గ్రేటర్ పరిధిలో 1000 అక్రమ లేఅవుట్లు: HMDA కొరడా!

అక్రమ వెంచర్లు, లేఅవుట్లపై హెచ్ఎండీఏ కొరడా ఝుళిపిస్తోంది. ఏప్రిల్​29న మొదలెట్టిన స్పెషల్​డ్రైవ్ ఈనెల10వ తేదీ వరకు కొనసాగనుంది. హెచ్ఎండీఏ పరిధిలో విస్తరించిన మండలాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు తిరుగుతూ వెంచర్ల అనుమతులను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు1000 వరకు అక్రమ వెంచర్లను గుర్తించినట్లు తెలిసింది. ఆయా అక్రమ వెంచర్లకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. గుర్తించిన వాటిపై కఠిన చర్యలకు తీసుకునేందుకు యంత్రాంగం సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో నగరం చుట్టూ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వెంచర్ల బిల్డర్లు, రియల్టర్లలో గుబులు మొదలైంది. అలాగే స్పెషల్​ చేపట్టడానికి ముందు గుర్తించి, నోటీసులు ఇచ్చిన వాటిపై కూడా అధికారులు ఫోకస్​పెట్టినట్లు సమాచారం. సదరు వెంచర్ల బిల్డర్లు, రియల్టర్లు ఇప్పటి వరకు అనుమతులకు ఎందుకు దరఖాస్తులు చేసుకోలేదన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

భాగ్యనగరం చుట్టూ మొత్తం ఏడు జిల్లాలు.. 70 మండలాలు..1032 గ్రామాలు.. 7,257 చ.కిమీ.పరిధిలో హెచ్ఎండీఏ  విస్తరించి ఉంది. ఆయా ప్రాంతాల అభివృద్ధిలో హెచ్ఎండీఏ కీలక పాత్ర పోషిస్తోంది. మహానగరం శివారుల్లో భారీ ప్రాజెక్టులు, పెద్దపెద్ద కంపెనీల రాకతో భూముల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ప్రాంతాన్ని బట్టి గజానికి రూ.20 నుంచి 30 వేల వరకు ధర పలుకుతోంది. కొందరు రియల్టర్లు మాత్రం ఎకరం చొప్పున భూములు కొనుగోలు చేస్తున్నారు. ప్లాట్లుగా చేసి విక్రయాలు చేస్తున్నారు. హెచ్​ఎండీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో వెంచర్లు చేయాలంటే డైరెక్టర్​ఆఫ్​ టౌన్, కంట్రీ ప్లానింగ్​(డీటీసీపీ) అధికారుల అనుమతులు కచ్చితంగా తీసుకోవాలి. అయితే కొందరు నిబంధనలు పక్కనబెట్టి వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రజలకు భూములు అంటగడుతున్నారు. కొన్నాళ్లకు అసలు విషయం తెలుసుకున్న లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

శివారులో..
ముఖ్యంగా భువనగిరి, బీబీనగర్‌‌‌‌, ఘట్​కేసర్, పోచంపల్లి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కీసర, శామీర్​పేట, కుత్బుల్లాపూర్, బాచుపల్లి, దుండిగల్,  బొమ్మలరామారం తదితర ప్రాంతాల్లో వేలల్లో వెంచర్లు వెలిశాయి. ఇందులో కొన్ని హెచ్ఎండీఏ అనుమతులతో ప్లాట్లుగా క్రయవిక్రయాలు సాగుతుంటే, వందలాది లేఅవుట్లకు అనుమతులు లేవని హెచ్ఎండీఏ అధికారులు ఇదివరకే గుర్తించారు. వీటిలో ప్లాట్లు కొనుగోలు చేసిన చాలామంది బాధితులు నేటికీ హెచ్ఎండీఏ హెడ్డాఫీసు చుట్టూ తిరుగుతున్నారు.

పది తర్వాత ఉండకూడదు
అక్రమ వెంచర్లకు అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ అక్రమ రియల్ వ్యాపారం కొనుసాగుతోంది. నడుస్తున్న దందాపై హెచ్ఎండీఏకు ఫిర్యాదులు వస్తుండటంతో కమిషనర్ ఇష్యూను సీరియస్​గా తీసుకున్నారు. స్పెషల్​డ్రైవ్ ద్వారా అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. 10వ తేదీ తరువాత హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడా అనుమతులు లేని వెంచర్లు, లేఅవుట్లు ఉండరాదని కమిషనర్​ ఆదేశాలు జారీ చేయడంతో టౌన్​ప్లానింగ్​ అధికారులు అప్రమత్తమయ్యారు. మండలానికి ఇద్దరు చొప్పున తిరుగుతూ ఇప్పటి వరకు వెయ్యి వరకు అక్రమ వెంచర్లు ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం. వాటికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అనుమతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం సిద్ధమైనట్లు సమాచారం. హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న  స్పెషల్ డ్రైవ్ తో అక్రమ వెంచర్లు, అక్రమ లేఅవుట్లను తయారు చేస్తున్న రియల్టర్లు, బిల్డర్లలో ఆందోళన నెలకొన్నది.

Latest Updates