తడారిపోతున్న భూగర్భం

underwater-drying-in-hyderabad-very-fast
  • పాతాళం దాకా తోడేస్తున్నం
  • భూమిలోకి ఇంకేది బిందెడు.. తోడేది మూడు బిందెలు
  • హైదరాబాద్‌లో ఇంకుతున్న నీళ్లకన్నా తోడుతున్న నీళ్లు 341 శాతం ఎక్కువ
  • ఎనిమిది జిల్లాల్లో డేంజర్‌ బెల్స్‌
  • హెచ్చరించిన సెంట్రల్​ గ్రౌండ్ వాటర్​ బోర్డు

వెలుగు, హైదరాబాద్: బిందెడు నీళ్లు భూమిలో ఇంకితే మూడు బిందెల నీళ్లను తోడేస్తున్నాం. భూగర్భం లోతుల్లోకి వెళ్లి చుక్కచుక్కను లాగేస్తున్నాం. ఏడాదికి 41.48 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎం) గ్రౌండ్​ వాటర్​ రీఛార్జ్ అయితే బోర్లతో ఏకంగా 141 ఎంసీఎంల నీటిని గుంజేస్తున్నాం. అంటే ఇంకుతున్న నీటితో పోలిస్తే ఏకంగా 341 శాతం అదనంగా వాడేస్తున్నాం! రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌లో పరిస్థితి ఇది. ఇక్కడే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. సెంట్రల్ గ్రౌండ్​ వాటర్ బోర్డు ఈ వివరాలను వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన గ్రౌండ్ వాటర్ స్టేటస్ రిపోర్టు(2016–17) లెక్కలు రాష్ట్రంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిన తీరును కళ్లకు కట్టాయి.

ఇట్లయితే సిటీకి కష్టకాలమే!

ఈ రిపోర్టు ప్రకారం హైదరాబాద్‌‌కు అత్యంత ప్రమాదకర పరిస్థితి పొంచి ఉంది. ములుగు, నారాయణపేట మినహాయించి..  రాష్ట్రంలోని 31 జిల్లాల డేటాను ఈ రిపోర్టు విశ్లేషించింది. సిటీలో భూగర్భ జలాల వాడకం అంచనాలను దాటి పోయింది. భూమిలోకి ఇంకుతున్న నీటితో పోలిస్తే తోడుతున్న నీరు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటం, ఈ గ్యాప్‌‌ ఏటేటా పెరుగుతుండటంతో మున్ముందు మరింత గడ్డుకాలం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్​లోని చాలా ప్రాంతాల్లో  ప్రజలు ఎండాకాలంలో తాగునీటికి అల్లాడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లను తెచ్చుకుంటున్నారు. నిరుడు ఎండాకాలంతో పోలిస్తే  భూగర్భ జల మట్టం సిటీలో సగటున మూడు మీటర్ల లోతుకు పడిపోయింది. తిరుమలగిరిలో అత్యధికంగా 10.47 మీటర్ల లోతుకు పడిపోయింది.

ఎనిమిది జిల్లాలు క్రిటికల్

హైదరాబాద్​తర్వాత మేడ్చల్, సిద్దిపేట, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల​,రంగారెడ్డి జిల్లాల్లో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నదులు, కాల్వలు లేకపోవటం, బోర్లు, బావులపైనే ఆధారపడటంతో ఈ ఎనిమిది జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ రిస్క్ లో పడింది. రీఛార్జ్​ అయ్యే నీటితో పోలిస్తే ఈ జిల్లాలన్నింటా నీటి వినియోగం 82 శాతాన్ని మించిపోయింది. చెరువులు, కుంటలన్నీ ధ్వంసం కావటం, జల వనరులు అక్రమణలకు గురి కావడంతో హైదరాబాద్‌, దాని చుట్టు పక్కల జిల్లాల్లో భూగర్భ జలాల వినియోగం అదుపు తప్పింది.

రీఛార్జి అయ్యే నీటితో పోలిస్తే సిటీలో అత్యధికంగా 341 శాతం వాడుతుంటే.. మేడ్చల్‌లో 94 శాతం, రంగారెడ్డిలో 81 శాతం తోడేస్తున్నారు. మేడ్చల్‌ జిల్లాలో ఏటా 78 ఎంసీఎం నీరు  భూమిలోకి ఇంకితే.. 78 ఎంసీఎంలను ప్రజలు వాడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 380 ఎంసీఎం నీరు భూమిలోకి ఇంకుతుంటే 309 ఎంసీఎం నీటిని ప్రజల అవసరాలకు, 69 ఎంసీఎం నీటిని ఇరిగేషన్‌ కోసం వాడుతున్నారు. ఇక మెట్ట ప్రాంతంలో ఉన్న సిద్దిపేట, జనగామ, వరంగల్ అర్బన్​, వరంగల్​ రూరల్, రాజన్న  సిరిసిల్ల జిల్లాలన్నింటా వ్యవసాయం, ప్రజల అవసరాలకు బావులు, బోర్లే దిక్కు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్​స్కీం అమల్లో ఉండటం, రైతులు ఆటోమేటిక్‌ స్టార్టర్లు వాడుతుండటంతో ఈ ఏరియాల్లో భూగర్భ జలాల వినియోగం భారీగా పెరిగింది. సిద్దిపేట జిల్లాలో ఏటా రీచార్జి అవుతున్న గ్రౌండ్ వాటర్ 465 ఎంసీఎంలు ఉండగా.. 436 ఎంసీఎంల నీటిని తోడేస్తున్నారు.

