ఆపరేట్ చేయలేక చోరీ చేసిన రూ.45 వేల ఫోన్ తిరిగిచ్చేశాడు

కోల్‌కతా: రూ. 45 వేల రూపాలయ విలువైన ఫోన్ చోరీ చేసిన దొంగ ..ఆ ఫోన్ ను మళ్లీ తిరిగి ఇచ్చేశాడు. మంచి మనసుతో కాదులెండి.  దానిని ఆపరేట్ చేయడం చేతకాక పోవడంతో, ఆ ఫోనును తిరిగి దానిని పోగొట్టుకున్న వ్యక్తికి ఇచ్చేశాడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని వర్థమాన్ జిల్లాలో జరిగింది. జమాల్‌పూర్‌లో గల ఒక మిఠాయి దుకాణంలో ఒక వ్యక్తి రూ. 45 వేల విలువైన ఫోనును మరచిపోయారు. ఈ ఫోనును 22 ఏళ్ల యువకుడు చోరీ చేశాడు. ఇంతలో తన ఫోను పోయిందంటూ, ఆ ఫోను పోగొట్టుకున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తరువాత ఆ ఫోనుకు కాల్ చేశాడు. దీంతో ఫోను చోరీ చేసిన యువకుడు ఆ కాల్ రిసీవ్ చేసుకుని, ఆ ఫోనును తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఫోనును తాను ఆపరేట్ చేయలేకపోతున్నానని, అందుకే వాపస్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. దీంతో ఆ ఫోనును పోగొట్టుకున్న వ్యక్తి దానిని దొంగిలించిన యువకుని ఇంటికి వెళ్లి, తన ఫోనును తీసుకున్నాడు. ఈ సమయంలో పోలీసుల కూడా ఫోన్ చోరీ చేసిన యువకుని ఇంటికి వచ్చారు. అయితే ఫోను పోగొట్టుకున్న వ్యక్తి వినతి మేరకు పోలీసులు ఫోను చోరీచేసిన యువకునిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టేశారు.

Latest Updates