శ్రీనగర్‌లోకి నా హయాంలో ఉగ్రవాదులు ప్రవేశించలేదు

 శ్రీనగర్‌లోకి నా హయాంలో ఉగ్రవాదులు ప్రవేశించలేదు

జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌గా  తాను ఉన్నప్పుడు ఉగ్రవాదులు శ్రీనగర్‌లోకి ప్రవేశించలేదని.. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మరోలా ఉన్నదని ప్రస్తుత మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తెలిపారు. ఉగ్రవాదులు శ్రీనగర్‌లో పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి హత్యలు చేయడంపై సోమవారం ఆయన స్పందించారు. నేను జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో శ్రీనగర్‌లోని 50-100 కిలోమీటర్ల పరిధిలోకి ఉగ్రవాదులు ప్రవేశించలేదని తెలిపారు. కానీ ఇప్పుడు ఉగ్రవాదులు శ్రీనగర్‌లోని పేద ప్రజలను చంపుతున్నారని... ఇది నిజంగా బాధాకరమన్నారు మాలిక్.

2018 ఆగస్ట్‌ నుంచి 2019 అక్టోబర్‌ వరకు జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ ఉన్నారు. ఆయన హయాంలో రాష్ట్రపతి పాలన కొనసాగడంతోపాటు 2019 ఆగస్ట్‌ 5న ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్‌, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.

ఆ తర్వాత 2019 నవంబర్‌ నుంచి 2020 ఆగస్ట్‌ 18 వరకు గోవా గవర్నర్‌గా ఉన్న సత్యపాల్‌ మాలిక్‌.. 2020 ఆగస్ట్‌ 20 నుంచి మేఘాలయ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు.