌న యూపీలోని గోరఖ్‌పూర్‌ జిల్లా దుమ్రీఖుండ్ గ్రామంలో జ‌రిగింది.

గ్రామానికి చెందిన సునీల్ (38) ప‌ని కోసం ఢిల్లీకి వెళ్లాడు. అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రి పాలై చికిత్స పొందుతూ అక్క‌డే చ‌నిపోయాడు . ఈ విషయాన్ని ఈ నెల 14న అతడి ఫోన్‌ నుంచే ఢిల్లీకి చెందిన ఒక పోలీసు దుమ్రీఖండ్‌లోని కుటుంబ సభ్యుల‌కి తెలిపాడు. ఢిల్లీ నుంచి అత‌ని గ్రామానికి డెడ్ బాడీని తీసుకురావాలంటే రూ. 25 వేలు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని చెప్పాడు . పేద కుటుంబం కావ‌డంతో అన్ని డ‌బ్బులు లేక ఓ న‌మూనా బొమ్మ‌తో‌ సంప్రదాయం ప్రకారం.. ఏడాది వ‌య‌స్సున్న సునీల్ కొడుకుతో కర్మకాండలు జ‌రిపించామ‌ని సునీల్ తండ్రి రాధే శ్యామ్ తెలిపాడు.

ఈ విష‌యం తెలుసుకున్న సీఎం యోగి ఆదిత్య నాథ్ మృతదేహాన్ని గోరఖ్‌పూర్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఢిల్లీ అధికారులకు విజ్ఞప్తి చేశారు . సీఎం ఆదేశాల‌తో గోరఖ్‌పూర్‌ జిల్లా యంత్రాంగం కూడాసునీల్ మృతదేహాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. సునీల్ కు ఒక కొడుకుతోపాటు నలుగురు ఆడపిల్లలు పిల్లలు ఉన్నారు.

Latest Updates