భవిష్యత్తు అవసరాలకు అందుబాటులో ఉంటున్న నీరు కేవలం 34 ఎంసీఎంలు. ఇక్కడ కూడా 94 శాతం భూగర్భ జలాలను తోడేస్తున్నరు. జనగామ లాంటి గ్రామీణ జిల్లాల్లోనూ పరిస్థితి ఏం బాగాలేదు. ఇక్కడ సంవత్సరానికి 301 ఎంసీఎంల నీరు ఇంకితే 278 ఎంసీఎంల(92%) నీటిని తోడేస్తున్నరు. వరంగల్ అర్బన్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ సంవత్సరానికి 202 ఎంసీఎంల నీరు భూమిలోకి ఇంకితే 183 ఎంసీఎంల నీటిని(91%) తోడుతున్నారు.

సేఫ్ జోన్​లో ఐదు జిల్లాలే

కుమ్రంభీం అసిఫాబాద్​, కొత్తగూడెం, నిర్మల్​, మంచిర్యాల, జోగులాంబ గద్వాల జిల్లాలు మిగతా జిల్లాతో పోలిస్తే కాస్త సేఫ్ గా  ఉన్నాయి. అక్కడ ఏటా భూమిలోకి రీఛార్జి అయ్యే నీటిలో 23 శాతం మాత్రమే వినియోగిస్తున్నారు. గోదావరి ప్రవహిస్తున్న కొత్తగూడెం, నిర్మల్​, మంచిర్యాల జిల్లాల్లోనూ గ్రౌండ్ వాటర్‌కు ఢోకా లేదు. పరివాహక ప్రాంతం కావటంతో అక్కడ బోర్లు, బావుల వినియోగం తక్కువగా ఉండటం కలిసొచ్చింది. కృష్ణా, తుంగభద్ర నదులు ఉండటంతో గద్వాల జిల్లా కూడా సేఫ్​ జోన్​లో ఉంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గ్రౌండ్ వాటర్ లెవల్స్ పడిపోతున్నాయిలా..

ప్రాంతం                    మే-18(మీటర్లలో)          మే-19(మీటర్లలో)          తేడా

అమీర్ పేట                   19.35                        19.40                  -0.05

ఆసిఫ్ నగర్                   6.95                          7.74                     0.79

బండ్లగూడ`                   12.70                        15.38                   -2.68

బహదూర్ పురా             2.10                            2.31                    -0.21

చార్మినార్                     6.46                           8.02                     1.56

హిమాయత్ నగర్           6.75                           7.02                      -0.56

ఖైరతాబాద్                    11.80                         14.78                     -2.98

మారేడ్ పల్లి                   20.52                          23.48                   -2.96

ముషీరాబాద్                   9.15                         11.31                     -2.16

నాంపల్లి                         2.37                            4.95                     -2.58

సైదాబాద్                       6.03                             7.64                     -1.61

సికింద్రాబాద్                    2.60                             2.69                    0.09

షేక్ పేట్                         5.95                           7.07                     1.12

తిరుమలగిరి                   11.54                          22.01                  -10.47

 

ఇంకుతున్న నీటిలో ఎంత శాతం తోడుతున్నామంటే..

జిల్లా                          శాతం

మేడ్చల్ మల్కాజ్‌గిరి      94

సిద్దిపేట                   94

జనగామ               92

వరంగల్ అర్బన్      91

వరంగల్ రూరల్     86

రాజన్న సిరిసిల్ల      82

రంగారెడ్డి             81

కామారెడ్డి          77

నిజామాబాద్      75

కరీంనగర్          75

యాదాద్రి భువనగిరి     75

నల్గొండ             74

జగిత్యాల          74

మహబూబాబాద్  72

సంగారెడ్డి          71

మహబూబ్‌నగర్  68

వనపర్తి                67

నాగర్‌‌కర్నూల్    66

ఖమ్మం           65

మెదక్             64

అదిలాబాద్       63

సూర్యాపేట        61

వికారాబాద్       56

భూపాలపల్లి      53

పెద్దపల్లి               52

జోగులాంబ గద్వాల    46

మంచిర్యాల       41

నిర్మల్               37

భద్రాద్రి కొత్తగూడెం 27

కొమరం భీం ఆసిఫాబాద్   23

Latest Updates